ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమంతో పాల్గొన్న నటి, మోడల్ రియా అహిర్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 20’ పోటీదారుల రేసులో నిలిచారు. ‘ఫ్యాన్స్ కా ఫైస్లా’ ప్రక్రియ ద్వారా ఆమెతో పాటు లవ్ గిల్ ప్రవేశం కోసం పోటీపడుతున్నారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా వీరిలో ఒకరు షోలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రియా మాట్లాడుతూ.. తాను నాలుగేళ్ల వయసు నుంచే నాటకరంగంలో ఉన్నానని, ఆరేళ్లుగా మోడలింగ్‌తో పాటు 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు.
ఆందోళనల సమయంలో పోలీసు వ్యానుకు ఎదురుగా నిలబడిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆ వాహనంలో మహిళా పోలీసులు లేకపోవడం చట్టవిరుద్ధమని తనకు తెలుసని, రాజ్యాంగం తన వెంటే ఉందన్న ధైర్యంతోనే బాధ్యత గల పౌరురాలిగా నిలబడ్డానని పేర్కొన్నారు. ఆ ఘటన తనను ఎంతోమందికి చేరువ చేసిందని, ప్రముఖ నటి షబానా అజ్మీ సైతం తనను ప్రశంసించారని చెప్పారు.
బిగ్ బాస్ ఆఫర్‌పై స్పందిస్తూ.. ‘ప్రారంభంలో ఈ షోకి వెళ్లేందుకు కాస్త సంకోచించాను. నాకు సమాజంలో ఒక బాధ్యత ఏర్పడింది. ఎవరినీ నిరాశపరచకూడదనే ఉద్దేశంతో మొదట వెనుకాడాను. అయితే అక్కడ ఎవరూ నిన్ను దుర్భాషలాడాలని ఒత్తిడి చేయరని, మన ప్రవర్తన మన చేతుల్లోనే ఉంటుందని నిర్వాహకులు చెప్పడంతో నా నిర్ణయం మార్చుకున్నాను’ అని వివరించారు. కేవలం ప్రచారం కోసమే తాను ఉద్యమంలో పాల్గొన్నాననే విమర్శలను ఆమె కొట్టిపారేశారు. సల్మాన్ ఖాన్ పుట్టినరోజే తన జన్మదినం కావడం విశేషమని, కోపంలోనూ హుందాతనం ప్రదర్శించే వ్యక్తిత్వం విషయంలో ఆయనతో తనకు పోలికలున్నాయని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 6న జియోహాట్‌స్టార్, కలర్స్ టీవీ వేదికలుగా ప్రారంభమయ్యే గ్రాండ్ ప్రీమియర్‌లో రియా భవితవ్యం తేలనుంది.
ఇది కూడా చదవండి: ‘వితంతువులా చూడలేను’.. పాక్ భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు


