ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ట్రంప్‌కు, శ్వేతసౌధంలో జిన్‌పింగ్‌కు ఆతిథ్యం ఇచ్చిన ట్రంప్‌కు మధ్య వ్యత్యాసాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తున్నది. ఇరాన్‌ను నాశనం చేస్తానని హూంకరించిన ట్రంప్ ఎక్కడ? విమానాశ్రయంలో సతీ సమేతంగా జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన ట్రంప్ ఎక్కడ? ట్రంప్ విలక్షణ మనస్తత్వాన్ని, దౌత్యనీతిని రాజకీయ పరిశీలకులు జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు.
ట్రంప్, జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశంలో కీలకమైన ఒప్పందాలు కానీ, నిర్ణయాలు కానీ లేవు. సమావేశంలో జిన్‌పింగ్‌దే పైచేయిగా కన్పడుతున్నది. అమెరికా చైనాను తనతో సమవుజ్జీగా, సమ అగ్రరాజ్యంగా పరిగణిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇది జిన్‌పింగ్‌కు చెప్పుకోదగిన రాజకీయ విజయం. జిన్‌పింగ్ ఈరోజు కోసం ఎన్నో ఏళ్ళుగా వేచి చూస్తు న్నాడు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాధినేతలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వంటి నేతలతో ట్రంప్ వ్యవహార శైలికి; పుతిన్, జిన్‌పింగ్‌లతో వ్యవహార శైలి హస్తి మశకాంతరము.
దూకుడు–పరిణతి
ట్రంప్ మనస్తత్వం విలక్షణమైనది. దూకుడు శైలితో బెదిరింపు ప్రధానంగా అన్ని దేశాలతో వ్యవహరిస్తున్నాడు. అధ్యక్షుని హోదాలో అమెరికా దేశపు పూర్తి బలాన్ని చూపడానికి ఉత్సాహం చూపిస్తాడు. వ్యక్తిగత పొగడ్తలకు ప్రాధాన్యతనిస్తాడు. వ్యాపార, ఆర్థిక లాభా లకు, లావాదేవీలకు పెద్దపీట వేస్తాడు. కొంత చిన్నపిల్లల మనస్తత్వం కూడా ప్రస్ఫుటంగా కన్పడుతుంది. తను చెప్పిన మాట అందరూ వినాలి. తన మాటే వేదమనే మంకుపట్టు. అందరికంటే ముందు తనే అన్ని విషయాలను ప్రపంచానికి తెలియపర్చాలని ఉవ్విళ్లూరుతుంటాడు. ఈ బలహీనతలను వినియోగించుకొని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ ట్రంప్‌కు దగ్గరయ్యాడు.
తనకు నచ్చకపోతే కనీస దౌత్య మర్యాదలను కూడా ట్రంప్ పాటించడు. ఉదాహరణకు ఇటలీ ప్రధాని మెలోని తనతో ఫొటో కోసం వెంపర్లాడిందని పదిమందిలో పదే పదే చెప్పాడు. వైట్ హౌస్‌లో సమావేశమైనప్పుడు మీడియా సాక్షిగా జెలెన్‌స్కీని తూల నాడాడు. ఈ అహంకార, దుడుకు వైఖరి ఆధారంగానే ట్రంప్‌నుఅంచనా వేయకూడదు. ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాననే స్పృహ చూపించడు. కానీ రష్యా, చైనా, భారత్ లతో చాలావరకు సంయమనాన్ని పాటిస్తున్నాడు.
బలవంతులలో వ్యవహరించేటప్పుడు, తన మాదిరి అహంకార స్వభావ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ట్రంప్ పరిణితిని ప్రదర్శిస్తున్నాడు. ఉదాహర ణకు జిన్‌పింగ్, పుతిన్‌లను తన స్నేహితులుగా అభివర్ణిస్తాడు. విచిత్రంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను కూడా తన మిత్రుడిగా పరిగణిస్తాడు. ఇటీవల, ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకొని ప్రతి సంవత్సరం అమెరికా–దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహించే సైనిక విన్యాసాలను పూర్తిగా కుదించి దాదాపుగా అపేశాడు. అణ్వస్త్ర సామర్థ్యం కల్గిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ట్రంప్‌లాగా దూకుడు నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడు.
బెదిరింపు–ప్రశంసట్రంప్ రెండవసారి గెలుపుతో వైట్‌హౌస్‌లోకి భారతదేశపు మిత్రుడు వచ్చాడనుకున్న ఆనందం భారత్‌కు ఎక్కువకాలం నిలవ లేదు. ట్యారిఫ్ వార్‌తో మొదలుపెట్టి, రష్యా నుండి చమురు కొను గోలు విషయంలో బెదిరింపులు, హెచ్1బీ వీసాలపై కఠిన ఆంక్షలు, ప్రస్తుతం మళ్లీ వంద శాతం సుంకాల వరకు భారత్ ఎడల ట్రంప్ వైఖరి ఒక మిత్రదేశపు వైఖరి ఎంతమాత్రమూ కాదు. రాజకీయంగా కూడా వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఇరుకున పెట్టే దిశలో పదేపదే తానే ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని (ఆపరేషన్‌సిందూర్‌ను) ఆపానని ప్రకటించాడు.
జాగ్రత్తగా పరిశీలిస్తే– ఒకవైపు బెదిరించి, భారత్ సహనాన్ని పరీక్షిస్తూనే, మరొకవైపు తాను అమెరికన్ ప్రయోజనాలను పరిరక్షి స్తున్నట్లు మోదీ నిబద్ధతతో భారత్ ప్రయోజనాలను పరిరక్షిస్తు న్నాడంటాడు. మోదీ తనకు మంచి మిత్రుడనీ, కఠినంగా బేర సారాలు ఆడే వ్యక్తి (టఫ్ నెగోషియేటర్) అనీ ప్రశంసిస్తాడు. ఓవైపు బెదిరిస్తూనే మరోవైపు ప్రశంసించటం ప్రత్యేక శైలి దౌత్యనీతి.
వ్యక్తిగతంగా ట్రంప్ వ్యవహార శైలి విషయంలో సమస్యలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యంత శక్తిమంత మైన దేశానికి ట్రంప్ అధ్యక్షుడనే విషయాన్ని అందరూ గుర్తించాలి. మనకిష్టమున్నా లేకున్నా ట్రంప్‌తో వ్యవహారం, దౌత్యం నెరపాల్సిందే. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా వాణిజ్యం మనకు లాభదాయకం. అమెరికాలో మనకు వాణిజ్య మిగులు ఉన్నది. 1.6 మిలియన్ల భారతీయులు యూఎస్‌ఏలో పని చేస్తున్నారు. సుమారు 3.7 లక్షల మంది అమెరికాలో చదువుకుంటు న్నారు. సమారు 1.5 మిలియన్ల భారత సంతతి ప్రజలు అమెరికన్ పౌరసత్వాన్ని పొంది అక్కడ నివసిస్తున్నారు. పొరుగున పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు సమస్యలు, సీమాంతర ఉగ్రవాదం నేపథ్యంలో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాతో సత్సంబంధాలు కలిగిఉండటం అభిలషణీయం.
మౌనం–ప్రయోజనం
అమెరికాపై ఆధారపడుతూ ట్రంప్‌ను నేరుగా ఎదుర్కోవటం కొరివితో తల గోక్కోవటమే. ఈ విషయంలో మార్క్ కార్నీ (కెనడా), నరేంద్ర మోదీ (భారత్) మంచి ఉదాహరణలుగా ఉన్నారు. భారత్, కెనడా రెండు దేశాలకు అమెరికాతో సత్సంబంధాలు కీలకం. కానీ రెండు దేశాలు ట్రంప్‌కు సాగిలపడి మోక రిల్లటానికి సిద్ధంగా లేవు. ఇతర దేశాధినేతలతో పోల్చితే కార్నీ, మోదీల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క. ఇరుదేశాధినేతలు చాలా సమయస్ఫూర్తితో, పరిణతితో ట్రంప్‌తో నెగ్గుకొస్తున్నారని చెప్పు కోవాలి.
ట్రంప్ దుర్భాషలకు వీరు నేరుగా ఎప్పుడూ సమాధానం చెప్పరు. కానీ తమదైన శైలిలో తమ దేశాల ప్రయోజనాలను కాపాడే చర్యలు నిష్కర్షగా తీసుకొంటున్నారు. ట్రంప్, కెనడాను 51వ రాష్ట్రంగా అభివర్ణించాడు. ‘లేక్ ఒంటా రియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ విషయంలో కార్నీ నేరుగా ట్రంప్‌ను నిందించలేదు. ఎప్పటికీ ‘లేక్ ఒంటారియో’గానే ఉంటుందని ప్రకటించి ఆగి పోయాడు. కానీ ట్రంప్ వేసిన ట్యారిఫ్‌లకు ప్రతిగా కెనడా తన ప్రయోజనాలను రక్షించుకోవటానికి అన్ని చర్యలు తీసుకున్నది.
ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను ‘మృత ఆర్థిక వ్యవస్థ’గా అభి వర్ణించినా, ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశానని పదే పదే ప్రకటించినా, ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పోషిస్తున్నదని నిందించినా, మోదీ ఏనాడూ వాదనలోనికి దిగలేదు. కానీ భారత్ ప్రయోజనాల రక్షణకు, ఆ దేశంతో వాణిజ్య ఒప్పందపు చర్చలలో కఠినంగా వ్యవహరిస్తున్నాము. అయితే, మొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ‘నా ప్రధాన ఆందోళనల్లో ఒకదాన్ని నా భాగస్వామి పూర్తిగా అర్థం చేసుకోకపోతే, దాని ప్రభావం సంబం«ధాలపై స్పష్టంగా ఉంటుంది’ అని గట్టిగానే మాట్లాడారు. కానీ దాన్ని ఇంకా మన విధానంగా భావించలేము. స్థూలంగా పరిశీలిస్తే భారత్, కెనడా, రష్యా, చైనాలు ట్రంప్ వ్యక్తిగత ప్రకటనలు, దూషణలకు, తిరస్కారాలకు ప్రతిస్పందించకుండా, చేతల విషయంలో తమ తమ దేశాల ప్రయోజనాలను కాపాడుకొంటూ ట్రంప్‌కు నిజమైన దౌత్య నీతిని బోధిస్తున్నాయి.
-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు
-గురజాల శ్రీనివాసరావు


