ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు తుపాకీతో ఒక యువకుడు అరెస్ట్ అయిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ (PMO) నకిలీ ఐడీ కార్డు, తుపాకీతో షాపింగ్ మాల్ నుండి 24 ఏళ్ల రోహన్ పారిఖ్, అతని అంగరక్షకుడు దిలీప్ కుండేలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు చెప్పిన సంగతులు విని పోలీసులు విస్తుపోయారు.
తన కాబోయే భార్య, అత్తమామలను ఇంప్రెస్ చేయడానికి డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న రోహన్ తాను కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన అధికారినని , ప్రధాని కార్యాలయంతో నేరుగా సంబంధాలున్నాయి గప్పాలు కొట్టాడు. ఈ విషయాలో వారిని నమ్మించాలనుకుని పథకం వేశాడు.ఇందుకు ప్రధాని మోదీ హాజరు కానున్న ఎన్‌ఎంఏసీసీ వేదికను ఎంచుకున్నాడు.
ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఏఐ టూల్స్ ఉపయోగించి నిజమైన పీఎంఓ కార్డ్‌ను పోలిన డిజిటల్ ఐడీ కార్డును (దీన్ని 2025లోనే తయారు చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది) ఉపయోగించి వీవీఐపీ మార్గం ద్వారా దర్జాగా లోపలికి వెళ్లాలనే ప్లాన్. ఈ ప్లాన్‌లో భాగంగానే రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించాడు. జియో వరల్డ్ ప్లాజాలోకి వివిఐపి (VVIP) ప్రవేశ మార్గం ద్వారా వెళ్ళి,వారికి "పవర్" చూపించాలని ప్లాన్ చేశాడు. కానీ ప్రధాని పర్యటనకు ముందు భారీ భద్రతా తనిఖీల్లో దొరికిపోయాడు.
ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం
ఈ కేసులో రోహన్, అతని బాడీగార్డ్, డ్రైవర్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, పారిఖ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రథమేష్ బాగుల్ కోసం గాలిస్తున్నారు. వీరిపై మోసం, ఫోర్జరీ, VVIP భద్రతా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు


