‘‘మీరు ఒప్పుకుంటే.. త్వరలో మా సినిమాల్లో చూస్తామేమో’’ అంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్యా మంత్రి ఆంటోన్ అలిఖానోవ్‌ను ఉద్దేశించి గోయల్ ఆ వ్యాఖ్య చేశారు. వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన లుక్, కటౌట్‌లు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోదన్నట్లుగా ఉంటుంది. ఇదే విషయాన్ని మన మంత్రి ప్రస్తావించారు..
ఇన్నోప్రామ్ ఇండియా 2026 కార్యక్రమంలో భారత్, రష్యా మధ్య పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలపై చర్చ సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అలిఖానోవ్ చూడటానికి చాలా డ్యాషింగ్‌గా ఉన్నారని పేర్కొన్న గోయల్.. ఆయన బహుశా పొరపాటున రాజకీయాల్లోకి వచ్చారేమో అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఆడియోవిజువల్ సహకారాన్ని కూడా మరింత పెంచుకోవాలని, త్వరలోనే ఆయనను బాలీవుడ్ సినిమాలో చూడొచ్చేమోనని సరదాగా వ్యాఖ్యానించారు.
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల టార్గెట్
అలిఖానోవ్‌కు గోయల్ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్ సరదా వ్యాఖ్యే అయినప్పటికీ.. ఆయనతో జరిగిన చర్చలు మాత్రం పూర్తిగా వ్యాపారపరమైనవే. భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ వాణిజ్యంలో భారత్ నుంచి రష్యాకు జరిగే ఎగుమతులు తక్కువగా ఉండగా.. రష్యా నుంచి భారత్‌కు దిగుమతులు భారీగా ఉన్నాయి.
Bollywood calling? Piyush Goyal sees a movie star in Russia’s trade minister
“Possibly we’ll see him starring in a movie in Bollywood very soon,” Goyal joked about Anton Alikhanov at the India–Russia Business Dialogue 2026. pic.twitter.com/yvRpLn26en— Sputnik India (@Sputnik_India) September 10, 2026
పుతిన్ మెచ్చుకుని మరీ..
ఆంటోన్ ఆండ్రేయెవిచ్ అలిఖానోవ్ 1986 సెప్టెంబర్ 17న సుఖుమిలో జన్మించారు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న ఆయన.. ఆర్థికశాస్త్రం, న్యాయశాస్త్రం చదివారు. రష్యా ప్రభుత్వంలో వివిధ బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. 2016లో కేవలం 30 ఏళ్ల వయసులో కలినిన్‌గ్రాడ్ ప్రాంతానికి తాత్కాలిక గవర్నర్‌గా నియమితులై.. అప్పట్లో రష్యాలోనే అత్యంత పిన్న వయస్కుడైన రీజియనల్ లీడర్‌గా పేరు దక్కించుకున్నారు. 2017లో పూర్తిస్థాయి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు సన్నిహిత అధికారిక సమన్వయం కొనసాగింది. 2024లో పుతిన్ ప్రభుత్వం ఆయనకు కీలకమైన పరిశ్రమలు, వాణిజ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి రష్యా పారిశ్రామిక విధానాలు, విదేశీ వాణిజ్యంపై కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.
భారీగా వాణిజ్య లోటు
రష్యా నుంచి భారత్ ప్రధానంగా ముడిచమురు, ఇంధనం వంటి ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో భారీ అసమతుల్యత(trade imbalance) ఉంది. దీన్ని తగ్గించేందుకు భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, టెక్స్‌టైల్స్ తదితరాల ఎగుమతులను పెంచాలని గోయల్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదే సమయంలో భారత్–యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. రష్యాతో పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. పీయూష్ గోయల్ సెప్టెంబర్ 10న అలిఖానోవ్‌తో పాటు ఈఏఈయూ వాణిజ్య మంత్రి ఆండ్రే స్లెప్నెవ్‌తోనూ చర్చలు జరిపారు.
రేర్ ఎర్త్స్, మైక్రోఎలక్ట్రానిక్స్‌పై దృష్టి
ఇరు దేశాల మధ్య సహకారాన్ని సంప్రదాయ వాణిజ్యానికి మాత్రమే పరిమితం చేయకుండా కొత్త రంగాలకు విస్తరించాలన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలను అలిఖానోవ్ ప్రస్తావించారు. రష్యాలో ఏపీఐ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు భారత ఫార్మా కంపెనీలను ఆయన ఆహ్వానించారు.
ఇలా ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య, పారిశ్రామిక చర్చలు జరుగుతున్న వేళ.. అలిఖానోవ్ లుక్‌ను ప్రస్తావిస్తూ గోయల్ చేసిన ఒక్క సరదా వ్యాఖ్య మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. వ్యాపార చర్చల మధ్య ‘‘బాలీవుడ్‌లోకి వస్తారా?’’ అంటూ గోయల్ చేసిన చమత్కారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ఏఐతో ఎంతో ఈజీగా వినాశనం!


