చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో కొత్త సమీకరణాలపై ఉత్కంఠ పెరుగుతోంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి డీఎంకేతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకేకు వ్యతిరేకంగా తమ కూటమిలోకి ఇతర పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పిన ఆయన.. ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ఆ పార్టీకి నేరుగా సవాల్ విసిరారు.
టీవీకేకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతోందా అని మీడియా ప్రశ్నించగా.. తాము కూడా టీవీకేకు వ్యతిరేకమేనని ఈపీఎస్ స్పష్టం చేశారు. తమ కూటమి ఇప్పటికే ఉన్న విధంగానే కొనసాగుతుందని, ఇతర పార్టీలు చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అదే సమయంలో ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ప్రశ్నించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే నేతృత్వంలోని కూటమి, డీఎంకే నేతృత్వంలోని ఫ్రంట్, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు విజయ్ ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, డ్రగ్స్ సమస్య, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సీఎం విజయ్ నేరుగా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.
ఇప్పటికే అసెంబ్లీ వేదికగా విజయ్, డీఎంకే మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మాజీ డీఎంకే ప్రభుత్వంపై విజయ్ అవినీతి ఆరోపణలు చేయడంతో డీఎంకే సభ్యులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈపీఎస్ డీఎంకేతో కలిసి టీవీకేకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమంటూ సంకేతాలు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఇక, విజయ్ కూటమి బలం పెంచుకుంటున్న వేళ.. పాత ప్రత్యర్థులైన డీఎంకే-అన్నాడీఎంకే ఒకే వేదికపైకి వస్తాయా? ఈపీఎస్ వ్యాఖ్యలు నిజంగా పొత్తుకు సంకేతాలా? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఇదీ చదవండి: తమ్ముడు విజయ్.. నువ్వుచెప్పింది కరెక్టే: స్టాలిన్


