వెయిటర్‌ నుంచి.. 8 వేల కోట్లు టర్నోవర్‌ చేసే కంపెనీ సీఈఓగా!! | Success Story: The Austrian CEO runs a Rs 8,000 crore company from India | Sakshi
Sakshi News home page

Success Story: వెయిటర్‌ నుంచి.. 8 వేల కోట్లు టర్నోవర్‌ చేసే కంపెనీ సీఈఓగా!!

Sep 9 2026 12:02 PM | Updated on Sep 9 2026 12:36 PM

Success Story: The Austrian CEO runs a Rs 8,000 crore company from India

ఎక్కడో పుట్టి మరో దేశంలో వెయిటర్‌ స్థాయి నుంచి సముద్ర టూరిజాన్నే శాసించే స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. పైగా ఆ దేశ సంస్కృతిని మెచ్చి వారిలా జీవించడం మరింత విశేషం. అయినప్పటికీ తను ఎక్కడ నుంచి వచ్చాను అన్న మూలాన్ని మర్చిపోకుండా ఆదర్శంగా జీవిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు ఈ వ్యక్తి. 

అతడే ప్రముఖ లగ్జరీ క్రూయిజ్‌ అధినేత జుర్గెన్‌ బైలోమ్‌(Jurgen Bailom). కంటెంట్‌ క్రియేటర్‌ నవన్ జైస్వాల్‌ అతడితో జరిపిన సంభాషణలో తన ప్రస్థానం గురించి వివరించాడు. అందకు సంబంధించిన విషయం నెట్టింట షేర్‌ చేయడంతో బైలోమ్‌ కథ వైరల్‌గా మారింది. ఆ సంభాషణలో బైలోమ్‌ భారతదేశంలో తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు. జుర్గెన్‌ బైలోమ్‌ తాను ఒక ఓడలో వెయిటర్‌గా జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. శక్తిమంతంగా పనిచేస్తూ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. 

అయినా ఈ రేంజ్‌కి ఎలా చేరుకోగలిగారు అని జైస్వాల్‌ ప్రశ్నించగా..చేయగలనన్న దృక్పథంతో చకచక నేర్చుకోవడం, మార్కెట్‌ని, ప్రజలను, సంస్కృతిని అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. అలాగే ఆర్థికంగా విజయం సాధించడం గురించి కూడా మాట్లాడారు. "అవసరం లేకపోతే ఖర్చు చేయవద్దు." అనే విషయాన్ని బలంగా నమ్ముతానని చెప్పారు. అప్పుడు డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, అలాగే ఏం చేయాలనే దానిపై అవగాహన ఉంటే.. డబ్బే మీ వెంట పడుతుంది." అని బైలోమ్‌ నొక్కి చెబుతున్నారు. 

ఆస్ట్రియాలో జన్మించిన ఆయన హాస్పిటాలిటీ పరిశ్రమలోకి ఒక వెయిటర్‌గా భారత్‌లో అడుగుపెట్టానంటూ తన 40 ఏళ్ల ప్రస్థానాన్ని  గుర్తుచేసుకున్నారు. అలా కార్డెలియో అనే ప్రముఖ లగ్జరీ క్రూయిజ్‌ సంస్థని పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీకి ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కూడా. ఇది భారత సముద్ర పర్యాటక రంగంలో తన ఆధిపత్యాన్ని స్థాపించుకుందని చెప్పారు. తన బ్రాండ్‌ భారత క్రూయిజ్‌ వ్యాపారంలో 99% మార్కెట్ వాటాను కలిగి ఉందని తెలిపారు. అలాగే తన వ్యాపారం రూ. 8 వేలు కోట్లు టర్నోవర్‌ ఆర్జిస్తుందని చెప్పారు.

ప్రస్తుతం తాను ఒకే నౌకను నడుపుతున్నప్పటికీ..ఇది ఏడాదికి సుమారు 600 నుంచి 700 కోట్ల టర్నోవర్‌ చేస్తుందని అన్నారు. తాను భారతదేశానికి చెందనప్పటికీ..ఇక్కడ ప్రపంచ స్థాయి క్రూయిజ్‌ లైన్‌ నిర్మించగలిగే విస్తారమైన తీరప్రాంతాన్ని గుర్తించానని అన్నారు. ఇక్కడ క్రూయిజ్‌ వ్యాపారం చేయడం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదంటున్నారాయన. ఇది ప్రపంచంలోని మూడో అతిపెద్ద తీరం అని అన్నారు. తాను 2018లో భారత్‌కి వచ్చినట్లు తెలిపారు. అలాగే ఇక్కడ సంస్కృతి నచ్చిందన్నారు. 

ముంబైలో ప్రతి ఒక్కరు కష్టపడతారని, ఉపాధి కోసం నిత్యం ఏదో ఒక పనిచేస్తుంటారని కొనియాడారు. భారతీయుల సంప్రదాయాలు, సెంటిమెంట్లపై అవగాహన  ఉందని, తను కూడా వాటిని అనుసరిస్తానని చెప్పారు. తన ఆఫీసులో కూడా క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తామని, ఫర్నీచర్‌ వంటి తదితరాలు వాస్తుపరంగా ఉండాల్సిన దిశలో ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఆర్థికంగా బాగానే ఉన్నామా అని పర్యవేక్షిస్తుంటానని, ఒకవేళ ఆధ్యాత్మిక పరంగా ఏవైన మార్పులు, చేర్పులు ఉంటే చేస్తానని కూడా చెప్పారు బైలోమ్‌.

 

(చదవండి: ప్రిన్సిపాల్‌ ఉద్యోగాన్ని వదిలి మరి మిల్లెట్‌ వ్యాపారం! ఇవాళ ఏకంగా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement