చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అప్పుడే అధికార కూటమికి ‘2029 ఎన్నికల’ సెగ తగులుతోంది. ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు కూడా పూర్తికాకముందే.. ‘ప్రధాని అభ్యర్థి ఎవరు?’ అన్న ప్రశ్న టీవీకే-కాంగ్రెస్ మధ్య చిచ్చు రేపుతోంది. ఒకవైపు సీఎం, టీవీకే అధినేత విజయ్‌ను 2029 ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెస్తున్న ఆయన పార్టీ నేతలు.. మరోవైపు రాహుల్ గాంధీనే ప్రతిపక్ష కూటమి ప్రధాని ముఖంగా కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న టీవీకే మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుండటం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే నేతలను టీవీకే మంత్రులు సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఈ భేటీలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు కూటమి భవిష్యత్ వ్యూహంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ సమావేశానికి కాంగ్రెస్‌కు ఆహ్వానం లేకపోవడం మరింత ఉత్కంఠకు తెరలేపింది.
అసలు కథ మొదలైంది ఇక్కడే..
టీవీకేకి చెందిన పలువురు నేతలు వరుసగా ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో వివాదం మొదలైంది. విజయ్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, 2029లో ప్రధాని అభ్యర్థిగా ఆయనను ముందుకు తీసుకురావాలని పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. విజయ్‌కు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని కూడా కొందరు టీవీకే నేతలు వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో మరింత అసహనానికి కారణమైంది.
కాంగ్రెస్ వార్నింగ్.. రాహుల్ మా ఛాయిస్!
టీవీకేనేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. 2029లో రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నది పార్టీ విధానం కాదని.. కొందరు కొత్తగా వచ్చిన నేతల అభిమాన భావజాలం మాత్రమేనని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీలు.. జాతీయ స్థాయిలో మాత్రం ఇద్దరు వేర్వేరు నేతలను ప్రధాని కుర్చీ కోసం ముందుకు తెస్తున్నాయి. అయితే, ఈ వివాదం మాటలకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ మంత్రి ఎస్. రాజేశ్ కుమార్.. రాహుల్ గాంధీని 2029 ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు పదవుల్లో కొనసాగడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కూటమిలోని అంతర్గత ఉద్రిక్తతను మరింత బయటపెట్టాయి.
మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడంతా సెప్టెంబర్ 9 సమావేశంపైనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే ఇప్పటికే మిత్రపక్షాలతో చర్చలు మొదలుపెట్టింది. ఈ సమావేశంలో కూటమి నిర్మాణం, రాజకీయ ఫ్రంట్‌కు పేరు, సమన్వయ వ్యవస్థ వంటి అంశాలతో పాటు విజయ్-రాహుల్ వివాదానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? అన్నది కీలకంగా మారింది.
ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడగటం ప్రభుత్వ వ్యతిరేకమా: సీజేపీ


