తొలగింపుపై తాపత్రయం | Three Top Leaders Play Key Role in Konda Surekha Dismissal | Sakshi
Sakshi News home page

తొలగింపుపై తాపత్రయం

Sep 5 2026 4:02 AM | Updated on Sep 5 2026 4:02 AM

Three Top Leaders Play Key Role in Konda Surekha Dismissal

సురేఖ బర్తరఫ్‌ ఎపిసోడ్‌లో చేతులు కలిపిన ముగ్గురు కీలక నేతలు

సీఎం రేవంత్‌కు సహకరించిన ఇద్దరు ముఖ్య నేతలు 

ఓ నేత మంతనాల నేపథ్యంలోనే బెంగళూరు నుంచి ఢిల్లీ చేరేసరికి మారిన ఏఐసీసీ అధ్యక్షుడి స్వరం 

రేవంత్‌రెడ్డి అభిప్రాయానికి అడ్డు చెప్పకుండా తలూపిన మరో నేత 

నేతలను నియంత్రించాలంటే బర్తరఫ్‌ నిర్ణయం తప్పనిసరని అధిష్టానానికి వారిద్దరి వినతి 

అదే సమయంలో సురేఖకు ఖర్గే అపాయింట్‌మెంట్‌ ఇప్పించిన అధిష్టాన దూత మౌనం   

అందుకే ఆమె బర్తరఫ్‌కు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ 

విస్తరణపై చర్చించేందుకు మళ్లీ రావాలని రేవంత్‌కు హైకమాండ్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారం అధికార కాంగ్రెస్‌లో కొత్త కోణం తెరపైకి వస్తోంది. ఈ విషయంలో అధిష్టానానికి నచ్చజెప్పి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభీష్టానికి అనుగుణంగా హైకమాండ్‌ను ఒప్పించడంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతల సహకారం ఉందనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్‌తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడిన ఓ నాయకుడు, ప్రభుత్వంతో సమాంతరంగా పార్టీకి అధికారాలు కావాలని పోరాట బాటపట్టిన మరో నాయకుడు ఏకాభిప్రాయంతో ఈ ఎపిసోడ్‌లో కీలకపాత్ర పోషించారని.. ఇందులో స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా దాగి ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. 

మరో విషయం ఏమిటంటే సురేఖకు ఖర్గే అపాయింట్‌మెంట్‌ ఇప్పించడంలో తెరవెనుక పాత్ర పోషించిన అధిష్టాన దూత ఒకరు.. ఈ వ్యవహారం ఢిల్లీకి మారాక మౌనం దాల్చారని.. ఆయన మౌనముద్రతోనే జరగాల్సిందంతా సజావుగా జరిగిందనే చర్చ కూడా గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది.  

మొదటి నుంచీ ఆయన చుట్టూనే.. 
కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే సీఎం రేవంత్‌కు ఢిల్లీ వేదికగా సహకరించిన కీలక నేత ఒకరి చుట్టూనే రాజకీయమంతా తిరిగింది. ఒకదశలో సురేఖ ఎపిసోడ్‌పై కమిటీ వేస్తారని.. ఈ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన క్యాంపు కార్యాలయంలోనే కీలక నేతల సమావేశాలు, తర్జనభర్జనలు జరిగాయి. ఆ సమయంలోనే ఆయన తన వైఖరిని సురేఖ శిబిరానికి కుండబద్దలు కొట్టి చెప్పారని సమాచారం. 

ఆ తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు కూడా తన వైఖరిని వెల్లడించారని.. ఓ దఫా ఆయనకు ఆశించిన సమ్మతి లభించకపోయినా ఎపిసోడ్‌ ఢిల్లీకి బదిలీ అయ్యాక ఏఐసీసీలో ఉండే మరో ముఖ్యుడి సహకారంతో ఆయన అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పగలిగారని గాంధీ భవన్‌ వర్గాలంటున్నాయి. ఆ కీలక నేత మంతనాల నేపథ్యంలో సురేఖ తొలుత బెంగళూరులో, ఆ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినప్పుడు ఆయన స్వరంలో మార్పు కనిపించిందని అంటున్నాయి. ఇక పార్టీలోని ఓ ముఖ్య నేత సహకారం ఈసారి సీఎం రేవంత్‌కు లభించిందని తెలుస్తోంది.

 ఇటీవల పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భంలో రేవంత్‌ వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆ నాయకుడు సురేఖ వ్యవహారంలో మాత్రం రేవంత్‌ అనుకూల శిబిరంలో కీలకపాత్ర పోషించారని సమాచారం. ఆయన కూడా సీఎం నిర్ణయానికి అడ్డుచెప్పకుండా తలూపారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు కలిసి పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలను నియంత్రించాలంటే నిర్ణయం తప్పనిసరిని చెప్పి అధిష్టానానికి నచ్చజెప్పారని తెలుస్తోంది.

 ఆ ఇరువురి సహకారానికి తోడు అధిష్టాన దూత ప్రేక్షకపాత్ర పోషించడం, సీఎం సైతం ఒత్తిడి తేవడం వెరసి అధిష్టానం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని.. ఈ నేపథ్యంలోనే సురేఖ పక్షం వహించిన మరో ముఖ్య నేత వాదనకు ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. అయితే తనకు సహకరించిన ఆ ఇద్దరు నేతల విషయంలో సీఎం రేవంత్‌ భవిష్యత్‌ వైఖరి ఎలా ఉంటుంది? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వారికి ప్రాధాన్యం ఉంటుందా? శాఖల మార్పుపై ప్రభావం చూపుతుందా? అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ‘అనుబంధం’కొనసాగుతుందా? అనేది వేచిచూడాల్సిందే! 

అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక హస్తినకు మరోసారి సీఎం! 
సురేఖ ఉద్వాసన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల మార్పు గురించి చర్చించేందుకు వీలైనంత త్వరగా కబురు చేస్తామని ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని.. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక సీఎం రేవంత్‌తోపాటు పార్టీలోని ఇతర ముఖ్యులు హస్తినకు వెళ్లి కేబినెట్‌ ప్రక్షాళనపై హైకమాండ్‌తో చర్చిస్తారని గాం«దీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement