తమిళనాడులో భగ్గుమన్న ‘దవడ’ రాజకీయం | Vijay jaw gesture invited a sharp attack from DMK | Sakshi
Sakshi News home page

తమిళనాడులో భగ్గుమన్న ‘దవడ’ రాజకీయం

Sep 9 2026 9:40 PM | Updated on Sep 9 2026 9:42 PM

Vijay jaw gesture invited a sharp attack from DMK

సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ తన ప్రజారంజక పరిపాలనతో దూసుకుపోతున్నారు. ప్రజాభిష్టమైన నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు తన ధారాళమైన వాగ్ధాటితో టీవీకే శ్రేణుల్లో జోష్ నింపుతుండగా.. మరోవైపు తన హావభావాలతో ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుచేస్తూ ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్నారు. తాజాగా సెప్టెంబర్‌ 7న తమిళనాడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష డీఎంకే అవినీతిపై ఆయన విమర్శలు గుప్పిస్తూ ఇచ్చిన ఓ ‘ఫోజు’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారి తీసింది.

అసెంబ్లీ సమావేశంలో డీఎంకే అధినేత, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, నిర్బంధం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ తన దవడను తాకుతూ ఒక రకమైన సైగ చేశారు. విజయ్ చేసిన ఈ బాడీ లాంగ్వేజ్ సైగ.. ఎమర్జెన్సీ (1975-77) కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టై, పోలీస్ కస్టడీలో దాడికి గురై దవడ గాయపడిన ఎంకే స్టాలిన్‌ను అపహాస్యం చేసేలా ఉందని డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. స్టాలిన్ ముఖంపై ఉన్న ఆ మచ్చ కేవలం ఒక గాయం కాదని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన ఒక యోధుడి త్యాగానికి ప్రతీక అని డీఎంకే నేతలు అభివర్ణించారు.

1976 జనవరి 31న నాటి సీఎం కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్‌ చేసింది. ఆ సమయంలో యువ డీఎంకే నేతగా ఉన్న ఎంకే స్టాలిన్‌ను అరెస్ట్ చేసి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో ఆయన అధికారుల దాడికి గురయ్యారని, ఆ దెబ్బల వల్లే ఆయన దవడ గాయపడిందని డీఎంకే వర్గాలు చెబుతుంటాయి. అప్పటి నుంచి ఆ సంఘటన స్టాలిన్ రాజకీయ జీవితంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.

ఈ వివాదం పెద్దది కావడంతో సీఎం విజయ్ స్పందించారు. అసెంబ్లీలో తాను చేసిన ఆ సైగ ఎవరినీ కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ప్రసంగంలో భాగంగా సాధారణంగా వచ్చిందే తప్ప అందులో ఎలాంటి దుర్బుద్ధి లేదని ఆయన ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, డీఎంకే సభ్యులు నిరసన తెలపడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మీసా చట్టం అంటే
మీసా (MISA - Maintenance of Internal Security Act) దేశంలో అత్యంత వివాదాస్పదమైన చట్టం. దీన్ని భారత పార్లమెంటు 1971లో ఆమోదించింది. దేశంలో అంతర్గత భద్రతను కాపాడటం, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని కట్టడి చేయడం ఈ చట్టం ఉద్దేశం అని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. 1975 నుండి 1977 వరకు దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో ఈ చట్టాన్ని అత్యంత దారుణంగా దుర్వినియోగం చేశారు.ఈ చట్టం కింద ఎవరినైనా సరే, ఎలాంటి వారెంట్ లేకుండా, విచారణ లేకుండా, కోర్టులో ప్రవేశపెట్టకుండా నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధించవచ్చు. అరెస్టుకు అసలు కారణం కూడా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. దీనిపై కోర్టులను ఆశ్రయించే హక్కు కూడా అప్పట్లో ఉండేది కాదు.

ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో భాగంగా అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల​్‌కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి జాతీయ స్థాయి నాయకులతో పాటు, తమిళనాడులో ఎంకే స్టాలిన్ వంటి యువ రాజకీయ నాయకులు కూడా ఈ మీసా చట్టం కిందనే అరెస్టయి జైలు శిక్ష అనుభవించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement