సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
జూన్, జూలై, ఆగస్టులో ఇప్పటి వరకు రాష్ట్రంలో 52% లోటు వర్షపాతం
అది తెలిసీ.. సాగుకు నీళ్లు ఇస్తున్నామంటూ వెన్నుపోటు ప్రభుత్వం మంత్రుల పబ్లిసిటీ స్టంట్
నీళ్లు ఇస్తారనే ఆశతో నార్లు నాటుకున్న రైతులు.. ఇప్పుడు నార్లు ఎండిపోయి తీవ్ర నష్టాలపాలు
ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతాంగం
తీవ్ర లోటు వర్షపాతం, కరువు పరిస్థితులు కనిపిస్తున్నా రైతులు, ప్రజలను ఆదుకునే చర్యలే లేవు
కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన పంటల బీమాను నాశనం చేసిన బాబు
ఈ ఆగస్టు 11 నాటికి శ్రీశైలంలో 879.50 అడుగుల నీటి సామర్థ్యం
పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాజెక్టులకు నీళ్లిచ్చే అవకాశమున్నా బాబుకు మనసొప్పలేదు
ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు వాడేస్తున్న పరిస్థితి
మూడు వారాల్లో నీటి నిల్వ 854 అడుగుల కంటే దిగువకు చేరుకోనుంది.. నిల్వ 854 అడుగుల దిగువకు చేరాక సీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలనుకున్నా, ఇచ్చే అవకాశం ఉండదు
బాబు లాంటి పాలకులుంటారనే మా ప్రభుత్వంలో రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం ప్రారంభించాం
అక్రమ లిఫ్ట్‌ల నిర్మాణాలతో కృష్ణా జలాలను తెలంగాణ తరలిస్తున్నా నోరు మెదపని బాబు
పులిచింతల ఎగువ, దిగువన 10.5 టీఎంసీల నీటి తరలింపు కోసం తెలంగాణ అడుగులు
జూన్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి, విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. ఈ రోజు నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి పాలకులు ఉంటారనే... రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయలసీమ ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.
సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత రైతులకు మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు?
చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ2025లో అక్రమాలు, పేపర్ లీకేజీల మీద సాక్ష్యాలు, ఆధారాలతో గత వారం సమగ్రంగా మాట్లాడా. ఏపీపీఎస్సీ గ్రూప్‌ృ1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలపై సాక్ష్యాలతో వాస్తవాలను వివరించా. ఈ రెండింటిపై సీబీఐ విచారణకు మేం రెడీ.. మీరు రెడీనా? అని ఛాలెంజ్ కూడా చేశా. నేను ఛాలెంజ్ చేశాక ఇంత వరకూ ఆ అంశాలపై వాళ్లు మాట్లాడలేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా రిపోర్టర్‌లు అడిగిన ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలపై వక్రీకరణలు చేస్తున్నారు.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉందని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే 25 శాతం లోటు వర్షపాతం నమోదు అయిందని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా, సాగుకు నీళ్లు ఇస్తున్నామంటూ జూలై 8న వెన్నుపోటు పార్టీ మంత్రులు ఫొటోలకు ఫోజులు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీరి మాటలు నమ్మి సాగు ప్రారంభించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో తీవ్ర కరువు తాండవిస్తోందని గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయకట్టు చివర ఉండే ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించారంటూ చేసిన ప్రచారాలను నమ్మి ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీటిమట్టం ఉన్నప్పటికీ చంద్రబాబు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వకుండా సీమ ప్రాజెక్టులన్నీ ఒట్టిపోయేలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పులిచింతల నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ అక్రమంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడం.. రైతులకు అండగా నిలవడంలో చంద్రబాబు సర్కార్ ఘోర నిర్లక్ష్యం, దారుణ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
సీమలోనే కాదు.. కోస్తాలోనూ కరువు ఛాయలు
రాష్ట్రంలో కరువు ప్రమాద ఘంటికలు మోగుతున్నా చంద్రబాబులో కనీస స్పందన లేకుండా పోయింది. జూన్, జూలై, ఆగస్టు.. ఇప్పటి వరకూ 52 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 41.78 శాతం, రాయలసీమలో 52.36 శాతం.. ఇలా రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులున్నా కుంభకర్ణుడి తరహాలో చంద్రబాబు నిద్ర నటిస్తున్నారు. రైతులకు మంచి చేస్తూ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. జూన్ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకూ సాధారణ వర్షపాతం 388.54 మిల్లీవీుటర్లు (ఎంఎం) నమోదు అవ్వాల్సి ఉండగా 189.62 ఎంఎం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో 688కిగానూ 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. అంటే 91 శాతం రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. ఈ 625 మండలాల్లో 434 చోట్ల 19 శాతం కంటే అధికంగా లోటు వర్షపాతం ఉంది. మరో 191 మండలాల్లో 19 శాతం నుంచి 59 శాతం వరకూ తీవ్ర లోటు వర్షపాతం నెలకొంది. ఇక 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఏఎస్‌ఆర్, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షపాత లోటు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నిత్యం కరువు ఉండే రాయలసీమ జిల్లాలే కాకుండా కోస్తాంధ్ర జిల్లాల్లోనూ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతాంగం, ప్రజలు అల్లాడుతుంటే దీన్ని గుర్తించడానికి కూడా వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు ఇష్టపడటం లేదు. రైతులను ప్రజలను ఆదుకోవడానికి ఏ మాత్రం అడుగులు ముందుకు వేయడం లేదు. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో 63 లక్షలకు పైగా ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా కేవలం 50 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. అంటే దాదాపు 80 శాతానికే సాగు పరిమితం అయింది.
సీమకు నీళ్లివ్వడానికి బాబుకు మనసు రాలేదు
రాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఈ ఆగస్టు 11వ తేదీనే 879.50 అడుగులకు చేరుకుంది. అవకాశం ఉన్నా కూడా, పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాలేదు. శ్రీశైలంలో 880 అడుగుల్లో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలవచ్చు. 880 అడుగుల నుంచి నీటిమట్టం తగ్గేకొద్దీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం తగ్గుతూ పోతుంది. 854 అడుగుల కంటే కిందకు నీటిమట్టం పడిపోతే... రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలనుకున్నా, ఇవ్వలేని దుస్థితి వస్తుంది. అలాంటిది ఈ రోజు పరిస్థితి గమనిస్తే శ్రీశైలం నుంచి ఎడాపెడా అటు తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేస్తుండగా, ఇటు చంద్రబాబు కూడా రైతుల గురించి ఆలోచించకుండా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. రోజుకు 48 వేల క్యూసెక్కులు నీటిని వాడుతున్నారు.
ప్రస్తుతం ఇన్‌ఫ్లో కేవలం 7 వేల క్యూసెక్కులు ఉంటే ఔట్‌ఫ్లో 48 క్యూసెక్కులు ఉంటోంది. నికరంగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల దిగువకు చేరుకుంటుంది. ఈ రోజు బహుశా 165 టీఎంసీల నీళ్లున్నాయి. రోజుకు 3.5 టీఎంసీల లెక్కన వాడుతూ పోతే మూడు వారాల్లో 75 టీఎంసీల మేర ఖర్చు అయిపోతాయి. 854 అడుగుల నీటి మట్టానికి వచ్చేస్తాం. దీని తర్వాత రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నా ఇవ్వలేం. ఇంతకంటే నీటిమట్టం పడిపోతే పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేం. మరోవైపు ఎల్‌నినో, కరువు కనిపిస్తోంది. జూన్, జూలై, ఆగస్టు కూడా అయిపోయింది. సెప్టెంబర్ 15 వరకే వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీశైలంలో ఎడాపెడా నీళ్లు తోడేస్తుంటే 854 అడుగుల కిందకు నిల్వలు పడిపోయాక రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా? మరి ఇప్పుడు మీరెందుకు నీరు ఇవ్వడం లేదు? అని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇలాంటి పాలకులు ఉంటారనే.. రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయల సీమ ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.
ఒక్క పైసా ఇవ్వని దుస్థితి
2025 అక్టోబర్‌లో మోంథా తుపాను వచ్చి రైతులు నష్టపోతే ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా సాయం చేయలేదు. ఉచిత పంటల బీమాను నాశనం చేశారు. సీజన్ ముగిసేలోపే ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశారు. ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు. అగ్రి ల్యాబ్‌్సను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తెచ్చింది. మా హయాంలో ‘సీఎం యాప్’ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలతో పోస్టర్‌లు ప్రదర్శించే వాళ్లం. ఆ ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసేవారు. తక్షణమే జాయింట్ కలెక్టర్/మార్క్‌ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రంగంలోకి దిగేవారు. పంటలు కొనుగోలు చేసి మార్కెట్‌లో పోటీ సృష్టించేవారు. దీంతో రేట్లు పెరిగేవి. ఈ మాదిరిగా మా హయాంలో ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా నిలిచాం. గిట్టుబాటు ధరలు ఇప్పించాం. ఇప్పుడు ఆ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారు. చివరకు రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేసేశారు. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చిందేమో రూ.19 వేలు. ఏకంగా రూ.41 వేలు ఎగ్గొట్టాడు.
ఆదుకునే ఆలోచన ఉందా బాబూ?
ఇంత తీవ్రమైన కరువు పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీలు, ప్రజలను చంద్రబాబు ఆదుకున్నారా? అసలు ఆదుకునే ఆలోచన అయినా ఆయనకు ఉందా? ఎంతసేపూ మాపై తప్పుడు ప్రచారం చేయడం, అబద్ధాలు, టాపిక్ డైవర్షన్, రెడ్‌బుక్‌పైనే ధ్యాస పెడుతున్నారు. కరువు సమయంలో ప్రజలను ఆదుకోవాలనే ధ్యాస లేదు. జూన్, జూలై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే వర్షాలు పడతాయి. అప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. జూన్‌లో 25 శాతం, జూలైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. ఆ రెండు నెలల్లోనే సగటున 52 శాతం లోటు వర్షపాతం కనిపించింది. ఇంత లోటు వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్) ఏమైంది? ఆగస్టులోనే దాన్ని అమలు చేసి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇచ్చి ఉంటే ఆగస్టు, సెప్టెంబర్‌లో కొద్దో గొప్పో కురిసే వర్షాలతో పంటలు పండి రైతులు కొంతైనా బాగుపడేవారు. అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, జొన్నలు, పెసలు ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయ పంటలు.
మరి ఎంత మందికి మీరు ప్రత్యామ్నాయంగా ఉచిత విత్తనాలు ఇచ్చారు? విత్తనాల పంపిణీ ఎందుకు జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకుని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేశారు? వర్షపాతం జూలై చివరి నాటికి 52 శాతం లోటు ఉన్న నేపథ్యంలో కరువు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎదుర్కొనే వ్యవస్థ (డ్రౌట్ మానిటరింగ్ సెంటర్లు) పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉండాలి. జిల్లా కంటింజెన్సీ ప్లాన్‌లు అమలై ఉండాలి. విపత్తు నిర్వహణ ప్రణాళిక (క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్) అమలులోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లాలో డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ఏర్పాటై ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌట్, రిసీలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్స్ పంపిణీ రైతులకు జరిగి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా? ఆగస్టు నెల ముగుస్తోంది. సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. మేత అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు? గుండెల మీద చేయి వేసుకుని తనను తాను చంద్రబాబు ప్రశ్నించుకోవాలని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా.
కనిష్ట స్థాయిలో సీమ డ్యామ్‌లలో నీటి నిల్వలు
రాయలసీమలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. తెలుగు గంగ కెనాల్‌పై ఆధారపడిన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలు అయితే ప్రస్తుతం కేవలం 55 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ 14 టీఎంసీలు తీసేస్తే అందుబాటులో ఉన్నది 41 టీఎంసీలే. అంటే కేవలం 23 శాతం నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఎస్‌ఆర్‌బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), జీఎన్‌ఎస్‌ఎస్ (గాలేరు–నగరి) కింద ఉండే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్‌ల నిల్వ సామర్థ్యం 59 టీఎంసీలు. వీటిలో ఇప్పుడు కేవలం 31 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే 23 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంటే కేవలం 39 శాతం నీళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ (హంద్రీ–నీవా) కింద జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి నిల్వ సామర్థ్యం 8.31 టీఎంసీలు. ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 టీఎంసీలు పోనూ కేవలం 2.5 టీఎంసీల నీరే అందుబాటులో ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కరువు తీవ్రత మరింత దారుణంగా ఉంటుందని స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణ నీళ్లు మళ్లిస్తుంటే బాబు మౌనం
మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాల్వ, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ప్రాంతానికి చంద్రబాబు చుక్క నీరు ఇవ్వడం లేదు. ఇంకా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే.. నాగార్జున సాగర్ కింద ఏపీకి సంబంధించిన పులిచింత ప్రాజెక్ట్ ఎగువన, దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా లిఫ్ట్‌లు కడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం చింతలపాలెం మండలం పాతవెల్లటూరు దగ్గర రూ.1,450 కోట్లతో మహాత్మాగాంధీ పంప్డ్ హౌజ్ నిర్మాణాన్ని వేగంగా చేపడుతోంది. దీని ద్వారా పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలింపు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం. అదే విధంగా తెలంగాణలోనే చింతలపాలెం మండలం బుగ్గమాదారం దగ్గర రూ.394 కోట్లతో రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా పులిచింతల దిగువన కృష్ణా నది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించాలని చూస్తున్నారు. పులిచింతల సామర్థ్యం దాదాపు 45 టీఎంసీలు అయితే ఏకంగా 10.5 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ల ద్వారా మళ్లించడానికి తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడితే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. కనీసం మాటలు లేవు. అడిగిన దాఖలాలూ లేవు. సాగునీటికి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితులను చంద్రబాబు కల్పించారు.
పబ్లిసిటీ స్టంట్‌తో రైతులను ముంచారు..
జూన్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. సాగుకు వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఈరోజు ఆ నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.
బాబు నిర్వాకంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టం
కరువు వల్ల ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు ఆదుకుంటున్నారా? అంటే అదీ లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్సార్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని భరించి కట్టుకోవాల్సిన దుస్థితి తెచ్చారు. పంటల బీమా పథకం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం గమనిస్తే.. రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో 2022–23 ఖరీఫ్‌లో 1.18 కోట్ల దరఖాస్తులకు ఉచిత పంటల బీమా వర్తిస్తే.. 2026–27 ఖరీఫ్‌లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందకు వచ్చాయి. ఇది స్వయంగా పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు. పీఎంఎఫ్‌బీవై కింద రాష్ట్రాలు, సంవత్సరాల వారీగా రైతులు, పంటల బీమాలో కవర్ అయిన భూ విస్తీర్ణం, ఇతర వివరాలను స్పష్టంగా కేంద్రం పార్లమెంట్‌కు ఇచ్చింది. మా హయాంలో నమోదైన 1.18 కోట్ల దరఖాస్తులు ఎక్కడ? బాబు పాలనలో రైతులే ప్రీమియం కట్టుకునే పరిస్థితుల్లో 40 లక్షల దరఖాస్తులు ఎక్కడ? ప్రస్తుతం 30–33 శాతం రైతులే బీమా పరిధిలోకి వచ్చారని తెలుస్తోంది. పైగా ఇంకా దారుణం ఏంటంటే 2023–24కు సంబంధించి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024 జూలైలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున ప్రీమియం కట్టాలి. రైతులు, రాష్ట్ర వాటాను రాష్ట్ర ప్రభుత్వం కడితే 1/3 వాటాను కేంద్రం ఇస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఏకంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది. రూ.1,100–1,800 కోట్లు కట్టి ఉంటే రైతులకు రూ.3 వేల కోట్లు వచ్చేవి.


