పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మైలవరం ఏఎంసీ చైర్మన్ నవ్యశ్రీతో కలిసి కేకును కట్ చేస్తున్న ఎడ్ల సుధాకర్ (ఫైల్)
మైలవరం: తనతో అసభ్యంగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపేస్తానంటూ బెదిరించిన జనసేన నేతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కొత్తగూడెంలో జరిగిన ఘటనకు సంబంధించి బాధిత మహిళ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మహిళను పొరుగున ఉన్న బాడవ గ్రామానికి చెందిన జనసేన నేత ఎడ్ల సుధాకర్ వేధిస్తూ, లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలపగా పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి జనసేన నేతను మందలించారు.
అయినా తీరు మార్చుకోని సుధాకర్, సదరు వివాహితతో ఫోన్లో మాట్లాడేందుకు ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఆమె వద్దకు పంపాడు. ఆమె మాట్లాడేందుకు నిరాకరించడంతో సుధాకర్ వివాహిత వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించి, ఆమెపై దాడి చేశాడు. బాధిత మహిళను, ఆమె భర్తను కూడా చంపేస్తానంటూ బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించాడు.
తనపై జరిగిన దాడిని కుటుంబీకులకు తెలిపిన బాధిత మహిళ, వారితో కలిసి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జనసేన నేతతో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని శుక్రవారం స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు, కేసు నమోదు చేసి వెంటనే విడుదల చేశారు. దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయి, ప్రత్యక్ష ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.


