‘టచ్‌ చెయ్‌ చూద్దాం’.. ఇంజినీర్లకు హనుమంతుని సవాల్‌! | 170 Year Old Hanuman Idol Refuses to Move | Sakshi
Sakshi News home page

‘టచ్‌ చెయ్‌ చూద్దాం’.. ఇంజినీర్లకు హనుమంతుని సవాల్‌!

Sep 9 2026 12:28 PM | Updated on Sep 9 2026 2:27 PM

170 Year Old Hanuman Idol Refuses to Move

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో 170 ఏళ్ల నాటి ఖడే హనుమాన్‌ ఆలయాన్ని తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఆలయంలోని సుమారు 8 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆలయ నిర్మాణంలో కొంత భాగాన్ని తొలగించినప్పటికీ.. విగ్రహాన్ని మాత్రం కదిలించలేకపోయారు. భారీ యంత్రాలను వినియోగించినా విగ్రహం ఏమాత్రం కదలకపోవడం చర్చనీయాంశంగా మారింది.

2028లో ఉజ్జయినిలో సింహస్థ మహాకుంభమేళా జరగనుంది. మార్చి 27 నుంచి మే 27 వరకు జరిగే ఈ వేడుకను ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఖడే హనుమాన్‌ ఆలయాన్ని కూడా తరలించాలని నిర్ణయించారు. విగ్రహాన్ని తొలగించేందుకు మూడు బృందాలు 48 గంటలపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. పనులు ప్రారంభమై నాలుగు రోజులు దాటినా పరిష్కారం లభించలేదు. భారీ యంత్రాలతో ప్రయత్నాలు చేసినా విగ్రహం కదలకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. విగ్రహాన్ని తరలించే సమయంలో సుమారు 50 కోతులు అక్కడికి చేరుకున్నాయని కొందరు పేర్కొన్నారు.

భక్తులు దీనిని హనుమంతుడి మహిమగా భావిస్తున్నారు. అయితే ఇంటర్నెట్‌లోని కొన్ని నివేదికల ప్రకారం.. విగ్రహం పురాతన భూగర్భ పునాదిలో లోతుగా అమర్చి ఉండొచ్చని తెలుస్తోంది. పాత రాళ్ల నిర్మాణాలతో అది అనుసంధానమై ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అధిక బలాన్ని ప్రయోగిస్తే పురాతన రాళ్లు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో భారీ తవ్వకం యంత్రాల వినియోగాన్ని నిలిపివేశారు. 

ప్రస్తుతం ఆధునిక భూగర్భ స్కానింగ్‌ సాంకేతికతతో విగ్రహం పునాదిని పరిశీలిస్తున్నారు. ఆలయ పూజారి మహేశ్‌ బైరాగి స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఇది దేవుడి సంకేతంగా భక్తులు భావిస్తున్నారని చెప్పారు. విగ్రహాన్ని తరలించడం తప్పనిసరైతే, ప్రస్తుతం ఉన్న విధంగానే సురక్షితంగా పునఃప్రతిష్ఠించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఆలయం, విగ్రహం 170 ఏళ్లకంటే పురాతనమైనవని స్థానికులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఐదేళ్లలో 32,596 మంది బలి.. నగరాల్లో కానరాని భద్రత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement