దేశ రాజధానిలో కాలుష్య కట్టడికి బీజేపీ ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. శీతాకాలం మొదలయ్యేలోపే కాలుష్య నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తూ.. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే పాత వాహనాలపై కొరడా ఝుళిపించనుంది. నవంబర్ 1 నుంచి BS-VI ఉద్గార ప్రమాణాలు అందుకోని ఇతర రాష్ట్రాల వాహనాలను ఢిల్లీలోకి అనుమతించబోమని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. దీంతోపాటు పార్కింగ్ ఛార్జీల పెంపు, నిర్మాణ పనులపై ఆంక్షలు, కాలుష్యం వెదజల్లే వాహనాలపై తనిఖీలు, ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’ వంటి చర్యలను అమలు చేయనున్నారు.
ఇతర రాష్ట్రాల వాహనాలకు బ్రేక్..
ఢిల్లీలో కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. BS-VI ప్రమాణాలు లేని ఇతర రాష్ట్రాల వాహనాలను రాజధానిలోకి అనుమతించరు. ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. వాహనాలపై ఈ నిబంధనను ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. BS-IV వాహనాలకు సంబంధించి విధించే మరో ఆంక్ష నుంచి CNG వాహనాలకు మినహాయింపు ఉంటుందని మంత్రి సిర్సా చెప్పారు.
పార్కింగ్ ఛార్జీలు డబుల్..
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఢిల్లీలోని అధికారిక పార్కింగ్ కేంద్రాల్లో ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ పెంపు వర్తించదు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వహించే పార్కింగ్ కేంద్రాలకు కూడా మినహాయింపు ఇచ్చారు.
ఆఫీసుల టైమింగ్స్‌లోనూ మార్పులు..
నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేయనున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తమ సిబ్బందిలో 50 శాతం మందితోనే ఆఫీసుల నుంచి పని చేయించి.. మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని ప్రభుత్వం సూచించింది.
మరో 150 ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ఢిల్లీ రవాణా వ్యవస్థలో మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను చేర్చనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 5,088 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు మెట్రో, బస్ స్టాప్‌లకు సులభంగా చేరుకునేలా పరిసర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని కూడా మెరుగుపరచనున్నారు.
‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’..
ఢిల్లీలోని 500 పెట్రోల్ బంకుల్లో ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల సాయంతో పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలను గుర్తించనున్నారు. అక్టోబర్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. నవంబర్‌లో కాలుష్య పరీక్షా కేంద్రాలను మరింత ఆధునీకరించనున్నారు. దాదాపు 2.5 లక్షల వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించేందుకు మూడు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు.
నిర్మాణ పనులపై కఠిన ఆంక్షలు..
కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన దుమ్మును నియంత్రించేందుకు నిర్మాణ, కూల్చివేత పనులపై దశలవారీగా ఆంక్షలు విధించనున్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు దుమ్ము ఉత్పత్తి చేసే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ పనులను నిషేధించనున్నారు. డిసెంబర్ 10 నుంచి జనవరి 20 వరకు నిర్మాణ, కూల్చివేత పనులపై పూర్తిస్థాయి నిషేధం అమల్లో ఉంటుంది. ఇందులో ఇండోర్ పనులు కూడా ఉంటాయి.
62 కాలుష్య హాట్‌స్పాట్లపై నిఘా..
ఢిల్లీలో గుర్తించిన 62 కాలుష్య హాట్‌స్పాట్లలో 42 ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి హాట్‌స్పాట్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో కాలుష్యానికి కారణమవుతున్న అంశాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 2026లో మొత్తం 3,065 కిలోమీటర్ల రహదారులను పునరాభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 20 నాటికి 1,193 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అక్టోబర్ 31 నాటికి మార్కెట్లతో సహా అన్ని రహదారులను డీప్ క్లీనింగ్ చేయాలని నిర్ణయించారు. గుంతలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను 72 గంటల్లో పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
70 లక్షల లక్ష్యాన్ని దాటిన మొక్కల పెంపకం..
పచ్చదనం పెంచే కార్యక్రమంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 71 లక్షల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి కేవలం మొక్కలు నాటడంపైనే కాకుండా అవి బతికి ఉన్నాయా లేదా అన్నదానిపై దృష్టి పెట్టనున్నారు. 2027 మార్చిలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: మరింత శక్తివంతంగా ఎల్ నినో


