సర్కారు సయ్యాట! | AP EAPCET: Skill test for candidates after admissions are completed | Sakshi
Sakshi News home page

సర్కారు సయ్యాట!

Sep 20 2026 4:44 AM | Updated on Sep 20 2026 4:44 AM

AP EAPCET: Skill test for candidates after admissions are completed

ఏపీ ఈఏపీ సెట్‌లో అడ్మిషన్లు పూర్తయ్యాక అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌

ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి.. తరగతులు ప్రారంభం 

స్పోర్ట్స్‌ రిజర్వేషన్‌ ఉన్నా వినియోగించుకోలేకపోయిన 692 మంది అభ్యర్థులు 

ఇప్పుడు మెరుగైన కాలేజీల్లో సీటు వచ్చినా చేరలేని పరిస్థితి 

సర్కారు నిర్ణయంపై తల్లిదండ్రుల ఆగ్రహం 

పాలిటెక్నిక్, ఈసెట్‌ సీట్ల భర్తీలో పాటించని స్కిల్‌ టెస్ట్‌ విధానం

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా లీలల నేపథ్యంలో సరికొత్త డ్రామా అని విమర్శలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందనడానికి ఏపీఈఏపీ సెట్‌ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు స్కిల్‌ సెట్‌ నిర్వహణ తీరే నిదర్శనం. సర్కారు నిర్వాకంతో ప్రామాణిక ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవు­తు­న్నారు. ఏపీ ఈఏపీసెట్‌–2026లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయించారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మొదటి, రెండవ, మూడో (చివరి) దశ కౌన్సెలింగ్‌ కూడా ఈనెల 17తో పూర్తయింది. పైగా తరగతులు సైతం ప్రారంభమై నెల రోజులు గడుస్తోంది. కానీ స్పోర్ట్స్‌ కోటా కింద సీట్ల కేటాయింపు మాత్రం నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో స్పోర్ట్స్‌ కోటా కింద అర్హులైన 692 మంది విద్యార్థులు జనరల్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందాల్సి వచ్చింది. తమకు స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ ఉన్నా ఉపయోగించుకోలేకపోయినట్టయింది. అంతా పూర్తయ్యాక ఇప్పుడు శాప్‌ ఆధ్వర్యంలో స్కిల్‌ టెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. మరోపక్క ఇప్పటికే పూర్తయిన పాలిటెక్నిక్, ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో ఇదే స్పోర్ట్స్‌ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి స్కిల్‌ టెస్ట్‌ లేకుండానే సీట్లు ఇవ్వడం, ఈఏపీసెట్‌ అభ్యర్థులకు మాత్రం స్కిల్‌ టెస్ట్‌ నిర్వహణపై తీవ్ర దుమారం రేగుతోంది.

ఆ సీట్లు ఏం చేస్తారు?
ఈఏపీ సెట్‌లో చివరి దశ కౌన్సెలింగ్‌ ఈనెల17తో ముగిసింది. అలాగే, స్పెషల్‌ కేటగిరీ (స్పోర్ట్స్‌) సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జూలై నెలలోనే పూర్తి చేశారు. అప్పటి నుంచి ఉన్నత విద్యా శాఖ స్పోర్ట్స్‌ కోటాపై సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో దాదాపు 692 మంది అర్హులైన మెరిటోరియస్‌ స్పోర్ట్స్‌ అభ్యర్థుల్లో చాలా మంది సాధారణ కౌన్సెలింగ్‌లో వివిధ కాలేజీల్లో చేరిపోయారు. ఇప్పుడు స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా వారికి స్పోర్ట్స్‌ కోటా సీట్లు భర్తీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో వారికి మెరుగైన కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం ఏర్పడుతుంది. అయితే, ప్రస్తుతం చేరిన కాలేజీల్లో ఖాళీ అయిన సీట్లను ఎవరితో భర్తీ చేస్తారు? అనేదానికి ఉన్నత విద్యాశా>ఖ వద్ద సరైన సమాధానం లేదు. మూడో దశ కౌన్సెలింగ్‌కు ముందే స్పోర్ట్స్‌ కోటా సీట్లు భర్తీ చేసినట్లయితే, జనరల్‌ అభ్యర్థులకు మరికొన్ని మెరుగైన కాలేజీలు ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంతో అన్ని విధాలా విద్యార్థులు నష్టపోయినట్టయింది.

ఒకే ఏడాది భిన్న విధానాలా?
ఏపీ ఈఏపీ సెట్‌కి సంబంధించి స్పెషల్‌ కేటగిరీ (స్పోర్ట్స్‌) సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన అభ్యర్థులకు సోమవారం(ఈనెల 21న) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోచ్‌ల సమక్షంలో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇటీవల ముగిసిన పాలిటెక్నిక్, ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో మాత్రం స్పోర్ట్స్‌ అభ్యర్థులకు ఎలాంటి స్కిల్‌ టెస్ట్‌ లేకుండానే సర్టిఫికెట్ల ఆధారంగా స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ అమలు చేశారు. ఒకే విద్యా సంవత్సరంలో స్పోర్ట్స్‌ కోటాపై ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు భిన్నమైన విధానాలు అనుసరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ‘స్కిల్‌’ టెస్ట్‌ అంటూ సర్కారు మరో డ్రామాకు తెరలేపిందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement