ఇంట్లో భార్యతో హీరోనే... మరో స్త్రీతో జీరో ! | Relationship Advice, Why You May Struggle With An Extramarital Partner Despite A Happy Married Life | Sakshi
Sakshi News home page

ఇంట్లో భార్యతో హీరోనే... మరో స్త్రీతో జీరో !

Sep 24 2026 1:00 PM | Updated on Sep 24 2026 1:35 PM

Relationship With Another Woman While Being Married

నా వివాహమయి పది సంవత్సరాలయ్యింది. ఇద్దరు పిల్లలు, నా భార్యతో నాకు అన్ని విధాలా సంతృప్తిగానే ఉంది. అయితే ఇటీవల అనుకోకుండా ఇంకొక స్త్రీతో పరిచయం ఏర్పడినా ఆమెతో ముందుకు వెళ్లలేకపోతున్నాను. దాంతో నాలో  ఏదో లోపం ఉందేమోనన్న భయం ఏర్పడింది. రెండు రోజుల తర్వాత నా భార్యతో హ్యాపీగానే గడిపాను. వాస్తవంగా నాలో ఏదైనా బలహీనత ఉంటే నా భార్యతో బాగానే ఉంటున్నాను కదా, మరి ఆ కొత్త వ్యక్తితో ఎందుకు ఫెయిలవుతున్నానో అర్థం కావడం లేదు. ఇంటా బయటా నేను అన్ని విధాలుగా బాగుండాలంటే ఏం చేయమంటారో చెప్పండి!

– మురళీధర్, కాకినాడ.
మీరడిగిన దాంట్లో రెండు ముఖ్య విషయాలున్నాయి. భార్య ఉండగా, బయటి స్త్రీతో సంబంధం పెట్టుకోవడమనేది నైతిక విలువలకు, భార్యాభర్తల సంబంధంలో ఉన్న నమ్మకాలకు సంబంధించినది. భార్యతో సంతోషంగా ఉన్నప్పుడు, ఇతరులతో వెళ్లాల్సిన అవసరం లేదు. దీనినెవరూ సమర్థించరు. ఇక రెండోది, బయటి స్త్రీతో ఫెయిల్‌ కావడమనేది మానసికమైనది. ఆ సమస్యను మానసిక పద్ధతుల ద్వారా నయం చేయవచ్చు. కానీ అనైతిక విషయానికి వైద్యం చేయడం వైద్యులుగా మాకు కూడా అనైతికమే.  

అసలు విషయానికి వస్తే ఇతరుల ఇంట్లో దొంగతనానికి వెళ్లిన వ్యక్తికి ఎలాంటి భయాందోళనలు వుంటాయో, పరస్త్రీ విషయంలో కూడా అలాంటి ఆందోళన ఉంటుంది. తన సొంత వస్తువును అనుభవించిన దాంట్లో ఉన్నంత మనశ్శాంతి, తృప్తి పరుల వస్తువులను అనుభవిస్తున్నపుడు ఉండవు. మీలో ఎలాంటి లోపం లేదు కాబట్టే, మీ భార్యతో మీరు సంతోషంగా గడపగలుగుతున్నారు. సక్సెస్‌ కావాలంటే శరీరంతో పాటు మనసులో ఎలాంటి అలజడులు, ఆలోచనలు ఉండకూడదు. పరాయి వారి విషయంలో మీకు తెలియకుండానే, ఏదో తప్పు చేస్తున్నానే అపరాధ భావన, ఇతరులకు తెలిసిపోతుందనే ఆందోళన, హడావిడి, ఇవన్నీ మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి. లైసెన్స్‌ లేకుండా బండి డ్రైవ్‌ చేసే వ్యక్తికి, పోలీసులు ఎక్కడ పట్టుకుంటారనే ఆందోళన మనసులో ఉంటుందో, ఆ విషయంలో కూడా అంతే! అందుకే మీ సొంత వ్యక్తితోనే జీవితం సాగించడం అన్ని విధాలా మీకు ఆరోగ్యకరం! ముందు మీ మనసును చక్కదిద్దుకోండి. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు 
పంపవలసిన మెయిల్‌ ఐడీ:sakshifamily3@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement