వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక! | 1,000 Year Rainfall Threat, Heavy Rains And Flash Floods May Hit Four US States, Check More Details | Sakshi
Sakshi News home page

వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక!

Sep 17 2026 12:08 PM | Updated on Sep 17 2026 1:07 PM

Rainfall Risk Reaches Once in 1 000 Year Levels usa

వాషింగ్టన్‌: అమెరికా నైరుతి ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలను రానున్న రోజుల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అరిజోనా, న్యూ మెక్సికో, ఉటా, కొలరాడోలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 12 అంగుళాల (సుమారు 30 సెం.మీ.) వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది సంభవిస్తే ‘1,000 ఏళ్లకు ఒకసారి’ చోటుచేసుకునే స్థాయి వర్షపాతంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో దాదాపు కోటి మంది అమెరికన్లు వరదల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా వరద హెచ్చరికలను అమెరికా జాతీయ వాతావరణ శాఖ జారీ చేసింది. తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపింది. గంటకు 2–3 అంగుళాల వర్షపాతం నమోదయ్యేంత తీవ్రత ఉండొచ్చని పేర్కొంది. స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో 12 అంగుళాల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్‌ వాతావరణ నిపుణులు తెలిపారు. ఫీనిక్స్, టక్సన్‌ ప్రాంతాల్లో శుక్రవారం నాటికి 2–4 అంగుళాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే అరిజోనాలో భారీ వర్షాలు, వరదల పరిస్థితి నెలకొంది. బుధవారం (సెప్టెంబర్‌ 16) టక్సన్‌లో అరగంట వ్యవధిలో మూడు అత్యవసర ఘటనలను అగ్నిమాపక సిబ్బంది పరిష్కరించారు. పాక్షికంగా నీటిలో మునిగిన కారుపై చిక్కుకున్న ఓ డ్రైవర్‌ను రక్షించారు. మరో వాహనదారుడు నార్త్‌ అలామో అవెన్యూ, ఈస్ట్‌ రోజ్‌వుడ్‌ స్ట్రీట్‌ వద్ద కారులో చిక్కుకోగా.. వరద నీటిలో కొట్టుకుపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించాయి. మరో వ్యక్తి గ్రాంట్‌ రోడ్‌, వ్యాట్‌ డ్రైవ్‌ సమీపంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా సకాలంలో కాపాడారు.

ఈ సమయంలో నైరుతి అమెరికాలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు సాధారణమేనని అక్యూవెదర్‌ నిపుణులు తెలిపారు. ఈ ప్రాంతంలో గాలుల దిశ మారడంతో మెక్సికో, కాలిఫోర్నియా గల్ఫ్‌ నుంచి వేడి, తేమతో కూడిన గాలి ఉత్తర దిశగా వస్తుంది. తేమ పైకి ఎగసి ఉరుములతో కూడిన వర్షాలుగా మారుతుంది. కొలరాడో, న్యూ మెక్సికో, నెవాడాలోని కొన్ని ప్రాంతాలకు వర్షం అవసరమైనప్పటికీ.. ఆకస్మికంగా భారీ వర్షాలు కురిస్తే వరదలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఇదే చివరి భారీ వర్షాల ఉద్ధృతి కావచ్చని, అయితే బలమైన ఎల్‌నినో పరిస్థితులు దీనిని మార్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మోదీ 76వ పుట్టినరోజు.. 76 కప్పుల టీ ఉచితం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement