హైదరాబాద్: ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా (22ఏ)లోకి చేర్చి, ప్రభుత్వమే పెద్ద కబ్జాదారులా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. కూకట్‌పల్లిలో 22ఏ బాధితుల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పాలన సాగిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం భూముల కేంద్రంగానే వ్యవహారాలు నడుపుతోందని మండిపడ్డారు.
కేసీఆర్ సీఎం కాగానే తాగునీరు, నగర ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారని, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వరి సాగులో పంజాబ్‌ను దాటి తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. ఆయన ప్రతి నిర్ణయం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ విలువైన భూమి కనిపించినా అమ్మకానికి పెడుతోందని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పటికే రెండున్నరేళ్లలో రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని, భవిష్యత్ అవసరాలకు కూడా భూములు మిగల్చడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు సామాన్యుల భూములను 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రజల నుంచి భూములను గుంజుకుని తమ అనుచరులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్‌లో అకారణంగా 22-ఏ నిషేధిత జాబితాలోచేర్చిన భూములను వెంటనే తొలగించాలని మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన 22-ఎ బాధితుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు, రుణాలు అందక వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యుడైన మంత్రిని బర్తరఫ్ చేయాలని కోరారు. సెప్టెంబర్ 7 లోగా సమస్య పరిష్కారం కాకపోతే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. 22-ఎ బాధితులకు మద్దతుగగా ఈనెల 29న అమీన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ పోరుబాట చేపడుతుందని హరీష్ రావు ప్రకటించారు.


