గల్లీకో నకిలీ డాక్టర్‌! | Fake Doctors Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

గల్లీకో నకిలీ డాక్టర్‌!

Aug 26 2026 6:05 AM | Updated on Aug 26 2026 6:05 AM

Fake Doctors Arrested In Hyderabad

మీడియా సమావేశంలో అరెస్టు చేసిన నిందితులతో పోలీసులు

కనీసం ఆర్‌ఎంపీలు కూడా కాకుండానే వైద్యం 

ఎక్కడికక్కడ క్లినిక్‌లు నిర్వహిస్తూ డాక్టర్లుగా చెలామణి 

హైదరాబాద్‌ వ్యాప్తంగా దాడులు చేసిన టాస్క్ ఫోర్స్‌ 

12 మంది నిందితుల అరెస్టు, ఔషధాలు సీజ్‌

సాక్షి, హైదరాబాద్‌: నర్సు... కాంపౌండర్‌... అనస్థీషియా అసి­స్టెంట్‌... ఫస్ట్‌ ఎయిడ్‌ ప్రొఫెషనల్‌... ఈ కోర్సులు చది­విన వాళ్లు, ఇలా పనిచేసిన వాళ్లూ డాక్టర్లుగా మారిపోయా­రు. ఎవరికి వారుగా సొంత క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని సెలై­న్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు చేయడంతో పాటు ఎడాపెడా మందుల్నీ రాసేస్తున్నారు. మరికొందరు తమ కుటుంబీకుల ఎంబీ­బీఎస్‌ డిగ్రీలు అడ్డం పెట్టుకుని ప్రాక్టీసు కొనసాగిస్తు­న్నా­రు. 

ఇలాంటి సూడో డాక్టర్లు నిర్వహిస్తున్న క్లినిక్‌లపై టాస్క్ ఫోర్స్‌ పోలీసులు వరుస దాడులు చేశారు. ఫలితంగా 12 మంది చిక్కారని, వీరినుంచి భారీగా ఔషధాలు, పరికరా­లు, లెటర్‌హెడ్స్‌ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ మంగళవారం తెలిపారు. ఇన్‌స్పెక్టర్లు జె.రాజశేఖర్, సీహెచ్‌ యదేందర్‌లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివ­రాలు వెల్లడించారు. ఇటీవల చోటు చేసుకున్న రోగుల మరణా­ల నేపథ్యంలో ఈ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. నిందితు­లైన ఒక్కో ‘డాక్టర్‌’వెనుక ఒక్కో కథ ఉందని వివరించారు.   

మెడికల్‌ షాపు నడవటం కోసం క్లినిక్‌ 
కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన డి.రామశేఖర్‌ రెడ్డి 2015 నుంచి తన భార్య నాగజ్యోతి డి–ఫార్మసీ సర్టీఫికెట్‌ ఆధారంగా రహమత్‌నగర్‌లో ‘ఆక్వా ఫార్మసీ‘ని నడుపుతున్నాడు. ఈ దుకాణానికి వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గడంతో తానే ఓ క్లినిక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫార్మసీని శ్రీ ఆక్వా ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌గా మార్చేసి డిప్లొమా ఇన్‌ అన­స్థీషియా టెక్నీషియన్‌ పూర్తి చేసిన నిజాంపేట వాసి రాగం సుధాకర్‌ను డాక్టర్ని చేశాడు. ఈయన రోజుకు దాదాపు 50 మంది రోగులకు వైద్యం చేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.200 చొప్పున ఫీజు వసూలు చేసి పంచుకుంటున్నారు.  

నర్సు అనుభవంతో పీడియాట్రిక్‌ ప్రాక్టీస్‌ 
తూప్రాన్‌కు చెందిన మిరుదొడ్డి భారతి మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ కోర్సు చేసి, నర్సుగా పని చేసింది. ఈ అనుభవంతో డాక్టర్‌గా మారి రహమత్‌నగర్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. కొన్నాళ్లుగా పీడియాట్రిక్‌ డాక్టర్‌గా మారిపోయి చిన్న పిల్లలకూ వైద్యం చేస్తోంది.  

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ మానేసి క్లినిక్‌ 
జూబ్లీహిల్స్‌కు చెందిన కాటిక మహేశ్‌రావు బీఏ చదివాడు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పెట్టి నష్టపోయిన ఇతగాడు... నకిలీ వైద్యుడిగా మారి రెండేళ్ల క్రితం వెంకటగిరిలో ఒక గదిని అద్దెకు తీసుకుని క్లినిక్‌ ప్రారంభించి ప్రాక్టీసు చేస్తున్నాడు.  

కుమార్తె డిగ్రీతో తండ్రి వైద్యం 
షేక్‌పేటకు చెందిన పానుగంటి బాల నరసింహ ఫార్మసీ పూర్తి చేసి శ్రీ తిరుమల మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. ఈయన కుమార్తె పి.పరమేశ్వరి ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీకి సిద్ధమవుతున్నారు. ఆమె సర్టీఫికెట్‌ ఆధారంగా తన దుకాణం పక్కనే క్లినిక్‌ ఏర్పాటు చేశాడు. తానే డాక్టర్‌గా మారి వైద్యం చేస్తున్నాడు.  

ల్యాబ్‌ టెక్నీషియనే డాక్టర్‌ 
ఇంటరీ్మడియట్‌ మధ్యలో ఆపేసిన మహమ్మద్‌ అబ్దుల్‌ వలీ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఆ అనుభవంతో గంగానగర్‌ వెజిటబుల్‌ మార్కెట్‌ వద్ద క్లినిక్‌ తెరిచి డాక్టర్‌గా అవతారమెత్తాడు.   

తండ్రి సర్టిఫికెట్‌తో ప్రాక్టీస్‌ 
సికింద్రాబాద్‌కు చెందిన ఎ.సందానీ తండ్రి ఎస్జీ సుబానీ చర్మ వైద్యుడు. ఇంటరీ్మయట్‌లో బైపీసీ చదివిన ఇతగాడు తండ్రి సర్టీఫికెట్‌ ఆధారంగా నల్లగుట్టలో నాలుగేళ్లుగా సందానీ క్లినిక్‌ పేరుతో క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. ఇతడు రోగులకు ఇస్తున్న పెట్రోలియం జెల్లీలో హానికరమైన కాల్షియం పౌడర్, జింక్‌ ఆక్సైడ్‌ తదితరాలు ఉన్నట్లు తేలింది.   

కాంపౌండర్లే క్లినిక్‌లు... 
బీహెచ్‌ఎంసీ చదివి, పదేళ్లు కాంపౌండర్‌గా పని చేసిన ఎన్‌.ప్రసాద్‌ చిలకలగూడలో ఫ్యామిలీ క్లినిక్, డిగ్రీ చదివి కొన్నాళ్లు కాంపౌండర్లుగా పని చేసిన ఎం.శ్రీనివాస్, పి.సదానంద్, సీహెచ్‌ రమేష్ , ఎస్‌.లింగయ్యలు లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో సాయిరాం క్లినిక్, చిలకలగూడలో సాయిరాం క్లినిక్, మాణికేశ్వర్‌ నగర్‌లో సరోజినీ పాలీ క్లినిక్, సూర్య క్లినిక్‌లు ఏర్పాటు చేసి ఏళ్లుగా వైద్యం చేసేస్తున్నారు. తమ వైద్యంలో పరిస్థితి చేతులు దాటిన పేషెంట్లను ఇతర కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు పంపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement