తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొలత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ ధ్రువీకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్ అసలు విచారణకే అర్హమైనది కాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌ను తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థి వీఎస్ బాబు ఓడించారు. బాబుకు 82,997 ఓట్లు (45.09 శాతం) రాగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు (40.32 శాతం) వచ్చాయి. దీంతో బాబు 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్టాలిన్ రెండో స్థానంలో నిలిచారు. అయితే మే 4న ఫలితాలు వెలువడగా.. మే 7నే 14 ఈవీఎంల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్‌ను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి స్టాలిన్ దరఖాస్తు చేశారు.
కానీ, ఈ 14 ఈవీఎంలు నియోజకవర్గంలోని మొత్తం 286 యంత్రాల్లో 5 శాతం. అయితే ఈ పరిశీలన జూలై 29న మాత్రమే జరిగింది. పరిశీలన సమయంలో రెండు ఈవీఎంలు పనిచేయడం ఆగిపోయాయని, మరో యంత్రానికి సంబంధించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లపై అడ్రస్ ట్యాగ్‌లు సరిగ్గా లేకపోవడంతో పాటు సీల్ విషయంలోనూ లోపాలు ఉన్నాయని స్టాలిన్ ఆరోపించారు. ఒక కంట్రోల్ యూనిట్ తన పేరున్న బ్యాలెట్ యూనిట్‌ను గుర్తించలేదని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అన్ని వీవీప్యాట్ లెక్కింపు కోరుతూ..
కొలత్తూరు నియోజకవర్గంలోని మొత్తం 286 ఈవీఎంలను పరిశీలించడంతో పాటు 100 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని స్టాలిన్ కోర్టును కోరారు. ఈవీఎంల పరిశీలనలో బయటపడిన లోపాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వీఎస్ బాబు ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించాలని, తనను విజేతగా ప్రకటించాలని కూడా అభ్యర్థించారు.
ఆలస్యంగా ఈవీఎంల పరిశీలన?
స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వాదన చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 7న ఈవీఎంల పరిశీలనకు దరఖాస్తు చేసినప్పటికీ.. ఎన్నికల సంఘం జూలై 29న పరిశీలన చేపట్టిందన్నారు. అప్పటికి ఎన్నికల పిటిషన్ దాఖలు చేసేందుకు నిర్దేశించిన 45 రోజుల గడువు ముగిసిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశీలనలో లోపాలు బయటపడిన తర్వాత స్టాలిన్ ఎన్నికల పిటిషన్ ఎలా దాఖలు చేయగలరని ప్రశ్నించారు.
ఈసీ అభ్యంతరం ఇదే..
అయితే స్టాలిన్ పిటిషన్‌ను విచారించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం వాదించింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బి) ప్రకారం ఎన్నికల ఫలితాలను సవాలు చేయాలంటే ఎన్నికల పిటిషన్ ద్వారానే వెళ్లాలని పేర్కొంది. ఆర్టికల్ 226 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ ద్వారా ఆ ప్రక్రియను పక్కదారి పట్టించలేరని తెలిపింది.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్ ‘నాట్ మెయింటెయినబుల్’ అని పేర్కొంటూ కొట్టివేసింది. దీంతో కొలత్తూరు ఎన్నికల ఫలితాలను ఈవీఎంల ఆధారంగా సవాలు చేసిన స్టాలిన్ ప్రయత్నానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది.
ఇదీ చదవండి: అలా.. విడాకులిచ్చేయాల్సి వచ్చింది!


