పోలిశెట్టి మల్లికార్జున్, మర్రిపల్లి శ్రీనివాస్, అధిక మంజునాథ్, వడాల రాజేంద్రనాథ్
నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో కుట్ర
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
నలుగురికి రిమాండ్, పరారీలో మరో నలుగురు వ్యక్తులు
కందుకూరు: నకిలీ పత్రాలు సృష్టించారు.. భూ యజమానులను భయభ్రాంతులకు గురిచేశారు.. సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని కాజేసే యత్నం చేశారు.. చివరికి పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. కందుకూరుకు చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, మర్రిపల్లి మహేశ్, మర్రిపల్లి అర్జున్, మహేశ్వరం మండలం మంఖాల్‌కు చెందిన ఉల్ల మల్లేశ్ కందుకూరు రెవెన్యూ సర్వే నంబర్లు 151, 152, 153, 165, 166లోని తమ పేర్లతో పాటు తమ కుటుంబానికి చెందినవారి భూమిని రాజేంద్రనగర్‌కు చెందిన పోలిశెట్టి మల్లికార్జున్, జూబ్లీహిల్స్‌కు చెందిన వడాల రాజేంద్రనాథ్, పుప్పాలగూడకు చెందిన అధిక మంజునాథ్‌రెడ్డికి డెవలప్‌మెంట్ కోసం ఇస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న మర్రిపల్లి కుమార్, మర్రిపల్లి అశోక్, మర్రిపల్లి శైలజ, మర్రిపల్లి నీలమ్మ, మర్రిపల్లి నర్సింహ, మర్రిపల్లి కల్పన, బొద్దం జంగారెడ్డి, ఐ.శ్యాంసుందర్‌రెడ్డి తదితరులను సంప్రదించగా వారు నిరాకరించారు. దీంతో వారి ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాల వివరాలు సేకరించారు. 21 మంది పట్టాదారులు కలిసి మొత్తం 31.36 ఎకరాలు (డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కమ్ ఇర్రోకబల్ జనరల్ పవర్ ఆఫ్ అటారీ్న) రద్దు చేయలేని డెవలప్‌మెంట్ జీపీఏ చేసినట్లుగా 2024 మార్చి 26న నకిలీ పత్రాలు సృష్టించారు. తోట్ల సాయి అనే వ్యక్తితో భూమి ఇవ్వడానికి అంగీకరించని యజమానుల సంతకాలను ఫోర్జరీ చేయించారు.
ఏవిధంగానైనా ఆ యజమానుల నుంచి భూమి డెవలప్‌మెంట్‌కు తీసుకోవాలన్న సంకల్పంతో ఒత్తిడి తెచ్చారు. ఇటీవల బాధితులకు తమకు భూమి అగ్రిమెంట్ చేసి ఇవ్వడంలేదని, చర్యలు తీసుకుంటామని తెలిపేలా లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. అప్పటి వరకు తమ భూమి ఇలా ఫోర్జరీ జరిగిన విషయం యజమానులకు తెలియదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నకిలీ పత్రాలు సృష్టించి అగ్రిమెంట్ చేసుకున్న పోలిశెట్టి మల్లికార్జున్, వడాల రాజేంద్రనాథ్, అధిక మంజునాథ్‌రెడ్డితో పాటు వారికి సహకరించిన మర్రిపల్లి శ్రీనివాస్, ఉల్ల మల్లేశ్, తోట్ల సాయి, మర్రిపల్లి అర్జున్, మర్రిపల్లి మహేశ్‌పై కేసు నమోదు చేశారు. వీరిలో పోలిశెట్టి మల్లికార్జున్, మర్రిపల్లి శ్రీనివాస్, వడాల రాజేంథ్రనాథ్, అధిక మంజునాథ్‌రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకుని సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. మల్లేశ్, సాయి, అర్జున్, మహేశ్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.


