‘ఇస్రో’తో ప్రపంచానికి లబ్ధి | PM Narendra Modi addresses the International Space Summit in France | Sakshi
Sakshi News home page

‘ఇస్రో’తో ప్రపంచానికి లబ్ధి

Sep 11 2026 6:19 AM | Updated on Sep 11 2026 6:19 AM

PM Narendra Modi addresses the International Space Summit in France

అత్యుత్తమ పనితీరు, తక్కువ వ్యయంతో కూడిన ప్రయోగాలతో ప్రశంసలు పొందింది 

సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్‌ మద్దతు  

తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండే సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్‌ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పారదర్శకత, సమగ్రతతో కూడిన శాస్త్రీయ సమాచారం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలని స్పష్టంచేశారు. గురువారం ఫ్రాన్స్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాంకేతికతలు, భాగస్వామ్యాలు భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయని వెల్లడించారు. 

సువిశాల అంతరిక్షం శతాబ్దాలుగా ప్రజల ఊహాశక్తిని ప్రేరేపిస్తూనే ఉందని తెలిపారు. వాతావరణం, పంటల నుంచి సముద్రాలు, సమాజాల వరకు భూమిపై జీవనాన్ని అంతరిక్షమే నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. అంతరిక్షం ఇవ్వగల శక్తి అనంతమైనదని వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణకు బదులుగా సహకారం, స్వల్పకాలిక లాభానికి బదులుగా సుస్థిరత అవసరమని అన్నారు. భారతదేశ విధానం వసుధైక కుటుంబం(ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు) అనే భావనలో ఇమిడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూగోళం దాటి విస్తరించాలని మోదీ ఆకాంక్షించారు.  

అంతరిక్షంలోకి 34 దేశాల ఉపగ్రహాలు  
భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఇస్రో’తన అత్యుత్తమ పనితీరు, తక్కువ వ్యయంతో కూడిన ప్రయోగాల ద్వారా ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇస్రో సామర్థ్యాలు రైతులకు, మత్స్యకారులకు, వాతావరణ అంచనాకు, విపత్తు నిర్వహణకు, నౌకాయానానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలు భారతీయ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లాయని తెలిపారు. ఇస్రోతో ఎన్నో దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు. ఈ విజయం వెనుక భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు తరాల తరబడి సాగించిన అంకితభావం, కృషి ఉన్నాయని ఉద్ఘాటించారు. వారు పగలు రాత్రి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇస్రోకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు. అంతరిక్షయాన దేశాల సరసన భారతదేశానికి గరి్వంచదగిన స్థానాన్ని కల్పించారని ప్రశంసించారు.  

2040 నాటికిచంద్రుడిపైకి భారతీయుడు  
చంద్రయాన్‌–3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఆదిత్య–ఎల్‌1 మిషన్‌ సూర్యుడి రహస్యాలను వెలికితీస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చాడని గుర్తుచేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వీటి ప్రయోజనాలు మొత్తం మానవాళికి అందాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. 

భారత్‌లో ఇస్రోతోపాటు ప్రైవేట్‌ అంతరిక్ష రంగం కూడా పురోగమిస్తోందని అన్నారు. ఇస్రో సాధించిన అత్యుత్తమ నైపుణ్యానికి పారిశ్రామిక ఉత్సాహం తోడవుతోందని తెలియజేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఫ్రాన్స్‌ ఒక విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోందని తెలిపారు. భారతదేశపు తదుపరి అంతరిక్ష ప్రస్థానంలో భాగస్వాములుగా చేరాలని ఫ్రాన్స్‌ను, ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సుకు తనను ఆహ్వానించినందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్త మానవాళి కోసం, భావి తరాల కోసం మనమంతా కలిసి అంతరిక్షాన్ని అన్వేషిద్దామని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు చేద్దామని, అంతరిక్షాన్ని పరిరక్షించుకుందామని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement