వాషింగ్టన్: పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తన ‘టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్’ జాబితాలో చేర్చింది. అతడి అరెస్టుకు అవసరమయ్యే సమాచారం అందించిన వారికి ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.9.60 కోట్లు) బహుమతి ప్రకటించింది. ఎఫ్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. అమెరికాలో తలదాచుకున్న గోల్డీ బ్రార్‌కు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఆదేశాలు ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుతో పాటు అమెరికాలో బ్రార్‌పై పలు ఫెడరల్ అభియోగాలు నమోదయ్యాయి.
‘అత్యంత ప్రమాదకర వ్యక్తి’
‘సింగ్ ప్రమాదకరమైన వ్యక్తి. అతడిని పట్టుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అందుకే ఎఫ్‌బీఐ అత్యంత వాంటెడ్ జాబితాలో అతడిని చేర్చాం’ అని ఎఫ్‌బీఐ లాస్‌ఏంజెలెస్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్యాట్రిక్ గ్రాండీ తెలిపారు. బ్రార్ కాలిఫోర్నియా, కెనడాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. చరిత్రాత్మక ‘టెన్ మోస్ట్ వాంటెడ్’ జాబితాలో చేరిన 543వ పరారీ అయిన వ్యక్తిగా బ్రార్ నిలిచాడు. అతడిపై అమెరికాలో ర్యాకెటియర్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ (రికో) కుట్ర, బెదిరింపుల ద్వారా డబ్బు వసూలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర అభియోగాలు ఉన్నాయి.
బిష్ణోయ్ గ్యాంగ్‌కు కార్యకలాపాలు
లారెన్స్ బిష్ణోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్‌కు ఉత్తర అమెరికాలో బ్రార్ ప్రధాన కార్యకలాపాల నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. భారత్‌లోని జైలు నుంచి బిష్ణోయ్ అక్రమ సమాచార మార్గాల ద్వారా తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చేవాడని, బ్రార్ వంటి విశ్వసనీయ వ్యక్తులకు అంతర్జాతీయ కార్యకలాపాలను అప్పగించేవాడని పేర్కొన్నారు.
ఈ ముఠాకు ఉత్తర అమెరికాలో హత్యలు, కిడ్నాప్‌లు, ఆయుధాలతో బెదిరించి డబ్బు వసూలు చేయడం, భారీ స్థాయిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. లాస్‌ఏంజిల్స్ ప్రాంతంలో ప్రత్యర్థి ముఠాల నుంచి 500 కిలోలకు పైగా కొకైన్‌ను దొంగిలించిన ఘటనతోనూ ఈ నేరసంస్థకు సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. 2023 జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలో ఓ సిక్కు ఆలయం వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన ఘటనలో బిష్ణోయ్, బ్రార్‌ల ప్రమేయం ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.
‘ఆపరేషన్ హార్డ్‌బాల్’
బ్రార్‌ను ఎఫ్‌బీఐ టాప్-10 జాబితాలో చేర్చడానికి ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’లో భాగంగా సాగిన దర్యాప్తు కీలకంగా మారింది. ఎఫ్‌బీఐ, కెనడా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ), లాస్‌ఏంజెలెస్ పోలీస్ విభాగం కలిసి కొన్నేళ్లుగా ఈ దర్యాప్తు చేపట్టాయి. భారత్‌కు చెందిన అంతర్జాతీయ నేర ముఠాలతో సంబంధం ఉన్న 37 మందిపై 2026 జులైలో అభియోగాలు వెల్లడయ్యాయి. వారిలో 28 మందిని గుర్తించి అదుపులోకి తీసుకోగా.. బ్రార్‌తో పాటు మరో ఐదుగురు కీలక నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.
ఇదీ చదవండి: మైసూర్ దసరాకు ఏనుగులే రాజసం..


