కుమ్మేసిన పెట్రోల్‌, డీజిల్‌ సేల్స్‌! | August Fuel Sales Surge Petrol Consumption Up Unpredictable Rainfall Diesel Demand | Sakshi
Sakshi News home page

కుమ్మేసిన పెట్రోల్‌, డీజిల్‌ సేల్స్‌!

Sep 3 2026 8:36 AM | Updated on Sep 3 2026 8:37 AM

August Fuel Sales Surge Petrol Consumption Up Unpredictable Rainfall Diesel Demand

దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో ఇంధన విక్రయాలు భారీగా పుంజుకున్నాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నీటిపారుదల అవసరాలు పెరిగి వ్యవసాయ పంపుసెట్లకు డిమాండ్‌ పెరిగింది. దీనికి తోడు వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థల పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు ఆగస్టులో గణనీయంగా పెరిగాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కలిపి ఆగస్టులో 34.8 లక్షల టన్నుల పెట్రోల్‌ విక్రయించాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 31.9 లక్షల టన్నులతో పోలిస్తే ఇది 9.1% అధికం. నెలవారీగా జులైతో పోలిస్తే పెట్రోల్‌ అమ్మకాలు ఒక శాతం మేర పెరిగాయి.

డీజిల్‌ విక్రయాల్లో రెండంకెల వృద్ధి

ఆర్థిక వ్యవస్థ పనితీరుకు కీలక సూచిక అయిన డీజిల్‌ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 10.2 శాతం పెరిగి 6.27 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలో డీజిల్‌ డిమాండ్‌ రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. జూలైలోనూ డీజిల్‌ అమ్మకాలు 10.7 శాతం పెరిగాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం డీజిల్‌. సరకు రవాణా, వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల కోసం ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. 

  • ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో రైతులు పొలాలకు నీరు అందించేందుకు డీజిల్‌ పంపులను ఎక్కువగా వినియోగించారు. దీంతో సాధారణంగా వర్షాకాలంలో తగ్గే డీజిల్‌ డిమాండ్‌ ఈసారి పెరిగింది. 

  • విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) విక్రయాలు 5.6 శాతం పెరిగి 6.77 లక్షల టన్నులకు చేరాయి. జూలైతో పోలిస్తే 1.3 శాతం వృద్ధి నమోదైంది. అయితే ఈ పెరుగుదలకు నిర్దిష్ట కారణాన్ని పరిశ్రమ గణాంకాలు వెల్లడించలేదు.  

  • అయితే, ఎల్‌పీజీ అమ్మకాలు 16.1 శాతం తగ్గి 24.2 లక్షల టన్నులకు పడిపోయాయి. పశి్చమాసియా సంక్షోభం కారణంగా సరఫరాలకు అంతరాయం ఏర్పడటంతో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి రంగాల్లో ఎల్‌పీజీ వినియోగంపై ఆంక్షలు విధించారు. జూన్‌లో ఈ ఆంక్షలను ఎత్తివేయడంతో అమ్మకాలు పెరిగినప్పటికీ, పీఎన్‌జీ వినియోగం పెరగడంతో ఎల్‌పీజీ డిమాండ్‌ గతేడాది స్థాయులతో పోలిస్తే తక్కువగానే కొనసాగుతోంది.

ఇదీ చదవండి: రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement