చరిత్రలో.. 'ఓ రవాణా అద్భుతం!' | Berlin Airlift History, The Soviet Blockade, Candy Bomber And The 15 Month Air Supply Mission, Check More Details Inside | Sakshi
Sakshi News home page

చరిత్రలో.. 'ఓ రవాణా అద్భుతం!'

Sep 30 2026 2:36 PM | Updated on Sep 30 2026 3:12 PM

Berlin Airlift Cold War Candy Bomber History

1948 సెప్టెంబర్‌ 30న ముగిసిన ‘ఆపరేషన్‌ విటిల్స్‌’

టైమ్‌ మిషన్‌

  • హ్యారీ ఎస్‌. ట్రూమన్‌

రెండో ప్రపంచ యుద్ధం (1945) తరువాత అమెరికా, సోవి యట్‌ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమయ్యింది. అందుకు జర్మనీ రాజధాని బెర్లిన్‌ కూడా వేదికైంది. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్‌ యూనియన్‌ లు జర్మనీని నాలుగు ఆక్రమిత ప్రాంతాలుగా విభజించాయి.

అయితే బెర్లిన్‌  అధిక భాగం సోవి యట్‌ ఆధీనంలోని తూర్పు జర్మనీ భూభాగంలో ఉంది. దీంతో నగరంలో పాశ్చాత్య దేశాల ఉనికి సోవియట్‌ యూనియన్‌కు రాజకీయ సమస్యగా మారింది. యుద్ధం కారణంగా బెర్లిన్‌ దెబ్బ తింది. ఇళ్లు, రహదారులు, పరిశ్రమలు ధ్వంసమయ్యాయి. పాశ్చాత్య దేశాలు తమ ఆధీనంలోని ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టాయి.

1948 జూన్‌లో పాశ్చాత్య దేశాలు తమ ప్రాంతాల్లో కొత్త డాయిచ్‌మార్క్‌ కరెన్సీని ప్రవేశపెట్టాయి. దీనిని సోవియట్‌ యూనియన్‌ వ్యతిరేకించింది. జూన్‌  24న తూర్పు జర్మనీ మీదుగా పశ్చిమ బెర్లిన్‌ కు వెళ్లే రైలు, రోడ్డు, జల మార్గాలను సోవియట్‌ అధికారులు మూసివేశారు. దీంతో పశ్చిమ బెర్లిన్‌ లో నివసిస్తున్న 20 లక్షలకు పైగా ప్రజలకు ఆహారం, ఇంధనం, మందులు చేరడం కష్టమైపోయింది.

మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌  సైనిక ఘర్షణకు వెళ్లకుండా బెర్లిన్‌ లో పాశ్చాత్య దేశాల ఉనికిని కొనసాగించాలని భావించాడు. దీంతో అక్కడికి ఆకాశ మార్గం (ఎయిర్‌ లిఫ్ట్‌) ద్వారా సరుకులు పంపా లని నిర్ణయించాడు. 1948 జూన్‌  26న ‘ఆపరేషన్‌  విటిల్స్‌’ పేరుతో ఎయిర్‌లిఫ్ట్‌ను ప్రారంభించారు. బ్రిటన్‌  కూడా రెండు రోజుల తర్వాత తన విమానాలను రంగంలోకి దించింది. మొదట అవస రమైన సరుకులను విమానాల ద్వారా అందించడం అసాధ్యంగా కనిపించింది. కానీ కొద్ది కాలంలోనే విమానాల రాకపోకలను వేగంగా నిర్వహించే వ్యవస్థ ఏర్పడింది.

ఆకాశమే రవాణా మార్గం ఆహారం, బొగ్గు, మందులు, నిర్మాణ సామగ్రి వంటి అవస రమైన వస్తువులను నగరానికి తరలించాయి. బొగ్గు ముఖ్యంగా అవసరమైంది. ఎందుకంటే ఇళ్లలో వేడి కోసం మాత్రమే కాకుండా విద్యుత్‌ ఉత్పత్తికి కూడా అది అవసరం. విమానాశ్రయాల్లో సిబ్బంది, మెకానిక్‌లు, పైలట్లు నిరంతరం పనిచేశారు. ఈ ఎయిర్‌ లిఫ్ట్‌లో గెయిల్‌ హాల్వోర్సన్‌  అనే అమెరికన్‌  పైలట్‌ ప్రత్యేకంగా గుర్తింపు పొందాడు. బెర్లిన్‌  చిన్నారుల పరిస్థి తిని చూసిన ఆయన వారికి స్వీట్లు ఇవ్వాలని నిర్ణయించాడు. చిన్న పారాచూట్లకు స్వీట్లు వేలాడదీసి విమానం నుంచి కిందకు వదిలేవాడు. దీంతో ఆయనకు ‘క్యాండీ బాంబర్‌’ అనే పేరు వచ్చింది.

బెర్లిన్‌  సంక్షోభం కేవలం ఆహారం, ఇంధనం సమస్యగా మాత్రమే లేదు. సోవియట్‌ మద్దతుదారులు, పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉన్న వర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. దీన్ని గమనించిన స్టాలిన్‌ నాయకత్వంలోని రష్యా 1949 మే 12న బెర్లిన్‌ దిగ్బంధ నాన్ని ఎత్తివేసింది. అయినా పశ్చిమ బెర్లిన్‌ లో సరిపడా సరుకులు నిల్వ ఉండేలా అమెరికా తదితర దేశాలు ఎయిర్‌లిఫ్ట్‌ను సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగించాయి.

సుమారు 15 నెలల పాటు సాగిన ఎయిర్‌ లిఫ్ట్‌ కార్యక్రమం ద్వారా ఆహారం, బొగ్గు, మందులు సహా సుమారు 20 లక్షల టన్నులకు పైగా సరుకులు బెర్లిన్‌ కు చేరాయి. ఈ ఆపరేషన్‌లో జరిగిన ప్రమాదాల్లో అమెరికా, బ్రిటన్, జర్మనీకి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. బెర్లిన్‌ ఎయిర్‌ లిఫ్ట్‌ ప్రచ్ఛన్న యుద్ధ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ఇది ఒకవైపు సంక్షోభంలో చిక్కుకున్న లక్షలాది ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించింది. మరోవైపు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ ల మధ్య పెరుగుతున్న రాజకీయ పోటీని సుస్పష్టం చేసింది. 1949లో పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ ప్రత్యేక దేశా లుగా ఏర్పడటంతో జర్మనీ విభజన మరింత స్థిరపడింది.
- ఎడిటోరియల్‌ టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement