ఆయుధాల చోరీ మాజీ ఉద్యోగుల పనే! | The theft of weapons was intended solely to highlight security lapses | Sakshi
Sakshi News home page

ఆయుధాల చోరీ మాజీ ఉద్యోగుల పనే!

Sep 4 2026 1:49 AM | Updated on Sep 4 2026 1:49 AM

The theft of weapons was intended solely to highlight security lapses

భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపేందుకు చోరీ 

భౌగోళిక పరిస్థితులపై పట్టున్న వ్యక్తుల ప్రమేయం 

విడతల వారీగా తుపాకులు, తూటాల దొంగతనం 

ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు  

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్, బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధశాల (ఆర్మీ)లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అత్యంత కట్టుదిట్టమైన సైనిక స్థావరం నుంచి ఆయుధాలను దొంగిలించడం వెనక ఆర్మీ మాజీ ఉద్యోగుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపేందుకే ఈ చోరీ చేసి ఉండొచ్చని అలాగే ఆయుధాలు భద్రపరిచే గది, పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో సిబ్బంది సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు, భౌగోళిక పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న వారి ప్రమేయంతోనే జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

మద్రాస్‌ రెజిమెంట్‌లో ఇటీవల పదవీ విరమణ పొందిన వ్యక్తులు, గతంలో ఇక్కడ పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది వివరాలను సేకరించారు. పోలీసు, రాష్ట్ర, కేంద్ర నిఘా సంస్థలతోపాటు మిలిటరీ ఇంటెలిజెన్స్‌ విభాగాలు రంగంలోకి దిగి పది మంది ఆర్మీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నాయి. కానీ ఈ చోరీ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. 

ఒకరోజు జరిగింది కాదు 
ఈ దొంగతనంలో నాలుగు ఏకే–203 అసాల్ట్‌ రైఫిళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్, ఏడు పిస్టల్స్‌తోపాటు భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి మాయమైంది. ఈ ఆయుధాలను రవాణా చేయడానికి నాలుగు చక్రాల వాహనం అవసరమవుతుందని, కాబట్టి ఈ చోరీ విడతల వారీగా కొంతకాలంగా జరిగి ఉంటుందని, ఎక్కువ మంది పాల్గొని ఉండవచ్చని భావిస్తున్నారు. 

ఆయుధాలను భద్ర పరిచే ప్రాంతంలో అగ్నిప్రమాదాలను నివారించే నెపంతో కొన్ని నెలలుగా రోజూ రాత్రి ఆయుధశాలలోని సీసీటీవీ కెమెరాలను నిలిపివేస్తున్నారు. పైగా అక్కడ అలారం వ్యవస్థ కూడా లేదు. నిందితులు ఆయుధాలను కాంపౌండ్‌ వాల్‌ అవతలికి విసిరేసి, తరలించి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement