ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్షలో మొబైల్ ఫోన్ వినియోగించాడనే ఆరోపణ.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు.. కుల వివక్ష, వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌పై నమోదైన కేసు.. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలు.. చివరి గంటల్లో స్నేహితురాలితో సాహిల్ మాట్లాడిన మాటలు.. ఇలా ఈ వ్యవహారంలో పలు అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి.
మరణానికి కొన్ని గంటల ముందు సాహిల్(Sahil Wakode) తన సన్నిహిత స్నేహితురాలితో ఫోన్‌లో మాట్లాడినట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు జరిగిన ఈ సంభాషణే అతని చివరి ఫోన్ కాల్ అని తెలుస్తోంది.
ఆ కాల్‌లో “నేను తప్పు చేశాను. నా థర్మోడైనమిక్స్ పేపర్ కూడా సరిగ్గా రాయలేదు.. ఇప్పుడు ఇదీ జరిగింది” అని సాహిల్ చెప్పినట్లు స్నేహితురాలు దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా సాహిల్ స్పందించలేదట. ఈ సంభాషణలో సాహిల్ తాను కుల వివక్ష ఎదుర్కొన్నట్లు వ్యాఖ్యలు చేయలేదని కూడా దర్యాప్తు వర్గాలు తెలిపినట్లు సదరు కథనం వెల్లడించింది.
పరీక్ష హాల్లో అసలేం జరిగింది?
సెప్టెంబర్ 18న పరీక్ష జరుగుతున్న సమయంలో సాహిల్ మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు.. చాట్‌జీపీటీ ఉపయోగించి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నాలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా అతడిని ప్రశ్నించాడని, ఆయన అవమానించడంతోనే ఆ భారంతో సాహిల్ బలవనర్మరణానికి పాల్పడ్డాడన్నది ప్రధాన అభియోగం.
తాజాగా బయటకు వచ్చిన ఫుటేజీలో.. ముందు వరుసలో కూర్చున్న సాహిల్ వద్దకు ప్రొఫెసర్ వెళ్లి మాట్లాడటం కనిపిస్తోంది. సాహిల్ తన సీటు నుంచి లేచి, మళ్లీ కూర్చుని.. అనంతరం తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను ప్రొఫెసర్‌కు ఇచ్చినట్లు దృశ్యాల్లో కనిపించింది. కొద్దిసేపు ఇద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత సాహిల్ తన వస్తువులను సర్దుకుని పరీక్షా హాలు నుంచి బయటకు వెళ్లినట్లు ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది.
IIT Bombay case: CCTV footage from the examination hall has surfaced. Sahil Wakode is seen being taken outside the examination hall by Prof. #Suryanarayanadoolla after being caught cheating in the exam.#IITBombay #SahilWakode #CCTV #Mumbai pic.twitter.com/E5LekwfkDF
— Rajesh kumar (@journorajeshk) September 23, 2026
పోలీసులు ముఖ్యంగా పరీక్ష ముగియడానికి ముందు 12.30 నుంచి 12.45 గంటల మధ్య జరిగిన పరిణామాలను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో సాహిల్ తన జేబులోని ఏదో చూస్తున్నట్లు, దానిని గమనించిన ప్రొఫెసర్ అతడిని పక్కకు తీసుకెళ్లినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఆ కొన్ని నిమిషాల్లో ఇద్దరి మధ్య ఏం మాట్లాడారన్నది తెలుసుకునేందుకు పరీక్షా హాల్లో ఉన్న విద్యార్థుల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు.
ఆ తర్వాత ఏం జరిగింది?
పరీక్షా హాలు నుంచి బయటకు వచ్చిన సాహిల్ మధ్యాహ్నం సుమారు 1.25 గంటలకు తన హాస్టల్ గదికి వెళ్లినట్లు సీసీటీవీ ఆధారాలను పరిశీలించిన పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ తర్వాత అతడు బయటకు రాలేదని తెలుస్తోంది. కొన్ని గంటల అనంతరం హాస్టల్ గదిలో సాహిల్ మృతదేహం గుర్తించారు.
ఈ ఘటనతో ఐఐటీ బాంబే క్యాంపస్‌లో తీవ్ర ఆందోళన మొదలైంది. విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. విద్యార్థి సంక్షేమం, మానసిక ఆరోగ్య సహాయం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థతోపాటు ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పలు డిమాండ్లు చేశారు.
‘కుల వివక్షకు గురయ్యాడు’.. తల్లిదండ్రుల ఆరోపణ
సాహిల్ గతంలో తనకు కులపరమైన అవమానాలు, వివక్ష ఎదురవుతున్నాయని తల్లిదండ్రులతో చెప్పినట్లు వారు ఆరోపిస్తున్నారు. తన కుమారుడు ప్రొఫెసర్ దుల్లా(Suryanarayanadoolla) నుంచి వివక్ష ఎదుర్కొంటున్నాడని తండ్రి రవీంద్ర వాకోడే ఆరోపించారు. తమ కుమారుడి మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా సహా పలువురిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలు, ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీస్) చట్టంలోని నిబంధనలు చేర్చారు. కేసు దర్యాప్తును ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టింది.
ప్రొఫెసర్‌కు ఐఐటీ ఫ్యాకల్టీ మద్దతు
మరోవైపు ప్రొఫెసర్ దుల్లాకు ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం మద్దతుగా నిలిచింది. పరీక్షలో అనధికారికంగా మొబైల్ వినియోగించిన ఘటనను ఇన్విజిలేటర్‌గా నివేదించడం తన విధుల్లో భాగమేనని ఫోరం పేర్కొంది. ఇతర ఐఐటీలకు చెందిన కొందరు ఫ్యాకల్టీ వర్గాలు కూడా దుల్లాకు న్యాయమైన దర్యాప్తు జరగాలని కోరాయి.
అయితే విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో దుల్లాను డీన్ పదవి నుంచి తొలగించారు. తాజాగా ఆయనను సెలవుపై వెళ్లాలని ఐఐటీ బాంబే కోరింది. ఇది దర్యాప్తు పూర్తయ్యే వరకు తీసుకున్న చర్యగా స్పష్టమవుతోంది.
ఆ వ్యవహారంపై వెనక్కి.. క్షమాపణలు
సాహిల్ పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలోకి అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని ఐఐటీ బాంబే తొలుత బహిరంగ ప్రకటన చేసింది. ఆ ఘటనను అతడి మృతితో ముడిపెట్టేలా సంస్థ ప్రకటన చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే తర్వాత ఐఐటీ బాంబే తన ప్రకటనపై వెనక్కి తగ్గింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు ఇంకా దర్యాప్తులో ఉన్నందున అప్పటికే వాటిని నిర్ధారించినట్లుగా పేర్కొనడం తగదని చెబుతూ సంస్థ క్షమాపణలు చెప్పింది.
10 మందితో ప్రత్యేక కమిటీ
కేసు మరింత సంక్లిష్టంగా మారడంతో ఐఐటీ బాంబే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 10 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐఐటీ పాలక్కాడ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ప్రొఫెసర్ రమేశ్ వెంకటేశ్వరన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. కమిటీలో ఫ్యాకల్టీ సభ్యులతోపాటు విద్యార్థి ప్రతినిధులు, సైకియాట్రిస్ట్ తదితరులు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించి వారంలో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు.
ప్రతి కోణంలో దర్యాప్తు
సాహిల్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు సమాచారం. ఫోన్ డేటాను క్లోన్ చేసి.. అతడి చాట్స్, చివరి సంభాషణలు, ఘటనకు ముందు ఎవరెవరితో మాట్లాడాడన్న అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. పరీక్షా హాల్లో ఏం జరిగిందో, ప్రొఫెసర్–సాహిల్ మధ్య సంభాషణ ఏంటో, గతంలో వారిద్దరి మధ్య ఏమైనా పరిచయం లేదా వివాదం ఉందా అనేదానిపైనా దర్యాప్తు సాగుతోంది. ఇదిలా ఉండగా.. కేసుపై ఊహాగానాలు, తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని ముంబై పోలీసులు ప్రజలు, మీడియాను కోరారు. ఐఐటీ బాంబే అలుమ్ని అసోసియేషన్ కూడా ఎలాంటి ‘మీడియా ట్రయల్’ లేకుండా నిష్పక్షపాతంగా, వేగంగా దర్యాప్తు జరగాలని కోరింది.
ఇదీ చదవండి: మీ నూనె.. మా నూనె


