బిహార్‌లోని ఛప్రా నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ. 15 కోసం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై అమానుషంగా దాడిచేసిన ఘటన కలకలం రేపింది.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రొఫెసర్ చికిత్స పొందుతుండగా, పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
నంద్‌లాల్ సింగ్ కాలేజీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భగవాన్ ఠాకూర్, ఎప్పటిలాగే అర లీటరు పాలు కొనుగోలు చేయడానికి ఒక దుకాణానికి వెళ్లారు. దీనికోసం ఆయన రూ. 500 నోటును దుకాణదారుడికి ఇచ్చాడు. అతను తిరిగి రూ. 450 మాత్రమే ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, తనకు రావాల్సిన చిల్లరలో రూ. 15 తక్కువగా వచ్చాయని ఠాకూర్ గమనించారు. దాంతో ఆయన తిరిగి దుకాణానికి వెళ్లి, ఆ డబ్బును దుకాణదారుడికి చూపించి, రూ. 15 కూడా తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే షాప్ ఓనర్ కుమారుడు వెనకనుంచి ఉన్నట్టుండి దాడి చేశాడు. కత్తితో ఆయన చెవిలో పొడిచాడు. ఈ హఠాత్పరిణామానికి ఠాకూర్ కింద పడిపోయారు. ఎలాగోలా తన సహోద్యోగికి ఫోన్ చేయగలిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న సహోద్యోగి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది మరియు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్‌ఐఆర్ నోటీసు


