సాధిక్
ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్యపై పోలీసుల విచారణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి హత్యలో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. సాధిక్ ప్రొటీన్ పౌడర్‌లో కెమికల్స్ కలిపి తన తండ్రికి ఇచ్చాడంటూ జగదీశ్వరరెడ్డి కుమారుడు రియాన్ష్ కార్తికేయ చెప్పడంతో దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కెమికల్ కేరళ నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని, అది సాధిక్‌కు చేరేలా హైదరాబాద్‌లోని ఓ బంగారు దుకాణం యజమాని సహకరించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిని నిగ్గు తేల్చేందుకు పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లింది.నూకరాజు కుటుంబం నుంచి ఆస్తులు లాక్కునేందుకు సాధిక్ ప్రయత్నించాడనే ఆరోపణలపైనా విచారణ జరుపుతున్నారు.
నూకరాజు కుటుంబం, జగదీశ్వరరెడ్డి ఆస్తులకు సంబంధించి రెండేళ్లలో ఏవైనా లావాదేవీలు జరిగాయా.. అవి ఎవరి పేరు మీద బదిలీ అయ్యాయో తెలుసుకొనేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. సౌజన్య బ్యాంక్ ఖాతాలు, పాస్ పుస్తకాలను సాధిక్ లాక్కున్నాడనే అంశంపైనా విచారణ సాగుతోంది. సాధిక్ తిమ్మాపురం పంచాయతీలో నూకరాజు పేరిట ఉన్న స్థలాన్ని విక్రయించేందుకు సైతం ప్రయత్నించాడని ఓ వ్యక్తి వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.
రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు?
సాధిక్ ఖాన్‌ను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలిసింది. సాధిక్ మొదటి నుంచీ ఆస్తి కొట్టేయాలనే ఆలోచనతో ఉండేవాడని పేర్కొన్నట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి అడ్డు తొలగించుకుని, సౌజన్యను పెళ్లి చేసుకుని, ఆమె డబ్బు, బంగారం, ఆస్తి తీసుకోవాలని అతను పథకం వేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపినట్లు సమాచారం.
జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సాధిక్ అతడితో గొడవ పడి, తీవ్రంగా గాయపరిచాడని, అడ్డు వచ్చిన సౌజన్యపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. జగదీశ్వరరెడ్డిని అనేక మార్లు కొట్టినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. జగదీశ్వరరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సమయంలో సాధిక్ హైదరాబాద్‌లోనే ఉండి సౌజన్యతో ఫోనులో మాట్లాడేవాడని కాల్ డేటా ద్వారా తేలినట్లు సమాచారం.
బయటకొచ్చిన మరో లేఖ..!
నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖలతో పాటు మూడో సూసైడ్ నోట్ సైతం ఉన్నట్లు సమాచారం. ఆ నోట్ నూకరాజు భార్య మీనాదిగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్, హ్యాండ్ రైటింగ్ పరీక్షకు పంపినట్లు సమాచారం. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం నిందితుడు షేక్ సాధిక్ ఖాన్‌ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలంటూ సర్పవరం పోలీసులు కాకినాడ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


