సాక్షి, పల్నాడు: చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కొండమంజులూరు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఆటోను విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన బస్సు ఆటోను బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వాళ్లంతా వేలూరు వాసులుగా పోలీసులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, మరియమ్మ, సువార్తగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుతాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణాలు గుర్తించే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిన్న వేకువ జామున ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీ రోడ్డు మధ్యలో ఆగిపోగా.. మితిమీరిన వేగంతో వెళ్లిన బస్సు దాన్ని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలింది.


