గణపతి పందిళ్లకు బీమా రక్ష
ఆభరణాలకు అదనపు పాలసీ
వానలు, వరద నష్టాలకు ముందే అప్రమత్తత
పండుగలంటే కేవలం ఆధ్యాత్మికత, వినోదమే కాదు. రిస్క్ మేనేజ్‌మెంట్ కూడా ఇప్పుడు పండుగలో భాగంగా మారుతోంది. భారీ పందిళ్లు, విలువైన ఆభరణాలు, పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ప్రమాదాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలకు ఇది కొత్త మార్కెట్ అవకాశంగా మారుతోంది. పండుగ ఎంత గ్రాండ్‌గా జరిగితే రిస్క్ అంత పెద్దదిగా ఉంటుంది. ఆ రిస్క్‌కు ఇప్పుడు బీమానే రక్షణ కల్పిస్తోంది.
సాక్షి, బిజినెస్ డెస్క్: గణేశ్ ఉత్సవం అంటే భక్తుల సందడి, , భారీ పందిళ్లు, విరాళాల వెల్లువ. అయితే ఈసారి ఆ సందడితో పాటు రిస్క్ మేనేజ్‌మెంట్ పైనా నిర్వాహకులు ఫోకస్ పెట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, చోరీలు, అల్లర్లు, ప్రమాదాలు వంటి ముప్పుల నుంచి రక్షణ కోసం గణపతి పందిళ్లు బీమా బాట పడుతున్నాయి. బీమా కంపెనీలకు వినాయకచవితి పండుగ కొత్త వ్యాపార అవకాశంగా మారుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీమా తీసుకుంటున్న గణపతి పందిళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా గణనీయంగాపెరిగిందని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది.
ఒక్క ఏడాదిలోనే భారీ జంప్
గత ఏడాది సుమారు 20నుంచి 30 పందిళ్లకు బీమా అందించిన ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 100 పందిళ్లకు బీమా చేసింది. చిన్న చిన్న పందిళ్ల నిర్వాహకులు కూడా బీమా ప్రీమియం చెల్లిస్తూ కవరేజీ కోరడం ఈ పెరుగుదలకు కారణమవుతోంది. సాధారణంగా పందిళ్లకు 7లక్షల కవరేజీకి రూ.3000 వరకు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఈ కాంప్రెహెన్సివ్ పాలసీలో అగ్నిప్రమాదాలు, వరదలు, విరాళాల చోరీలు, అల్లర్లు, గణేశ్ విగ్రహం, ఆభరాణాలు పందిళ్లలో పనిచేసే సిబ్బందికి వ్యక్తిగత ప్రమాద బీమా వంటి రిస్క్ లన్నిటికీ కవరేజీ లభిస్తుంది.
పందిళ్లకు పెరిగిన టెన్షన్
వర్షాలు, వరదలు, అల్లర్లను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అధిక బీమాను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది బీమా తీసుకుంటున్న గణపతి పందిళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్ వరదలు, మహారాష్ట్రను ముంచెత్తుతున్న వర్షాలు, ముంబై నగరాన్ని అకస్మాత్తుగా అల్లకల్లోలం చేస్తున్న వర్షాల అంచనాలు నిర్వాహకులను అప్రమత్తం చేశాయి. ప్రకృతి వైపరీత్యాలతో పాటు, ఉత్సవ సమయంలో జరిగే అల్లర్లు, గణపతి ప్రతిష్ట, నిమజ్జనం ఊరేగింపులో సంభవించే ప్రమాదాలు, పందిళ్లలో జరిగే చోరీలపై కూడా నిర్వాహకుల్లో అవగాహన పెరిగింది. బీమాను ఇపుడు ఖర్చుగా కాకుండా రిస్క్ మేనేజ్‌మెంట్ సాధనంగా చూస్తున్నారని ఇన్వెస్టాక్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ డైరెక్టర్ హితేష్ లఖానీ తెలిపారు.
కృష్ణాష్టమి వేడుకలకు కూడా బీమా
కృష్ణాష్టమి మరుసటి రోజు నిర్వహించే ‘దహీ హండి’ వేడుకలకు కూడా బీమా చేయడం అలవాటుగా మారింది. ఈ వేడుకలో కొంత మంది యువకులు (గోవిందులు) మానవగోపురాలుగా ఒకరిపై ఒకరు నిలబడి పెద్ద హ్యూమన్ పిరమిడ్‌ను ఏర్పరుస్తారు. మరికొందరు వారిపైనుంచి పైకెళ్లి గాల్లో ఎత్తులో కట్టిన పెరుగు (దహీ) వెన్నతో నింపిన మట్టి పాత్రను (హండీ)ని పగులగొట్టడం ఈ ఆట ఉద్దేశం. కుండను పగులగొట్టే సమయంలో పడిపోవడం, గాయపడడం వంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.
అందుకు వ్యక్తిగత ప్రమాదంతో పాటు ఆసుపత్రి ఖర్చుల కవరేజీ కీలకంగా మారింది. ఈ ఏడాది ఒక్కో గోవిందాకు హస్పిటలైజేషన్ కవరేజీ రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు నిర్వాహకులు పెంచారు. మహారాష్ట్ర రాజ్య దహీ హండీ గోవిందా అసోసియేషన్ ఈ బీమా ప్రీమియం ఖర్చు చెల్లిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బీమాకు రూ.కోటి కేటాయించినట్లు సమాచారం. ఈ ఏడాది దహీహండి వేడుకల్లో పాల్గొన్న 1,65,535 మంది గోవిందులకు బీమా కలి్పంచారు. గతేడాది ఈ సంఖ్య 1.60 లక్షలు. ఒక్క గోవిందునికి రూ.75 ప్రీమియంతో సుమారు రూ.10 లక్షల ప్రమాదబీమా అందిస్తున్నారు.
విగ్రహం కంటే ఆభరణాలే ఖరీదు
పెద్ద పెద్ద గణపతి పందిళ్ల నిర్వాహకులు సాధారణ బీమాతో ఆగడంలేదు. వినాయకుడి విగ్రహానికి అలంకరించే బంగారు ఆభరాణాలకు ప్రత్యేకంగా బీమా కవరేజీ తీసుకుంటున్నారు. భారీ స్థాయిలో విలువైన నగలతో అలంకరించే పందిళ్లలో ఇది కీలకమైన రిస్క్ కవర్ గా మారింది. మహారాష్ట్రలో ప్రముఖ పందిళ్లయిన జీఎస్‌బీ సేవా మండల్, లాల్ బగీచ రాజ సార్వజనిక్ గణేశ్ ఉత్సవ మండల్ భారీ స్థాయిలో బీమా తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్ వర్గాల ప్రకారం జీఎస్‌బీ సేవా మండల్ ఈ ఏడాది రూ. 703 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది. గత ఏడాది ఇది రూ.474 కోట్లుగా ఉంది.


