బ్యాంకు రుణాలకు బీమా పాలసీలు అంటగట్టొద్దు! | IRDAI Insurance Norms Overhaul 2026 What Policyholders Agents Need to Know | Sakshi
Sakshi News home page

బ్యాంకు రుణాలకు బీమా పాలసీలు అంటగట్టొద్దు!

Sep 24 2026 8:31 AM | Updated on Sep 24 2026 9:13 AM

IRDAI Insurance Norms Overhaul 2026 What Policyholders Agents Need to Know

భారత ఇన్సూరెన్స్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) దేశీయ బీమా రంగంలో పారదర్శకతను పెంచేందుకు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు పంపిణీ నిబంధనల్లో కీలక ప్రతిపాదనలు చేసింది. పాలసీల తప్పుడు విక్రయాలను (మిస్‌ సెల్లింగ్‌) అరికట్టడం, నిర్వహణ వ్యయాలను తగ్గించడం, క్లెయిమ్‌ల ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులను తీసుకొచ్చింది.

కమిషన్ విధానంలో మార్పులు

ఇప్పటివరకు ఇన్సూరెన్స్ ఏజెంట్లు, బ్రోకర్లకు పాలసీ ప్రారంభంలోనే ఒకేసారి అధిక మొత్తంలో కమిషన్ చెల్లించే పద్ధతి ఉంది. దీనివల్ల క్లయింట్‌కు అవసరం లేకపోయినా పాలసీలను అంటగట్టే ధోరణి పెరుగుతోందన్న విమర్శలు వచ్చాయి. దీన్ని నియంత్రించేందుకు ఐఆర్‌డీఏఐ కమిషన్ చెల్లింపులను పాలసీ కాలవ్యవధి ఉన్నన్ని రోజులు విస్తరించాలని ప్రతిపాదించింది. ఇకపై కస్టమర్‌కు నిరంతరం సేవలు అందించే సలహాదారుల శ్రమ ఆధారంగానే పారితోషికం లభిస్తుంది.

నిర్వహణ వ్యయం తగ్గించేందుకు ప్రణాళిక

బీమా కంపెనీల నిర్వహణ వ్యయాన్ని అదుపు చేసేందుకు ఐఆర్‌డీఏఐ ఐదేళ్ల ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ నిర్వహణ వ్యయాన్ని రాబోయే ఐదేళ్లలో 12.5 శాతానికి, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 20 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చే సమయంలో నిర్బంధంగా బీమా పాలసీలను ముడిపెట్టడాన్ని ఐఆర్‌డీఏఐ నిషేధించింది.

మోటార్ ఇన్సూరెన్స్‌పై ప్రత్యేక దృష్టి

థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ వంటి నిర్బంధ పాలసీలలో కమీషన్లను తగ్గించి డిజిటల్ కొనుగోలు విధానాలను ప్రోత్సహించనుంది. అంతేకాకుండా, వాహనదారులు తమకు అనుకూలమైన సర్వీస్ సెంటర్లలో క్యాష్‌లెస్‌ సేవలందుకునే హక్కును కల్పించనుంది.

వినియోగదారులకే ప్రయోజనం

పంపిణీ ఏజెన్సీలను ప్రధానంగా మూడు విభాగాలుగా వర్గీకరించి సమర్థవంతంగా నియంత్రించనున్నారు. ‘బీమా సుగమ్‌’ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణతో సాధారణ పౌరులకు పాలసీల కొనుగోలు మరింత చవకగా, పారదర్శకంగా మారనుంది. ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే భారత బీమా రంగం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారి మరింత విశ్వసనీయతను సాధిస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: మల్కాజిగిరి - కామారెడ్డి మధ్య రైల్వే ‘కవచ్ 4.0’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement