పురాతన పురపాలక సంఘం | Ongole Municipality 150 Years History 1876-2026 | Sakshi
Sakshi News home page

పురాతన పురపాలక సంఘం

Sep 29 2026 8:24 AM | Updated on Sep 29 2026 8:31 AM

Ongole Municipality 150 Years History 1876-2026

ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనది ఒంగోలు పురపాలక సంఘం. ఇది 1876లో ఏర్పడింది. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం 1876 సెప్టెంబర్‌ 30న ‘మద్రాస్‌ టౌన్స్‌ ఇంప్రూవ్‌ మెంట్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1871’ ప్రకారం అఫిషియల్‌ గజెట్‌ నోటిఫికేషన్‌ ద్వారా థర్డ్‌ గ్రేడ్‌ పురపాలక సంఘంగా ఏర్పాటు చేసింది. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పడగా జిల్లా కేంద్రమయ్యింది. 1972లో జిల్లా పేరును ‘ప్రకాశం’గా మార్చడంతో ప్రకాశం జిల్లా కేంద్రం అయ్యింది.

2001లో అన్నవరప్పాడు, మామిడిపాలెం గ్రామాలను కలుపుకొని స్పెషల్‌గ్రేడ్‌ పురపాలక సంఘం అయ్యింది. అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2012 జనవరి 25న కార్పొరేషన్‌గా అవతరించింది. అప్పుడు సమీప గ్రామాలైన కొప్పోలు, త్రోవగుంట, వెంగముక్కపాలెం, దసరాజుపల్లి, ముక్తినూతలపాడు, పెళ్ళూరు, పేర్నమిట్ట, చెర్వు కొమ్ముపాలెం, అగ్రహారం, గుడిమెల్లపాడు  కార్పొ రేషన్‌లో విలీనమయ్యాయి.

1867 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలు జనాభా 5,832 కాగా, అది 1881కి 10,300కి పెరిగింది. నేటికి అది 2,52,739కి చేరుకుంది. 132.45 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి 1,53,628 మంది అక్షరాస్యులు (83.4 శాతం) ఉన్నారు. ఒంగోలు గిత్తలకు ప్రసిద్ధి. పురపాలక సంఘంగా ఏర్పడిన నాటినుండి ఆనందరావు పంతులు, బి.ఆర్‌. నారా యణ పంతులు, రావుసాహెబ్‌ పి.వి. కృష్ణారావు, వరదా శ్రీరాములు నాయుడువంటి సమర్థులు, ప్రజారంజకులైన పాలకులు చక్కని పాలన అందించారు. ఒంగోలు మున్సిపాలిటీకి వరదా శ్రీరాములు నాయుడు ప్రజలచే ఎన్నికైన ప్రథమ చైర్మన్‌. ఆయన 1934 వరకు కొనసాగారు.

1934 అక్టోబరులో ధారా గోపాలశాస్త్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన శాస్త్రిగారు అనేక పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. 1934 నుండి 1952 వరకు అంటే 18 ఏళ్లు ఒంగోలు మున్సిపల్‌ చైర్మన్‌ గా పనిచేసి చరిత్ర సృష్టించారు. చైర్మన్‌ గా ధారా ఉన్న కాలంలోనే భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందింది. వీరి పాలనా కాలంలోనే స్థాపించిన ‘శర్మ కళాశాల’కు పురపాలక సంఘం తరపున 50 వేల రూపాయల విరాళాన్ని ఇవ్వడం ద్వారా ఒంగోలులో విద్యా వికాసానికి శ్రీకారం చుట్టారు. అప్పుడే నాటు బాబురావు పార్క్‌ ఏర్పాటయ్యింది. ఒంగోలు పట్టణం విద్యుదీకరించబడింది. మద్రాస్‌ గవర్నర్‌ ఆర్డర్‌ హువ్‌ ఒంగోలు రాగా వారికి పౌర సన్మానాన్ని నిరాకరించి పురపాలక సంఘం దేశభక్తిని ప్రదర్శించింది.

2026 సెప్టెంబర్‌ నాటికి 150 సంవత్సరాలు పూర్తిచేసుకొంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పురపాలక సంఘంగా ఏర్పడి కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగిన ఒంగోలు దినదినాభివృద్ధి చెందాలని ఆశిద్దాం.
– డా. డి. వెంకటేశ్వర రెడ్డి, ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హిస్టరీ, ఆంధ్ర కేసరీ యూనివర్సిటీ, ఒంగోలు (సెప్టెంబర్‌ 30 నాటికి ఒంగోలు పురపాలక సంఘానికి 150 ఏళ్లు)

ఇదీ చదవండి: నవ్విపోదురు గాక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement