రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు | GRB founder Balasubramaniam Left school at 13 sold butter built Rs 1400-crore company | Sakshi
Sakshi News home page

రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు

Sep 5 2026 1:26 PM | Updated on Sep 5 2026 1:49 PM

GRB founder Balasubramaniam Left school at 13 sold butter built Rs 1400-crore company

G R Balasubramaniam success journey  తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో  పుట్టాడు.  తండ్రి చిన్న రైతు , వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారి. ఆరుగురు పిల్లలున్న కుటుంబంలో కడుపు నిండా తిండి తినడానికి ఎన్నో కష్టాలు. అందుకే  13 ఏళ్ల వయసులో బడి మానేసి బెంగళూరులో పనికి కుదిరాడు. కట్‌ చేస్తే..రూ. 1400 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగిన 'జి.ఆర్.బి డెయిరీ ఫుడ్స్' (GRB Dairy Foods)  ఫౌండర్‌ అయ్యాడు. బెంగళూరులోని ఒక చిన్న వెన్న వ్యాపారంగా మొదలైన రూ. 1400 కోట్లకు పైగా ఆదాయం కలిగిన ప్యాకేజ్డ్-ఫుడ్స్ కంపెనీగా ఎదిగింది. ఎంతో స్ఫూర్తిదాయక మైన జీఆర్‌ బాలసుబ్రహ్మణ్యమ్ విజయప్రస్థానం గురించి తెలుసుకుందాం ఈ కథనంలో.

కుగ్రామం నుంచి ప్రారంభమై

తమిళనాడులోని పళని సమీపంలోని చిన్న కరాట్టుపట్టి  అనే కుగ్రామంలో పుట్టారు బాలసుబ్రహ్మణ్యం.  ఆ ఊరి జనాభా కేవలం 300 మంది. సరైన విద్యుత్, రవాణా, నీటి సదుపాయాలు లేవు.  తండ్రి పప్పుధాన్యాలు , ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా వ్యాపారం చేసేవారు. ఆయన సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ, పంటను కొని సమీప పట్టణాలలో అమ్మేవారు. ఆ ఆదాయంతో ఎనిమిది మంది సభ్యులున్నకుటుంబాన్ని పోషించాల్సి ఉండేది. దీంతో 8వ తరగతి చదువుతున్న సమయంలోనే, కుటుంబానికి అండగా ఉండేందుకు బెంగళూరుకు బయలుదేరాడు. అక్కడ అక్క బావలకు చేస్తున్న వ్యాపారానికి తోడుగా నిలిచాడు. దాదాపు అతనికి 13 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటింటికీ తిరిగి వెన్న అమ్మడం మొదలుపెట్టాడు. అలా 14 ఏళ్ల పాటు వెన్న వ్యాపారంలో మెళకువలను నేర్చుకున్నాడు. గ్రామాల నుంచి వెన్న సేకరించడం, ఇళ్లకు సరఫరా చేయడం, ఖాతాలు నిర్వహించడం, నెయ్యి తయారీ ప్రక్రియలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.  

1984లో 28 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని వదిలేశారు. సొంతంగా ఏదైనా చేయాలన్నా కుటుంబం ఆర్థికంగా సహాయపడే స్థితిలో లేదు, పైగా సరైన విద్యార్హతలు లేదా వృత్తిపరమైన అర్హతలు లేకపోవడంతో సాధారణ ఉద్యోగం దొరకడం కూడా కష్టంగా ఉండేది. తన వద్ద ఉన్న కేవలం రూ. 6,000 పొదుపు మొత్తంతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన. ఇందులో రూ. 3,000 అద్దెకే పోయాయి.  ఎలాంటి బ్యాంక్ రుణాలు లేకుండానే పరిచయస్తులతో ఒక 'చిట్ ఫండ్' సంస్థను ప్రారంభించారు. ఆయన బావగారు గతంలో ఇలాంటి పథకాన్ని నిర్వహించేవారు, కాబట్టి బాలసుబ్రహ్మణ్యంకు ఆ విధానంపై అవగాహన ఉండేది.అలా రెండో నెలలోనే రూ. 50,000 చేతికి వచ్చింది. ఆ డబ్బుతో మొదటిసారి వెన్నను కొనుగోలు చేసి, నెలకు 75 కిలోల చొప్పున డోర్-టు-డోర్ డెలివరీ చేయడం ప్రారంభించారు. 

అయితే ఈ సమయంతో తాను సరఫరా చేసిన వెన్న త్వరగా పాడైపోతుందని, హోటళ్లు/స్వీట్ షాపులు దీనిని నెయ్యిగా మార్చు కోవడంలో ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. అందుకే  వెన్న అమ్మడం కంటే, తానే నెయ్యి  కాచి,  నాణ్యమైన నెయ్యిని తయారుచేసి ప్యాక్ చేసి అమ్మడం లాభదాయకమని భావించాడు. పెద్ద పెద్ద డైరీ బ్రాండ్లు మార్కెట్‌ను శాసిస్తున్న 80వ దశకంలో డెయిరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి  పెద్ద సాహసమే చేశాడు. ఏడాదిలోనే వారి నెల ఆదాయం రూ. 25వేలకి పెరిగింది. షాపును అద్దెకు తీసుకుని, సిబ్బందిని నియమించుకున్నారు.

ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్‌ వీడియో

తొలి ఫ్యాక్టరీ
1991లో బెంగళూరులో తొలి ఫ్యాక్టరీని ప్రారంభించారు. తరువాత దిండిగల్, హోసూరు (1999)లలో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మెల్లిగా తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించారు. వ్యాపారం వృద్ధి చెందుతున్న క్రమంలో కేవలం డెయిరీ ఉత్పత్తులకే పరిమితం కాకుండా మసాలా మిక్స్‌లు, ఇన్‌స్టంట్ మిక్స్‌లు, స్వీట్లు, స్నాక్స్, ఐస్‌క్రీమ్‌ల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు.

బయటినుంచి ఎలాంటి భారీ పెట్టుబడులు లేకుండానే  కేవలం తాను సాధించిన లాభాలను తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ సంస్థ లాభాలను భారీ స్థాయిలో పెంచుకుంటూ వచ్చారు.  అనేక దశాబ్దాల పాటు, జీఆర్‌బీ ఒక ప్రైవేట్ యాజమాన్యం లోని, చాలా వరకు సొంత నిధులతోనే నడిచే వ్యాపారంగా కొనసాగింది.

 రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

2014లో రూ. 4.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ  2021 నాటికి రూ. 76.67 కోట్ల లాభాన్ని కళ్ల జూసింది.  2024నాటి  రూ. 1,011.12 కోట్ల రాబడితో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది.  2025 నాటికి రాబడి రూ. 1,084.47 కోట్లకు చేరగా, నికర లాభం రూ. 75.45 కోట్లుగా నమోదైంది.  పట్టుదల, ఆత్మవిశ్వాసంతో 'GRB డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్' బ్రాండ్ 40కి పైగా దేశాల్లో విస్తరించి, ప్రస్తుతం రూ.1,400 కోట్లకు పైగా టర్నోవర్‌ను సాధించింది.

ఎంబీఏలు ఐఐటీలు లాంటి చదువు లేకపోయినా, వ్యాపారంలో సంపాదించిన ఆచరణాత్మక అనుభవం, మార్కెట్ అవసరాలను గుర్తించే చాకచక్యంతో జీఆర్‌ బాలసుబ్రహ్మణ్యం GRB బ్రాండ్‌ను భారతదేశంలోనే అగ్రగామి ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలలో ఒకటిగా నిలపడం విశేషం.  ఉత్పత్తి నాణ్యత విషయంలో రాజీ పడటం కంటే వ్యాపారాన్ని వదులుకోవడానికే ఆయన మొగ్గు చూపేవారు. ఇది కేవలం ఒక విధానం కాదు, ఆయన దృఢమైన నమ్మకం.,500 మందికి పైగా ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్నారు. పట్టుదలతో, నిబద్ధత ఉంటే విజయతీరాలకు చేరడం సాధ్యమేనని నిరూపించి , తనలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement