‘తట్టుకునే సామర్థ్యం’ నుంచి గ్లోబల్ నాయకత్వం వైపు అడుగులు
టెక్నాలజీ, లోకలైజేషన్, ఎగుమతులతో భారత్ దూకుడు
ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలక స్థానంపై గురి
ఆటో మార్కెట్లకు ప్రధాన సరఫరా కేంద్రంగా ఎదగడమే లక్ష్యం
ఏసీఎంఏ వార్షిక సమావేశంలో పరిశ్రమ వర్గాల పిలుపు
దేశీయ ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ రంగాలు ప్రపంచ స్థాయి పోటీతత్వం, సాంకేతిక నాయకత్వం, ఉత్పత్తి స్థాయి విస్తరణతో పాటు అంతర్జాతీయ నాయకత్వంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆటో పరిశ్రమ ప్రముఖులు అన్నారు. భారత్‌ను ప్రపంచ ఆటో తయారీ, మొబిలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు డిజైన్, ఇంజినీరింగ్, ఆవిష్కరణలు, లోకలైజేషన్, ఎగుమతులపై దృష్టి పెంచాలని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) 66వ వార్షిక సమావేశంలో ప్రముఖులు పిలుపునిచ్చారు.
‘‘భారతీయ ఆటో రంగం కేవలం ఒడిదుడుకులను తట్టుకోవడానికే పరిమితం కాకుండా... అంతరాయాలను తట్టుకునే సామర్థ్యాన్ని గ్లోబల్ పోటీతత్వంగా మార్చుకోవడంతో పాటు.. భారత్ నుంచే ప్రపంచ స్థాయి, టెక్నాలజీ ఆధారిత, సుస్థిర ఆటో వాల్యూ చైన్లను నిర్మించుకోవాలి. దేశీయ ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ రంగాలు ఎగుమతులు సహా రికార్డు స్థాయి పనితీరు కనబరుస్తున్నాయి. కేవలం దిగుమతుల ప్రత్యామ్నాయంపైనే దృష్టి పెట్టకుండా, ‘భారత్‌లోనే రూపకల్పన, భారత్‌లోనే అభివృద్ధి, భారత్‌లోనే తయారీ, ఇక్కడి నుంచే ఎగుమతులు’ అనే విధానంతో ముందుకు సాగాలి’’ అని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు.
స్వావలంబన అంటే అంతర్జాతీయ సప్లైల నుంచి దూరం కావడం కాదని, వాటిలో భారత్ ఒక కీలక కేంద్రంగా మారాలని చంద్ర పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తదుపరి దశగా భారత్‌లోనే సృష్టించడం, ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేపట్టి దేశంతో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని ఏసీఎంఏ అధ్యక్షుడు విక్రమ్‌పతి సింఘానియా అన్నారు.
ప్రపంచ సప్లై చైన్లల్లో భారత్ కీలక కేంద్రం
ప్రపంచ ఆటో రంగంలో సరఫరా గొలుసులు మారుతున్న పరిస్థితుల్లో.. భారత్ దేశీయ మార్కెట్, తయారీ సామర్థ్యం, ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించుకుని గ్లోబల్ హబ్‌గా ఎదగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఒడిదుడుకులను తట్టుకునే ‘సామర్థ్యాని’కే పరిమితం కాకుండా.. టెక్నాలజీ, నాణ్యత, లోకలైజేషన్, ఎగుమతులు, ఆవిష్కరణలను బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ ఆటో విలువ గొలుసుల్లో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి.
ఈవీ వృద్ధికి దేశీయ టెక్నాలజీ కీలకం
ఈవీల విక్రయాల సంఖ్య పెరగడమే భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ విజయానికి కొలమానం కాదని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ. కుమారస్వామి అన్నారు. దేశంలో ఎంత టెక్నాలజీ అభివృద్ధి అవుతోంది, ఆటోమొబైల్ రంగంలో ఎంత విలువ దేశీయంగా జోడించబడుతోంది, ఎన్ని ఎంఎస్‌ఎంఈలు కొత్త సరఫరా గొలుసుల్లో భాగమవుతున్నాయి, భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో ఎంత సమర్థంగా పోటీపడుతున్నాయన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. పర్యావరణహిత, సమర్థవంతమైన, కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ సంస్థలు మరింత పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ రంగాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆమోదిత సంస్థలు రూ.45,477 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో 67,000కుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని కుమారస్వామి వెల్లడించారు.
కొత్త ఎస్‌యూవీలతో హ్యుందాయ్ విస్తరణ
దేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కోల్పోయిన రెండో స్థానాన్ని తిరిగి సాధించేందుకు కొత్త మోడళ్లతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ తెలిపారు. పండుగ సీజన్‌లో కొత్త మిడ్–సైజ్ ఎస్‌యూవీతో పాటు సబ్–ఫోర్ మీటర్ విభాగంలో ప్రత్యేక ఈవీని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ కొత్త మోడళ్లతో రెండో అర్ధభాగంలో పరిశ్రమ కంటే అధికంగా 8–10 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టులో కంపెనీ ఇప్పటికే దాదాపు 13 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. పుణె ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రస్తుత 1.7 లక్షల యూనిట్ల నుంచి 2028 నాటికి 2.5 లక్షలకు, 2030 నాటికి 3 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు గార్గ్ తెలిపారు.
విశ్వసనీయ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్
ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో భారత్ నమ్మదగిన తయారీ, సరఫరా గొలుసుల కేంద్రంగా ఎదిగేందుకు గణనీయమైన అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టకేయుచి అన్నారు. తయారీలో ఖర్చు మాత్రమే నిర్ణయాత్మక అంశం కాదని, నాణ్యత, విశ్వసనీయత, సరఫరా కొనసాగింపు కూడా అంతే కీలకంగా మారాయని చెప్పారు. లోతైన లోకలైజేషన్, సాంకేతికత, మానవ వనరులు, సమష్టి అభ్యాసం తదితర అంశాలు ప్రధానమైనవిగా పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయాలంటే టైర్–2, టైర్–3 సరఫరాదారుల సామర్థ్యాలను కూడా పెంచాల్సి ఉంటుందని అన్నారు. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతపైనా కంపెనీలు మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
హైటెక్ రంగాలకు బీఐఎస్ నిబంధనల్లో సడలింపు
భారత్‌లో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే హైటెక్ రంగ కంపెనీలకు అవసరమైన పరికరాలు, కాంపోనెంట్లపై తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ధ్రువీకరణ నుంచి మినహాయింపు కల్పించేలా ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సెమీకండక్టర్ తయారీ సంస్థకు సుమారు 13,501 కాంపోనెంట్లు అవసరమవుతాయని, ఇన్ని విడిభాగాలకు బీఐఎస్ అనుమతులు పొందడం సవాలుగా ఉందని జపాన్ సంస్థలు తన ఇటీవల టోక్యో పర్యటన సందర్భంగా తెలిపాయని గోయల్ తెలిపారు. హైటెక్ రంగ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమకు అవసరమైన పరికరాలు, కాంపోనెంట్లను సమకూర్చుకునే వెసులుబాటు కల్పిస్తామని గోయల్ తెలిపారు. భారత్‌లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే హైటెక్ సంస్థలకు అవసరమైన పరికరాలు, వస్తువులు, సేవలు సకాలంలో అందుబాటులో ఉండేలా చేయడం, ‘మేక్ ఇన్ ఇండియా’కు మద్దతు ఇవ్వడం ఈ మార్పు లక్ష్యమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!


