హౌతీలకు చావుదెబ్బ.. ఇటు జీ7 సంచలన నిర్ణయం! | Iran War Escalates: Houthis Hit Hard Trump Pressures G7 on Fuel | Sakshi
Sakshi News home page

హౌతీలకు చావుదెబ్బ.. ఇటు జీ7 సంచలన నిర్ణయం!

Oct 3 2026 6:53 AM | Updated on Oct 3 2026 6:53 AM

Iran War Escalates: Houthis Hit Hard Trump Pressures G7 on Fuel

పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులు, యెమెన్‌లో హౌతీలపై దాడులు, గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కూడా పెద్ద సవాలుగా మారింది. యుద్ధం దెబ్బకు ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరడంతో.. అమెరికాలోనే కాదు, యూరప్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో ధరలకు కళ్లెం వేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యూరప్‌ దేశాలు తమ వద్ద ఉన్న డీజిల్‌ నిల్వలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా నుంచి డీజిల్‌ ఎగుమతులపై నిషేధం విధించే అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అలాంటి నిర్ణయం ప్రపంచ మార్కెట్లో డీజిల్‌ కొరతను మరింత పెంచే ప్రమాదం ఉండటంతో యూరప్‌లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ట్రంప్‌తో మాట్లాడారు. అనంతరం G7 దేశాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ట్రంప్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొని యూరప్‌ డీజిల్‌ నిల్వలను విడుదల చేయడానికి చర్చలు జరిపినట్లు అమెరికా అధికారులు తెలిపారు.

చివరకు G7 ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో మొత్తం 100 మిలియన్‌ బ్యారెళ్ల చమురు, డీజిల్‌ తదితర ఇంధన నిల్వలను సమన్వయంతో విడుదల చేయనుంది. ఇందులో తొలి 20 రోజుల్లోనే గణనీయమైన మొత్తంలో డీజిల్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ప్రక్రియను అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ద్వారా సమన్వయం చేయనున్నారు.

ట్రంప్‌కు కొత్త టెన్షన్‌
ఇక్కడ మరో కీలక అంశం ఉంది. అమెరికాలో డీజిల్‌ ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరాయి. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరగడంతో ధరలు ఎగిశాయి. నవంబర్‌ 3న అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరిగిన జీవన వ్యయం, ఇంధన ధరలు ట్రంప్‌ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా కీలక అంశంగా మారాయి.

అందుకే డీజిల్‌ ధరలను అదుపులోకి తీసుకురావడానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్‌ స్వయంగా కూడా యూరప్‌ భారీగా డీజిల్‌ నిల్వలను విడుదల చేయడానికి అంగీకరించిందని ప్రకటించారు. అనంతరం అమెరికా డీజిల్‌ ఎగుమతులపై నిషేధం విధించబోమని స్పష్టం చేశారు. G7 దేశాలు కూడా పరస్పరం ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశాయి. అంటే ఒకవైపు నిల్వలను విడుదల చేస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ సరఫరా గొలుసుకు మరింత దెబ్బ తగలకుండా చర్యలు తీసుకుంటున్నాయి.

అసలు టెన్షన్‌ ఇక్కడే.. 
అయితే చమురు నిల్వలను విడుదల చేయడం తక్షణ ఉపశమనానికి మాత్రమే. పశ్చిమాసియాలో అసలు సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. హర్ముజ్‌ జలసంధి, బాబ్ అల్-మండెబ్ సముద్ర మార్గాలపై నెలకొన్న ఉద్రిక్తత ప్రపంచ ఇంధన సరఫరాకు పెద్ద ముప్పుగా మారింది.

హర్ముజ్‌ ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. అక్కడ నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్‌పై నేరుగా ప్రభావం పడుతుంది. G7 కూడా తాజాగా హర్ముజ్‌లో అంతర్జాతీయ నౌకాయాన హక్కులు, స్వేచ్ఛాయుత రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది.

మరోవైపు యెమెన్‌లోని హౌతీల చర్యల కారణంగా బాబ్ అల్-మండెబ్–ఎర్ర సముద్ర మార్గం కూడా ప్రమాదంలో ఉంది. తాజాగా ఒమన్‌ సమీపంలో ఓ క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను క్షిపణి తాకినట్లు యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ తెలిపింది. సిబ్బంది సురక్షితంగా ఉన్నప్పటికీ.. వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

హౌతీలపై భారీ దాడులు
ఇదే సమయంలో యెమెన్‌లో పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. గత 24 గంటల్లో 474 ఆపరేషన్లు నిర్వహించి 1,540 మంది హౌతీ ఫైటర్లను హతమార్చినట్లు యెమెన్‌ సైన్యం ప్రకటించింది. తైజ్‌ ప్రాంతంలో అత్యధిక నష్టం జరిగినట్లు తెలిపింది. పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు దక్షిణ సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని వచ్చిన మూడు బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తెలిపింది. దీంతో యెమెన్‌–సౌదీ సరిహద్దుల్లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది.

గాజాలోనూ దాడులు.. వెస్ట్‌బ్యాంక్‌లో హింస
పశ్చిమాసియా సంక్షోభం ఇరాన్‌, యెమెన్‌తోనే ఆగలేదు. గాజా సిటీలోని ఓ నివాస సముదాయంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో చిన్నారి సహా నలుగురు మరణించినట్లు పాలస్తీనా వైద్య వర్గాలు తెలిపాయి. పలువురు గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ పాలస్తీనియన్లపై సెటిలర్‌ దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు హమాస్‌ ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీసేందుకు అమెరికా, ఫ్రాన్స్‌తో కలిసి చర్యలు కొనసాగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

ఒక్క యుద్ధం.. ఎన్నో ప్రభావాలు
ఇలా పశ్చిమాసియాలోని ఒక్కో ఫ్రంట్‌ మరోదానితో ముడిపడి ఉంది. ఇరాన్‌ యుద్ధం చమురు సరఫరాపై ప్రభావం చూపుతోంది.. హౌతీల దాడులు సముద్ర రవాణాపై ఒత్తిడి పెంచుతున్నాయి. హర్ముజ్‌ ఉద్రిక్తత ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది.. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో హింస ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

దీని ప్రభావమే ఇప్పుడు G7 అత్యవసర నిల్వలను రంగంలోకి దించడం. అయితే 100 మిలియన్‌ బ్యారెళ్ల విడుదలతో ధరలపై కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నా.. పశ్చిమాసియాలో యుద్ధం, సముద్ర మార్గాల భద్రతపై అనిశ్చితి కొనసాగినంతకాలం ఇంధన మార్కెట్‌ టెన్షన్‌ మాత్రం పూర్తిగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

ఇదీ చదవండి: కీవ్‌లో ఏం జరుగుతోంది? మూడు వంతెనలు నాశనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement