అత్తా కోడళ్లు అంటే పచ్చగడ్డి వేస్తే భగ్గమన్నట్లు ఉంటారనేది జగమెరిగిన సత్యం. ఎక్కడో గానీ ఇరువురి మధ్య సఖ్యత అన్నది అరుదు. ఏదో ఒక విషయంలో పేచీలు వచ్చేస్తుంటాయి. అలానే కోడల్ని కూతురిలా ఆదరించేవాళ్లు కూడా అరుదే. అందులోనూ ఈ రోజుల్లో ఉన్న స్వార్థం, పేరాశల ముందు అంత గొప్ప మనసు ఉండటం అనేది అత్యంత కష్టం. కానీ ఈ అత్తది ఎంత గొప్ప మనసంటే..ఆమె కథ వింటే మనసు కరిగిపోతుంది. అత్త అన్న బంధం మీద ఉన్న అభిప్రాయం మారిపోతుంది కూడా.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన సునీత అనే అత్తమ్మ అమ్మలా మారి కోడలికి మంచి జీవితాన్ని ప్రాసాదించింది. హరిద్వార్‌కు చెందిన ఆమె కోడలు మీనాక్షికి ఆమె అంగీకారంతోనే పెళ్లి చేసి కొత్త జీవితాన్ని అందించింది. సునీత కోడలు మీనాక్షికి తన కొడుకు రోహిత్‌తో పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. అయితే ఈ ఏడాది ఆగస్టు 14న సునీత భర్త కేన్సర్‌తో చనిపోయాడు. అతడు చనిపోయిన మరుసటి రోజే రోహిత్ ఆకస్మికంగా చనిపోయాడు. అంటే ఆగస్టు 15 కొడుకుని కూడా పోగొట్టుకుంది.
అసలు ఈ బాధను దిగమింగక మునుపే కోడలు అనాథగా మారిపోకూడదని బాధ్యతతో వ్యవహరించింది సునీత. కనీసం నెల కూడా గడవక మునుపే రాజస్థాన్ నారాయణపూర్‌కు చెందిన చాట్ విక్రేట యోగేష్‌తో వివాహం జరిపించింది. ఈ బుధవారమే ఆర్యసమాజ్‌లో వివాహం జరిపించింది. మీనాక్షి మరిది అన్నగారిగా కన్యాదానం చేయిపించి మరి పెళ్లి జరిపించింది సునీత. అంతేగాదు కొత్త జీవితంలోకి వెళ్తున్నప్పటికీ..నీతో మా సంబంధాన్ని కొనసాగిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు మరిది మోహిత్, అత్త సునీత.
ఈ వివాహం అక్కడ చర్చనీయాంశంగా మారి ఈ రోజుల్లో ఇలాంటి అత్తలు కూడా ఉన్నారా అని అంతా విస్తుపోయారు. ఇక్కడ కోడలు మీనాక్షికి రితూ(7), ఏడాదిన్నర వయసున్న అవిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె అలా ఇద్దరి పిల్లలతో రోడ్డున పడకూడదని అమ్మలా ఆలోచించి మంచి భవిష్యత్తు అందేలా అండగా నిలిచిన ఈ అత్తమ్మ నిజంగా స్ఫూర్తిదాయకం కదూ. అలాగే భర్తను, కుమారుడిని పోగొట్టుకుని కనీసం నెల కూడా పూర్తి కాకమునుపే ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఆ అత్తమ్మ పెద్ద మనసుకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..!.
ఇదీ చదవండి:


