ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ! | Swara Bhasker Faces BJP Backlash Over Padmaavat Jauhar Remarks | Sakshi
Sakshi News home page

ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ!

Sep 3 2026 8:37 AM | Updated on Sep 3 2026 8:40 AM

Swara Bhasker Faces BJP Backlash Over Padmaavat Jauhar Remarks

కృతి సనన్‌ రాఖీ యాడ్‌ దుమారం చల్లారక ముందే.. మరో నటి స్వరా భాస్కర్‌ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్‌’ సినిమాలోని ‘జౌహర్‌’ సన్నివేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల త్యాగాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించింది.

ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘వుమన్‌, లైఫ్‌, ఫ్రీడమ్‌’ కార్యక్రమంలో స్వరా భాస్కర్‌ ‘పద్మావత్‌’లోని జౌహర్‌ సన్నివేశాన్ని ప్రస్తావించారు. సినిమాలో మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతి చేసుకున్నట్లు చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ లైంగిక హింసకు గురైన మహిళ ఈ సన్నివేశాన్ని చూస్తే.. తన జీవితాన్ని కొనసాగించాలనుకోవడం తప్పా అనే భావన కలగొచ్చని స్వరా ప్రశ్నించారు. ‘గౌరవం కోసం చనిపోకపోతే పిరికిదానిననే భావన కలుగుతుందా?’ అన్న కోణంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లైంగిక హింసకు గురైన మహిళలకు కూడా బతికే హక్కు ఉందన్న సందేశమే సమాజానికి వెళ్లాలని ఆమె పేర్కొన్నారు.

జౌహర్‌ (Jauhar) అంటే.. యుద్ధంలో శత్రు సైన్యం చేతిలో చిక్కి అవమానం, లైంగిక హింసకు గురికాకుండా ఉండేందుకు మహిళలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకునే ఆచారం.

‘ఆమె పిరికిదని అనలేదు’
స్వరా వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని కానీ, జౌహర్‌ చేసిన మహిళలను కానీ పిరికివాళ్లుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అనువదించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నించింది జౌహర్‌ చేసిన మహిళల ధైర్యాన్ని కాదని.. ఆ సన్నివేశం ఆధునిక సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్నదేనని వివరించారు.

‘ఇతర మహిళలను గౌరవించాలి’
ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా.. స్వరా భాస్కర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి మహిళ ఇతర మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు.  స్వరా పేరులోని ‘స్వర్‌’ (గొంతు/స్వరం)ను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మహిళల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు
ఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. బిహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణకుమార్‌ సింగ్‌ స్వరా భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హిందూ సమాజం, రాజ్‌పుత్‌ మహిళలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి.

కర్ణిసేన కూడా..
పద్మావత్‌ విడుదల సమయంలోనే ఆ సినిమాలోని అంశాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణిసేన.. తాజా వివాదంలోనూ స్వరా భాస్కర్‌ను తప్పుబట్టింది. జౌహర్‌ను, రాజ్‌పుత్‌ మహిళల త్యాగాన్ని విమర్శించే ముందు చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. కర్ణిసేన మహిళా విభాగం నేత కీర్తి రాథోర్‌.. స్వరా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్‌ మహిళల త్యాగం, ధైర్యాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.

మళ్లీ తెరపైకి ‘పద్మావత్‌’ వివాదం
2018లో విడుదలైన ‘పద్మావత్‌’లో రాణి పద్మావతి పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఆ సమయంలో కర్ణిసేన అభ్యంతరాలతో సినిమా టైటిల్‌ పద్మావతి కాస్త పద్మావత్‌గా మారింది. ఇక చిత్ర క్లైమాక్స్‌లో శత్రు సేనల చేతికి చిక్కకుండా రాజ్‌పుత్‌ మహిళలు సామూహికంగా జౌహర్‌ చేసినట్లు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. స్వరా భాస్కర్‌ కూడా సినిమా విడుదల సమయంలో దర్శకుడు భన్సాలీకి బహిరంగ లేఖ రాసి జౌహర్‌ చిత్రీకరణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం తాజాగా మళ్లీ రాజుకుంది.

చరిత్రా? సమాజానికి సందేశమా?
‘పద్మావత్‌’లో జౌహర్‌ చిత్రీకరణ చుట్టూ సాగుతున్న తాజా వివాదం.. చరిత్రను సినిమాల్లో ఎలా చూపించాలి? చారిత్రక ఘటనలను ఆధునిక సామాజిక విలువలతో ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో ‘పద్మావత్‌’ రచయిత ప్రకాశ్‌ కపాడియా కూడా జౌహర్‌ సన్నివేశాన్ని సమర్థించారు. అది ఆ కాలంలోని వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమని, నేటి ప్రమాణాలతో మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 

స్వరా భాస్కర్‌ మాత్రం తన ఉద్దేశం ఏ మహిళనూ అవమానించడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ, కర్ణిసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ‘పద్మావత్‌’ జౌహర్‌ వివాదం మరోసారి బాలీవుడ్‌, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

వివాదాలు స్వరా భాస్కర్‌కు కొత్తేమీ కాదు. నటిగా ‘తను వెడ్స్‌ మను’, ‘రాంఝనా’, ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’, ‘నిల్‌ బట్టే సన్నాటా’, ‘వీరే ది వెడ్డింగ్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత తన వ్యాఖ్యలు, రాజకీయ వైఖరితోనూ తరచూ వార్తల్లో నిలిచారు. సీఏఏ-ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం నుంచి ‘వీరే ది వెడ్డింగ్‌’లోని ఓ సన్నివేశంపై వచ్చిన విమర్శల వరకు.. ఆమెపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. 2024లో యాహ్యా సిన్వార్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇప్పుడు ‘పద్మావత్‌’లోని జౌహర్‌ సన్నివేశంపై వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగింది.

ఇదీ చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి ఎట్టకేలకు తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement