కౌలాలంపూర్: మలేషియాలో అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన మహతీర్ మహమ్మద్ భార్య, డాక్టర్ సితి హస్మాహ్ మహమ్మద్ అలీ సోమవారం 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కౌలాలంపూర్‌లోని నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 28 ఉదయం 9:20 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని, మలేషియా పరిపాలనా రాజధాని పుత్రజయలోని ఒక ముస్లిం శ్మశానవాటికలో ఆమెను ఖననం చేస్తారని మహతీర్ కార్యాలయం పేర్కొంది.
సితి హస్మాహ్ మృతి పట్ల ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం సంతాపం వ్యక్తం చేశారు , ఆమెకు పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఆమెలోని మాతృమూర్తి స్వరూపాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది, అలాగే ఆమె సేవలను , కృషిని గౌరవిస్తుందని అన్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎవరీ డా. సితి
డాక్టర్ సితి హస్మా 1926 జూలై 12న జన్మించారు. ఈ ఏడాదే ఆమె తన 100వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మాజీ ప్రధాని మహతీర్(101)తో ఆమె వివాహం జరిగి 70 ఏళ్లు పూర్తయింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, గ్గురు కుమార్తెలు 18 మంది మనవళ్లు, మనవరాళ్లు, నలుగురు మునిమనవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు.
ఇదీ చదవండి: పెళ్లైన 5 నెలలకే టెకీ ఆత్మహత్య
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న సితి హస్మాహ్, నిరాడంబరమైన వ్యక్తిత్వానికి , హాస్య చతురతకు ప్రసిద్ధి చెందారు. ఒక సందర్భంలో ఆమెను తన విజయానికి వెన్నెముకగా మహతీర్ అభివర్ణించారు. అలాగే, ఆ కాలంలో మలేయ్ జాతి మహిళల్లో అరుదుగా కనిపించే 'యూనివర్సిటీ డిగ్రీని సాధించాలనే ఆమె పట్టుదల'ను తాను ఎంతో మెచ్చుకునేవాడినని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నటి రకుల్ ప్రీత్ మామ, నిర్మాత వాషు భగ్నానీలపై ఐటీ సోదాలు
సితి హస్మా సింగపూర్‌లోని కింగ్ ఎడ్వర్డ్ VII కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నుండి ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేశారు. మలేషియాలో తొలితరపు మహిళా వైద్యులలో ఒకరిగా నిలిచారు. 1965లో కెదా రాష్ట్ర మాతా శిశు సంరక్షణ విభాగంలో తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా, 1974లో తొలి మహిళా స్టేట్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గ్రామీణ వైద్యం, కుటుంబ నియంత్రణ, మహిళా ఆరోగ్యం కోసం విశేషంగా కృషి చేశారు.
అవార్డులు
ఆమె సేవలకు గుర్తింపుగా 2003లో 'సెరి సెతియా మహ్కోట మలేషియా (SSM)' అవార్డు లభించింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ మలయా, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ వంటి పలు అంతర్జాతీయ, జాతీయ యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. 1995లో బీజింగ్‌లో జరిగిన నాల్గవ ప్రపంచ మహిళా సదస్సుకు మలేషియా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. 'మై నేమ్ ఈజ్ హస్మా' (My Name is Hasmah) పేరుతో తన ఆత్మకథను కూడా ప్రచురించారు.


