టార్గెట్‌ టాప్‌–100 | IITH Director Professor BS Murty in a special interview with Sakshi | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ టాప్‌–100

Sep 20 2026 1:54 AM | Updated on Sep 20 2026 1:54 AM

IITH Director Professor BS Murty in a special interview with Sakshi

ప్రపంచస్థాయి విద్యాసంస్థల్లో ఒకటిగా ఐఐటీ హైదరాబాద్‌ను నిలపడమే లక్ష్యం

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి

ప్రపంచస్థాయి పరిశోధనలు, ఆవిష్కరణల కేంద్రంగా సంస్థను తీర్చిదిద్దుతున్నాం 

ప్రతి ఇంజనీరింగ్‌ విభాగంలోనూ కృత్రిమ మేధను    చేరుస్తున్నాం... స్టార్టప్‌ల సృష్టికర్తలుగా ఎదిగేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం 

వారి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేస్తున్నాం.. సాంకేతిక వసతులు అందిస్తున్నాం

కల్వల మల్లికార్జున్‌రెడ్డి 
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని టాప్‌–100 విద్యాసంస్థల్లో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్‌ను కేవలం ఇంజనీరింగ్‌ విద్యను అందించే సంస్థగా కాకుండా ప్రపంచస్థాయి పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పరిశోధనలు, సాంకేతికత, విద్యార్థులు, విద్యాసంస్థలకు చోదక శక్తిగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్యాంపస్‌ కొలువుల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉత్పత్తులు, స్టార్టప్‌ల సృష్టికర్తలుగా ఎదిగేలా కోర్సుల ఎంపికలో స్వేచ్ఛ, ప్రాజెక్టు ఆధారిత విద్య, వారి ఆలోచనలకు ఆర్థిక సహాయం, స్టార్టప్‌లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. కృత్రిమ మేధను ప్రతి ఇంజనీరింగ్‌ విభాగంలోకి తీసుకెళ్లడంతోపాటు సెమీ కండక్టర్లు, 6జీ, ఫొటానిక్స్, కీలక ఖనిజాలు, వైద్య సాంకేతికత, అధునాతన తయారీ వంటి రంగాల్లో పరిశోధనలను విస్తరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌గా వరుసగా రెండోసారి కూడా కొనసాగుతున్న ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి.. సాక్షి దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సంస్థ పనితీరు, భవిష్యత్‌ ప్రణాళికలతోపాటు విద్యార్థుల భవితకు సంబంధించి మనోగతాన్ని ఆవిష్కరించారు. 

ప్రశ్న: వచ్చే ఐదేళ్లలో ఐఐటీ హైదరాబాద్‌ను ఎలా చూడాలనుకుంటున్నారు? 
బీఎస్‌ మూర్తి: వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని తొలి అగ్రశ్రేణి వంద విద్యాసంస్థల జాబితాలోకి ఐఐటీ హైదరాబాద్‌ను తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. అయితే ర్యాంకు ఒక్కటే ముఖ్యం కాదు. నాణ్యమైన పరిశోధన, మంచి అధ్యాపకులు, ప్రతిభావంతులైన పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, అంతర్జాతీయస్థాయి మౌలికవసతులు, పరిశ్రమలతో అనుసంధానం.. ఇవన్నీ కలిసే ప్రపంచస్థాయి సంస్థను నిర్మిస్తాయి. 

విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా సృష్టికర్తలుగా ఎలా తీర్చిదిద్దుతున్నారు? 
ప్రతి సెమిస్టర్‌లో విద్యార్థుల నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనలు తీసుకుంటున్నాం. మంచి ఆలోచనలకు రూ. లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రెండో సంవత్సరం తర్వాత అంకుర సంస్థ ప్రారంభించాలనుకునే విద్యార్థికి ప్రత్యేక ధ్రువపత్రంతో క్యాంపస్‌లోనే సాంకేతిక వసతులు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నాం. గతేడాది మా స్టార్టప్‌లు రూ. 1,500 కోట్ల ఆదాయ స్థాయికి చేరాయి. ప్రస్తుతం 810 పేటెంట్లు ఉన్నాయి. ఒక్క ఏడాదిలోనే సుమారు 250 పేటెంట్లు వచ్చాయి. అయితే పేటెంట్‌ తీసుకోవడం దగ్గరే ఆగిపోవద్దు. అది పరిశ్రమకు చేరి ఉత్పత్తిగా మారాలి. అందుకే ఆవిష్కరణ విభాగం, సాంకేతిక బదలాయింపు విభాగం, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేశాం. 

పరిశ్రమలతో భాగస్వామ్యాలను ఎలా విస్తరిస్తున్నారు? 
గ్రీన్‌కో, కోల్‌ ఇండియా, యశోద ఆసుపత్రి వంటి సంస్థలతో కలిసి ప్రత్యేక పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కీలక ఖనిజాల ప్రాసెసింగ్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ వంటి రంగాల్లో ప్రత్యేక ఎంటెక్‌ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ఈ రంగంలో పరిశ్రమకు అవసరమైన నిపుణులను తయారు చేయడం లక్ష్యం. ఇది ప్రపంచంలోనే ఈ తరహాలో తొలి కోర్సు అని మేము భావిస్తున్నాం. కోర్సుల రూపకల్పనలో పరిశ్రమను భాగస్వామిగా చేస్తున్నాం. అంతర్జాతీయ భాగస్వామ్యాలను కూడా పెంచుతున్నాం. జర్మనీ, జపాన్‌ తదితర దేశాల విశ్వవిద్యాలయాలతో విద్యార్థుల పరస్పర మారి్పడి కార్యక్రమాలు, పరిశోధన సహకారాలను కూడా పెంచుతున్నాం. 

ఏఐను ప్రతి ఇంజనీరింగ్‌ విభాగంలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? 
ఏఐను ప్రత్యేక పాఠ్యాంశంగా మాత్రమే బోధించడం సరిపోదు. అందుకే ఈ ఏడాది నుంచి ప్రతి బీటెక్‌ విద్యార్థి మొత్తం పాఠ్యాంశాల్లో సుమారు 10 శాతం వరకు కృత్రిమ మేధకు సంబంధించిన అంశాలను చదివేలా చేస్తున్నాం. మా వద్ద ఏఐలో 35 మంది అధ్యాపకులు ఉన్నారు. సివిల్, మెకానికల్, రసాయన, జీవవైద్య రంగాల ప్రొఫెసర్లు కూడా పరిశోధనల్లో ఏఐను ఉపయోగిస్తున్నారు.  
సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాలు, అణు సాంకేతికతపై పరిశోధనల సంగతేంటి? 
సెమీ కండక్లర్లు భవిష్యత్‌ సాంకేతికతకు పునాది. అందుకే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక సెమీ కండక్టర్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. ఏటా సుమారు 100 మంది ఇంజనీర్లు, మరో 100 మంది ఆపరేటర్లకు ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. ఇక కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక ఎంటెక్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ తరహాలో ప్రపంచంలోని తొలి కార్యక్రమాల్లో ఇదొకటి. విద్యా పరిశోధన కోసం సూక్ష్మ అణు రియాక్టర్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. 

విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నారా? 
ఉద్యోగం కోసమే చదువు అన్నట్లుగా కాలేజీ వాతావరణం ఉండకూడదు. అందుకే ప్రత్యేక మానసిక ఆరోగ్య సలహా వ్యవస్థను ఏర్పాటు చేశాం. విద్యార్థులు కుటుంబంలో ఉన్నట్టుగా భావించే సహాయక వాతావరణం కల్పిస్తున్నాం. వారి సమస్యలను తొలిదశలోనే గుర్తించి సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. 

గ్రామీణాభివృద్ధికి సంస్థ ఏ మేరకు తోడ్పడుతోంది? 
మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎదిగితేనే మీ ఎదుగుదల పూర్తవుతుందనేది మా ఆలోచన. ప్రస్తుతం సుమారు ఏడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది వాటిని 15 గ్రామాలకు విస్తరించాలనుకుంటున్నాం. విద్యార్థులు గ్రామాలకు వెళ్లి పిల్లలకు బోధించడం, సాంకేతిక పరిజ్ఞానం అందించడం చేస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ, వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతున్నారు. 

వికసిత భారత్‌పై మీ అభిప్రాయం? 
దేశంలో తయారైన ఒక ఉత్పత్తి ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉపయోగపడాలి. మన సాంకేతికత ప్రపంచానికి అవసరమైనదిగా మారాలి. స్వయం సమృద్ధి అంటే మన అవసరాలు మనమే తీర్చుకోవడం మాత్రమే కాదు.. మన ఉత్పత్తులు, సాంకేతికత ప్రపంచానికి ఉపయోగపడే స్థాయికి చేరడం. విద్యార్థులు కేవలం ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఏదైనా స్వయంగా నిర్మించే వారిగా మారాలి. అందుకే ‘భారతి’పేరుతో విద్యార్థులు చిన్న బృందాలుగా ఏర్పడి వారి ఆలోచనలపై పనిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం. హాస్టళ్లు వర్క్‌షాపులుగా మారాలి. విద్యార్థులు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనకు రావాలి. అప్పుడే నిజమైన ఇంజనీర్లు తయారవుతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement