మీరట్ (యూపీ): యూట్యూబ్‌లో చూసిన ఓ విచిత్రమైన ఆన్‌లైన్ గేమ్ ఛాలెంజ్‌తో ప్రేరణ పొంది ఇద్దరు చిన్నారులు ఇల్లు విడిచి వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... యూట్యూబ్‌లోని ‘సీక్రెట్ హౌస్’ గేమ్‌కు సంబంధించిన '24 గంటల ఛాలెంజ్'లో భాగంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
హస్తినాపూర్‌కు చెందిన 11 ఏళ్లు, 7 ఏళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు ఆదివారం మధ్యాహ్నం తమ ఇళ్ల నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారని మవానా సర్కిల్ ఆఫీసర్ పంకజ్ లవానియా తెలిపారు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు ‘మిషన్ శక్తి’ పేరిట ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అదే రోజు ఇద్దరు పిల్లలను క్షేమంగా గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.
యూట్యూబ్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ 24 గంటల సీక్రెట్ హౌస్ గేమ్‌లో రహస్య స్థావరాలు లేదా గదులను నిర్మించడం ప్రధాన అంశంగా ఉంటుంది. ఈ తరహా గేమ్‌ప్లేలు చిన్నారులను నిజ జీవితంలోనూ ఇలాంటి దాక్కునే ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నాయి. పోలీసుల విచారణలో పిల్లలు తాము యూట్యూబ్‌లో గేమింగ్ కంటెంట్ చూశామని, ఆ ఛాలెంజ్‌ను స్వయంగా అనుకరించేందుకే బయటకు వెళ్లామని తెలిపారు. ఈ గేమ్‌లో పాల్గొనేవారు రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని, నిర్దేశిత నిబంధనల ప్రకారం 24 గంటల పాటు అక్కడే దాక్కొని ఉండాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఓణం హిందూ పండుగ కాదా?.. తెరపైకి కొత్త చర్చ!


