‘కేరళ రీల్’.. పదేళ్ల తర్వాత కన్నవారి చెంతకు దివ్యాంగుడు! | Second Kerala Reel Ends 10 Year Search for Missing Jharkhand Man | Sakshi
Sakshi News home page

‘కేరళ రీల్’.. పదేళ్ల తర్వాత కన్నవారి చెంతకు దివ్యాంగుడు!

Aug 25 2026 12:37 PM | Updated on Aug 25 2026 12:38 PM

Second Kerala Reel Ends 10 Year Search for Missing Jharkhand Man

కాలికావు: కేరళలో తీసిన పది సెకన్ల ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌.. దాదాపు పదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ దివ్యాంగుడిని తిరిగి తన కుటుంబంతో కలిపింది. తామరస్సేరిలోని ఓ డ్రై ఫ్రూట్స్‌ సంస్థలో పనిచేస్తున్న ఎంకే మహమ్మద్‌ యాసిర్‌ మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తామరస్సేరి సమీపంలోని ‘కారుణ్యదీపం ప్రతీక్షా భవన్’ అనే దివ్యాంగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న వేడుకలను వీడియో తీస్తుండగా, సమూహంలో ఉన్న ఒక యువకుడు కెమెరా వైపు చూసి చిరునవ్వు చిందించడం యాసిర్ దృష్టిని ఆకర్షించింది. ఇద్దరూ పరస్పరం చేతులు ఊపుకోగా, ఆ క్లుప్త సంభాషణ దృశ్యాన్ని యాసిర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా పోస్ట్‌ చేశారు.

ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో యువకుడిని గుర్తించిన పలువురు ముందుగా యాసిర్‌ను సంప్రదించారు. అనంతరం ఆ యువకుడి బంధువులు కూడా యాసిర్‌తో మాట్లాడారు. సుమారు పదేళ్ల క్రితం ముంబై రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుడిగా (జార్ఖండ్‌ నివాసి) బంధువులు అతడిని గుర్తించారు. ముంబై నుంచి ప్రయాణించే క్రమంలో దారితప్పిన అతడు కోజికోడ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.

అప్పట్లో చైల్డ్‌లైన్‌ సంస్థ ద్వారా అతడిని వెల్లిమాడుకున్నులోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత తామరస్సేరిలోని కారుణ్యదీపం ప్రతీక్షా భవన్‌కు మార్చగా, అక్కడ అతడు ‘రషీద్’ అనే పేరుతో జీవిస్తున్నాడు. ఇటీవల బంధువులు వీడియో కాల్ ద్వారా అతడిని చూసి కన్నీటిపర్యంతమై, దశాబ్ద కాలం నాటి తమ నిరీక్షణకు ముగింపు పలికారు. ప్రస్తుతం అతడు సాంఘిక సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్నందున, అధికారిక లాంఛనాలు పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నదని కారుణ్యదీపం ప్రతీక్షా భవన్ సీఈవో నవాస్ తెలిపారు.

ఇది కూడా చదవండి: యూట్యూబ్‌లో ‘సీక్రెట్ హౌస్’ చూసి ఇద్దరు చిన్నారులు మాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement