ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహీ మసీదులోని కొంత భాగాన్ని తొలగించే విషయంలో జరిగిన ఘర్షణలకు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన తప్పుడు సమాచారం కూడా కారణమని పోలీసులు తెలిపారు. 2028 సింహస్థ కుంభమేళా నేపథ్యంలో రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న మసీదు భాగాన్ని తొలగించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 9న అనుమతి ఇచ్చింది. అయితే మసీదు మొత్తాన్ని జేసీబీతో కూల్చివేస్తున్నట్లు చూపించే ఏఐ రూపొందించిన కల్పిత వీడియోలు ప్రచారంలోకి రావడంతో కొంతమంది యువకులు తప్పుదోవ పట్టారని పోలీసులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం మసీదు వద్ద గుమిగూడిన కొంతమంది భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జి చేశారు.
మసీదు మొత్తం కూల్చివేస్తారనే పుకార్లు సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించాయని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. మసీదును పూర్తిగా కూల్చివేస్తున్నట్లు చూపించిన వీడియోల్లో ఒకటి పూర్తిగా తప్పుడు సమాచారంతో రూపొందించారని చెప్పారు. వీడియోలను మొదట పోస్ట్ చేసిన ఖాతాలతో పాటు వాటిని పదేపదే ఇతరులకు పంపినవారినీ పోలీసులు గుర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమ పేజీలు, క్రియేటర్స్‌పై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు, ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 100కు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను గుర్తించినట్లు వెల్లడించారు.
మరోవైపు మసీదు కమిటీ సభ్యులే.. తొలగించాల్సిన నిర్మాణాలను తొలగించారు. అధికారులు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన సమయంలో జరిగిన పరిణామాల అనంతరం ముస్లిం వర్గం అధికారులకు సహకరించేందుకు అంగీకరించిందని మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. మసీదు నిర్వహణ, వక్ఫ్ ఆస్తిపై అధికారం విషయంలో రెండు వర్గాల మధ్య కూడా వివాదం ఉంది. మసీదు కమిటీలోని ఒక వర్గం నుంచి ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసినట్లు ఎస్పీ తెలిపారు. ఒకే మున్సిపల్ నోటీసులకు సంబంధించి రెండు వర్గాలు కోర్టును ఆశ్రయించగా, మసీదు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే విషయంలో విభేదాలు ఉన్నాయని సమాచారం.
ఇదీ చదవండి: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో గోల్డీ బ్రార్


