ఐదు రోజులపాటు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: అల్పపీడనం, ద్రోణుల ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం వెల్లడించారు.
అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. మంగళవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. అలాగే ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి ఉందన్నారు. దీని ప్రభావంతో ఆదివా రం నుంచి ఐదు రోజులపాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. వేటకు వెళ్లిన మత్స్య కారులు వెంటనే తీరానికి రావాలన్నారు.


