T20I: చరిత్ర సృష్టించిన భారత సంతతి బ్యాటర్‌ | Malaysia Virandeep Singh Massive T20I Record Joins Babar Azam Kohli Rohit | Sakshi
Sakshi News home page

81 పరుగులకే ఖేల్‌ ఖతం!.. చరిత్ర సృష్టించిన భారత సంతతి బ్యాటర్‌

Sep 24 2026 4:39 PM | Updated on Sep 24 2026 4:46 PM

Malaysia Virandeep Singh Massive T20I Record Joins Babar Azam Kohli Rohit

ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్‌ టోర్నమెంట్లో మలేషియా బోణీ కొట్టింది. హాంకాంగ్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా మలేషియా వన్‌డౌన్‌ బ్యాటర్‌, భారత సంతతికి చెందిన విరణ్‌దీప్‌ సింగ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

81 పరుగులకే ఖేల్‌ ఖతం
జపాన్‌లోని నిశిన్‌ వేదికగా కరోగి స్పోర్ట్స్‌ పార్కులో టాస్‌ గెలిచిన హాంకాంగ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మలేషియా బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 81 పరుగులే చేయగలిగింది.

ఓపెనర్‌ నిజాకత్‌ ఖాన్‌ (19), టెయిలెండర్‌ హసన్‌ ఖాన్‌ మొహమ్మద్‌ (13*) డబుల్‌ డిజిట్‌ స్కోర్లు దాటగా.. శివ్‌ మాథూర్‌ 29 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. మలేషియా బౌలర్లలో పవన్‌దీప్‌ సింగ్‌, ముహమ్మద్‌ ఆమిర్‌ ఆజిమ్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్‌ సయ్యద్‌ అజీజ్‌ ముబారక్‌, ముహమ్మద్‌ వఫీక్‌, విరణ్‌దీప్‌ సింగ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

12 ఓవర్లలోనే టార్గెట్‌ ఉఫ్‌
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 12 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 84 పరుగులు సాధించింది. తద్వారా హాంకాంగ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు ముహమ్మద్‌ హజీక్‌ ఐమన్‌ (6), అజీజ్‌ ముబారక్‌ (6) విఫలం కాగా.. విరణ్‌దీప్‌ సింగ్‌ 32, ముహమ్మద్‌ సైహాదత్‌ 36 పరుగులతో అజేయంగా నిలిచి మలేషియా గెలుపును ఖరారు చేశారు.

అసోసియేట్‌ జట్ల తరఫున సరికొత్త చరిత్ర
కాగా ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 32 పరుగులు చేసిన విరణ్‌దీప్‌ సింగ్‌.. సరికొత్త చరిత్ర లిఖించాడు. అసోసియేట్‌ జట్ల తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.

మలేషియా తరఫున 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విరణ్‌దీప్‌ సింగ్‌ ఇప్పటికి 126 మ్యాచ్‌లు ఆడి.. 3513 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక విరణ్‌దీప్‌ సింగ్‌ అన్న పవన్‌దీప్‌ సింగ్‌ కూడా మలేషియా తరఫున రాణిస్తున్నాడు. వీరిద్దరు ప్రస్తుతం ఆసియా క్రీడలతో బిజీగా ఉన్నారు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు (ఓవరాల్‌గా)
👉బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)- ఇప్పటికి 4596 పరుగులు
👉జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌)- ఇప్పటికి 4384 పరుగులు
👉రోహిత్‌ శర్మ (ఇండియా)- 4231 పరుగులు
👉విరాట్‌ కోహ్లి (ఇండియా)- 4188 పరుగులు
👉పాల్‌ స్టిర్లింగ్‌ (ఐర్లాండ్‌)- ఇప్పటికి 3895 పరుగులు
👉మార్టిన్‌ గప్టిల్‌ (న్యూజిలాండ్‌)- 3531 పరుగులు
👉విరణ్‌దీప్‌ సింగ్‌ (మలేషియా)- ఇప్పటికి 3515 పరుగులు.

చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. చరిత్రకు అడుగుదూరంలో కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement