#80sTrend: హద్దులు దాటిన మీమ్‌ వార్‌ | BJP Congress Meme War Escalates Over 80sTrend | Sakshi
Sakshi News home page

#80sTrend: హద్దులు దాటిన మీమ్‌ వార్‌

Sep 11 2026 10:37 AM | Updated on Sep 11 2026 10:37 AM

BJP Congress Meme War Escalates Over 80sTrend

సోషల్‌ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ‘మీమ్‌ వార్‌’ మరో స్థాయికి చేరింది. తాజాగా రెట్రో ట్రెండ్‌ ఏఐ ద్వారా దేశాన్ని ఊపేస్తోంది. తమ ఫొటోలను 70, 80 కాలం నాటి ఫొటోల్లా మార్చేసుకుని మురిసిపోతున్నారు చాలామంది. అయితే ఈ ట్రెండ్‌ వెనుక సైబర్‌ నేరాలకు అవకాశం ఉందనే హెచ్చరికలూ జారీ చేస్తున్నారు నిపుణులు. ఆ సంగతి పక్కన పెడితే.. పొలిటికల్‌గా ఇది మరో టర్న్‌ తీసుకుంది.  

ఒక పార్టీ పాతకాలం నాటి ఫొటోతో సెటైర్‌ వేస్తే.. మరో పార్టీ దానికి అంతకుమించిన వ్యంగ్య చిత్రంతో కౌంటర్‌ ఇచ్చింది. చివరకు ఈ పోస్టుల వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ టార్గెట్‌ చేసే వరకు వెళ్లింది. దీంతో ఇరు పార్టీల మద్దతుదారులు సోషల్‌ మీడియాలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

కాంగ్రెస్‌ పోస్టుతో మొదలు..
ఈ వివాదానికి కేరళ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం చేసిన ఓ పోస్టు కారణమైంది. ‘1980ల నాటి గుజరాత్‌ వీధి’ అంటూ ఓ చిత్రాన్ని పోస్టు చేసింది. దీన్ని బీజేపీ తెలంగాణ కౌంటర్‌ చేసింది. 1970ల నాటి తరహాలో ఉన్న ఓ మహిళ బార్‌ కౌంటర్‌పై డ్యాన్స్‌ చేస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ‘లుసియానా, ఇటలీ’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. ఇక్కడితో ఆగని బీజేపీ కేరళ విభాగం మరో బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాన్ని సోషల్‌ మీడియాలోకి తీసుకొచ్చింది. పాతకాలం నాటి రాజకీయ పార్టీ కార్యాలయాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రంతో కాంగ్రెస్‌పై సెటైర్‌ వేసింది.

అయితే ‘లుసియానా’ ప్రస్తావనతో పాటు వరుస పోస్టులను పరిశీలించిన పలువురు.. ఈ వ్యంగ్యానికి అసలు లక్ష్యం సోనియా గాంధీనేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇటలీలోని లుసియానాలో జన్మించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గుజరాత్‌ ఖాతా నుంచి చేసిన ఓ పోస్టును తర్వాత తొలగించినట్లు సమాచారం. దీంతో వివాదం మరింత ముదిరింది.

దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ పేజీలు గుజరాత్‌ గజదొంగ, చాయ్‌ పేరిట రైల్వే స్టేషన్‌లో చోరుడు, మొసలిని పట్టుకున్న మొనగాడు అంటూ రెట్రో స్టైల్‌లోనే పలు పోస్టులు చేసింది. దీంతో ఇది నరేంద్ర మోదీని ఉద్దేశించేనంటూ బీజేపీ భగ్గుమంది. ఇలా ఇరు పార్టీలు ఈ ట్రెండ్‌ను తమ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు వేదికగా మార్చేశాయి.

రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం
పోస్టులపై ఇరు పార్టీల మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పోస్టుల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిని వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వాన్ని కించపర్చడంగా అభివర్ణించాయి. కాక్రోచ్‌ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే సైతం ఈ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. అయితే బీజేపీ మద్దతుదారులు తమ పోస్టులను రాజకీయ వ్యంగ్యంగా సమర్థిస్తూ.. ప్రత్యర్థి పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈ పరిణామాలపై సోషల్‌ మీడియాలో కొందరు మాత్రం ‘రెండు పార్టీలు బురదలో కొట్టుకుంటున్నట్లుగా ఉంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రాజకీయ అంశాలపై చర్చించాల్సిన సోషల్‌ మీడియా వేదికలు.. ఇలా పాత ఫొటోలు, మీమ్స్‌, వ్యక్తిగత విమర్శలకు వేదికలుగా మారడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వైరల్‌ ట్రెండ్‌.. రాజకీయ పోరుకు ఆయుధం
ఇటీవల సోషల్‌ మీడియాలో పాతకాలం నాటి ఫొటోలు, మీమ్స్‌ను కొత్త క్యాప్షన్లతో వైరల్‌ చేయడం ట్రెండ్‌గా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఇదే ట్రెండ్‌ను తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఘటనలోనూ ఓ పార్టీ పోస్టుకు మరో పార్టీ కౌంటర్‌ ఇవ్వడంతో మొదలైన వ్యవహారం.. చివరకు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. దీంతో రాజకీయాల్లో సోషల్‌ మీడియా మీమ్‌ సంస్కృతి ఎంతగా ప్రభావం చూపుతోందన్న చర్చ మరోసారి మొదలైంది.

ఇదీ చదవండి: కోతులు అలా చేయడానికి మనమే కారణమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement