సాక్షి, సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.

బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో డివైడర్ మధ్యలో ఐరన్ లోడ్ లారీ ఆగిపోయింది. అయితే వేగంగా వెళ్లిన బస్సు.. లారీ కంటైనర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి.
సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వాళ్లను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
అతివేగం.. ముందు ఆగిఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్సీ నరసింహ తెలిపారు. డ్రైవర్ అందుబాటులో లేడని(పరారీ?).. ఉదయం 4గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో.. చిన్ని, మేరీ, నాగేంద్రబాబులను గుర్తించినట్లు తెలిపారు. మిగతా మృతుల పేర్లు.. వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలకి దిగి క్లియర్ చేశారు.
టీ విరామం తర్వాత బస్సు ప్రారంభమైన గంటకు ప్రమాదం జరిగిందని.. బస్సు బలంగా ఢీ కొట్టాక ఐరన్ దిమ్మెలు వచ్చి పడ్డాయని క్షతగాత్రుడొకరు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత 20 మందిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు కోదాడ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. వాళ్లలో ముగ్గురిని సూర్యాపేటకు తరలించినట్లు వెల్లడించారు.


