పాట్నా: బిహార్ ముజఫర్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నిశాంత్ కుమార్ పర్యటన సందర్భంగా ఒకవైపు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతుంటే, సందట్లో సడేమియా అన్నచందంగా అదే గుంపులో ఉన్న అగంతకుడు హస్తనైపుణ్యం ప్రదర్శించాడు. జేడీయూ నేత మెడలోని ఖరీదైన బంగారు గొలుసును కాజేశాడు.
ముజఫర్‌పూర్ జిల్లాలోని సక్రీ చౌక్ వద్ద మంత్రి నిశాంత్ కుమార్‌కు స్వాగతం చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి వాహనం రాగానే ఆయనకు పూలమాలలు వేసేందుకు పార్టీ శ్రేణులు ఎగబడ్డారు. ఈ క్రమంలో జేడీయూ స్థానిక నాయకుడు రాజేష్ మౌర్యకూడా మంత్రికి మాల వేయడానికి నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు.
మంత్రికి పూలమాల వేసి పక్కకు వచ్చాక తీరిగ్గా మెడపై చేయి వేసి చూసుకుంటే నాయకుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి! ఆయన మెడలో ఉన్న దాదాపు 34 గ్రాముల బరువు, రూ. 7 లక్షల విలువైన బంగారు గొలుసు కనిపించకుండా పోయింది.
హడావుడి తగ్గాక రోడ్డుపై, చుట్టుపక్కల ఎంత వెతికినా గొలుసు దొరక్కపోవడంతో సదరు నాయకుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్థానిక తుర్కీ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీఐపీ మూవ్‌మెంట్ సమయంలో తీసిన వీడియో ఫుటేజీలతో పాటు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
मंत्री निशांत कुमार को माला पहनाने गए थे… चोर ने गले से 7 लाख की चेन चुरा ली…
मंत्री जी का तो स्वागत हो गया… नेताजी बेचारे अब स्वागत लायक नहीं बचे
📍 मुजफ्फरपुर, बिहार pic.twitter.com/7PvYE9l5DN— Romita Tiwari (@romita_tiwari) September 4, 2026


