ఆ ఒక్క పాటతో అన్ని వందల కోట్లు వచ్చాయా? | PSY Gangnam Style Hits 6 Billion Youtube Views, How Much Did The Global Hit Earn? Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క పాటతో అన్ని వందల కోట్లు వచ్చాయా?

Aug 19 2026 10:47 AM | Updated on Aug 19 2026 11:05 AM

PSY Gangnam Style Hits 6 Billion Views Earns Hundreds of Crores

ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ఆ పాట.. 14 ఏళ్లు గడిచినా యూట్యూబ్‌లో తన జోరు కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అలరించిన ఆ సాంగ్‌ తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఒకప్పుడు యూట్యూబ్‌లో బిలియన్‌ వ్యూస్‌ అందుకున్న తొలి వీడియోగా చరిత్ర సృష్టించిన అదే పాట.. ఇప్పుడు 6 బిలియన్‌ మార్క్‌ను అందుకుని తన సత్తా చాటింది. అంతటి ఆదరణ పొందిన ఈ పాట.. సింగర్‌ పీఎస్‌వైకి ఎంత ఆదాయాన్ని తెచ్చిపెట్టిందన్నదే ఇప్పుడు ఆసక్తికరం.

దక్షిణ కొరియా పాప్‌ స్టార్‌ పీఎస్‌వై పాడిన ‘గంగ్నమ్‌ స్టైల్‌’ తాజాగా 6 బిలియన్‌ వ్యూస్‌ దాటి మరో సెన్సేషన్‌గా మారింది. 2012 జులైలో విడుదలైన ఈ పాట.. అదే ఏడాది డిసెంబర్‌లో యూట్యూబ్‌లో ఫస్ట్‌ బిలియన్‌ వ్యూస్‌ సాధించిన తొలి వీడియోగా చరిత్ర సృష్టించింది. 2013లో ఈ పాటకు సుమారు 1.23 బిలియన్‌ యూట్యూబ్‌ వ్యూస్‌ ఉన్న సమయంలో.. గూగుల్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ నికేష్‌ అరోరా ఈ వీడియోకు 8 మిలియన్‌ డాలర్లకుపైగా యాడ్‌ రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అప్పటి లెక్కల ప్రకారం 8 మిలియన్‌ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.50 కోట్లకుపైనే.

6 బిలియన్ల వ్యూస్‌తో రెవెన్యూ ఎంతంటే..
తాజాగా ‘గంగ్నమ్‌ స్టైల్‌’ 6 బిలియన్‌ వ్యూస్‌ దాటింది. 2023 డిసెంబర్‌లో 5 బిలియన్‌ మార్క్‌ చేరుకున్న ఈ వీడియో.. మరో బిలియన్‌ వ్యూస్‌ సాధించడానికి రెండేళ్ల ఏడు నెలల సమయం తీసుకుంది. అంటే.. విడుదలై దాదాపు 14 ఏళ్లు గడిచినా ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదన్నమాట.

యాడ్‌ ఆదాయ రేటును కేవలం సూచికగా తీసుకుని 6 బిలియన్‌ వ్యూస్‌కు వర్తింపజేస్తే.. యూట్యూబ్‌ ప్రకటనల ద్వారా వచ్చే మొత్తం దాదాపు రూ.250–300 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే యూట్యూబ్‌ ప్రకటన రేట్లు, ప్రేక్షకులు ఉన్న దేశాలు, మానిటైజేషన్‌, యాడ్‌ వీక్షణలు తదితర అంశాల ఆధారంగా ఈ ఆదాయం మారుతుంది. ఇతర ఆదాయ మార్గాలను కూడా కలిపి చూస్తే.. ఎంత లేదన్నా ‘గంగ్నమ్‌ స్టైల్‌’ ద్వారా మొత్తం సంపాదన సుమారు రూ.800 కోట్లకుపైగా ఉండొచ్చన్నది అంచనా.

ఆ మొత్తం మొత్తం పీఎస్‌వైకే దక్కుతుందా?
‘గంగ్నమ్‌ స్టైల్‌’కు యూట్యూబ్‌ మాత్రమే ఆదాయ వనరు కాదు. డిజిటల్‌ డౌన్‌లోడ్లు, మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌, లైసెన్సింగ్‌, ప్రకటనలు, ఇతర వాణిజ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. 2013లోనే ఈ పాట డిజిటల్‌ డౌన్‌లోడ్లు, ప్రకటనలు, ఆన్‌-డిమాండ్‌ సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.

అయితే యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పీఎస్‌వైకి దక్కదు. ప్లాట్‌ఫామ్‌ వాటాతో పాటు మ్యూజిక్‌, వీడియో హక్కుదారులు, రికార్డ్‌ లేబుల్‌, ఇతర భాగస్వాములకు కూడా ఆదాయం పంచబడుతుంది. అయినప్పటికీ.. అన్ని ఆదాయ మార్గాలను కలిపి చూస్తే పీఎస్‌వైకి ఈ పాట ద్వారా భారీ మొత్తమే దక్కినట్లు చెప్పొచ్చు. 

ఆ పాట ఎలా పుట్టిందంటే..
‘గంగ్నమ్‌ స్టైల్‌’ పుట్టుక వెనుక దక్షిణ కొరియాలోని గంగ్నమ్‌ ప్రాంత జీవనశైలే ప్రధాన ప్రేరణ. గంగ్నమ్‌లో పుట్టి పెరిగిన పీఎస్‌వై.. అక్కడి ఉన్నతవర్గాల జీవనశైలి, వారి ఫ్యాషన్‌, హంగూ ఆర్భాటాలను తనదైన శైలిలో పాటగా మలిచారు. యూ జంగ్‌ హ్యుంగ్‌తో కలిసి సాహిత్యం రాయడంతో పాటు మ్యూజిక్‌ను రూపొందించిన పీఎస్‌వై.. సరదా పదాలు, వ్యంగ్యభరితమైన భావన, ఆకట్టుకునే బీట్‌ను జోడించారు. ఇక గుర్రపు స్వారీని తలపించే డ్యాన్స్‌ స్టెప్‌ పాటకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఇలా పెద్దగా అంచనాలు లేకుండా రూపొందిన ఈ పాట.. ప్రపంచ సంగీత చరిత్రనే మార్చేసే సంచలనంగా మారింది.

ప్రపంచాన్ని ఊపేసిన గుర్రపు స్టెప్పు
2012లో విడుదలైన ‘గంగ్నమ్‌ స్టైల్‌’ కొరియన్‌ భాషలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఎస్‌వై వేసిన ప్రత్యేకమైన గుర్రపు స్వారీ తరహా డ్యాన్స్‌ పాటకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అమెరికా బిల్‌బోర్డ్‌ హాట్‌ 100లో ఈ పాట ఏడు వారాల పాటు రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా యూట్యూబ్‌ చరిత్రలో 1 బిలియన్‌ వ్యూస్‌ అందుకున్న తొలి వీడియోగా ‘గంగ్నమ్‌ స్టైల్‌’ నిలిచింది. ఈ పాట తర్వాత.. పీఎస్‌వై నుంచి ఆ స్థాయి ఆల్బమ్‌ రాలేదు. కానీ, అప్పటి నుంచి ఆయన టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్‌ మీడియా క్రేజ్‌ లేని రోజుల్లోనే.. యూట్యూబ్‌తో గంగ్నమ్‌ స్టైల్‌ సంచనాలు సృష్టించడం, ఇప్పుడు 6 బిలియన్‌ వ్యూస్‌తో మరో మైలురాయిని అందుకోవడం.. క్రేజ్‌ను ఏదీ అడ్డుకోలేదని నిరూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement