ఆమె ఓ ఐపీఎస్ అధికారిణి. యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో వాళ్లను మోటివేట్ చేసేందుకు తన జర్నీనే చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఆ వీడియో నెట్టింట దుమారం రేపింది. ఓ హిందూ సంఘం అభ్యంతరాలతో ఏకంగా రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో.. ప్రభుత్వం ఆమెను మరో విభాగానికి బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పశ్చిమ బెంగాల్‌లో ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో(IPS Bushra Bano) వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఆమెను సోమవారం రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్‌గా బదిలీ చేశారు. అయితే ఆమెపై ఫిర్యాదు, ఆగమేఘాల మీద బదిలీకి మధ్య జరిగింది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2021 బ్యాచ్‌కు చెందిన బుష్రా బానో(Bushra Bano).. సెప్టెంబర్ 13న యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో తాను సివిల్ సర్వీసెస్‌కు ఎలా సిద్ధమయ్యారో వివరించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)లోని రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ తన యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఎంతో సహాయపడిందని చెప్పారు. చదువుకు అవసరమైన స్టడీ మెటీరియల్, లైబ్రరీ, టెస్ట్ సిరీస్ వంటివి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. వీడియో ప్రారంభంలో ‘అస్సలామువాలైకుమ్’, మధ్యలో ‘ఇన్‌షా అల్లా’, చివర్లో ‘జజాకల్లా’ వంటి పదాలను ఉపయోగించారు. దీనిపై ఎక్స్(ట్విటర్)లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జై హింద్’, ‘వందేమాతరం’ వంటి జాతీయ అభివాదాలను ఆమె ఉపయోగించలేదని విమర్శించారు.
హిందూ లీగల్ ఫండ్ ఫిర్యాదు
ఈ వ్యవహారంపై ‘హిందూ లీగల్ ఫండ్’ అనే సంస్థ పశ్చిమ బెంగాల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ప్రజా వేదికపై భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే సర్వీసింగ్ అధికారిణి న్యూట్రల్‌గా ఉండాలని, జాతీయ అభివాదాలను ఉపయోగించాలని కోరినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
అయితే ఇది జరిగాక.. బుష్రా బానో ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అందుకు సువేందు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. బుష్రా బానో బదిలీపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆమెపై వచ్చిన ఫిర్యాదు కారణమా? లేదంటే సాధారణ పరిపాలనా బదిలీయా? అన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

సౌదీ నుంచి సివిల్స్ వరకు..
బుష్రా బానో ప్రయాణం కూడా ఆసక్తికరమే. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాకు చెందిన ఆమె అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా సాధించారు. వివాహం, కుటుంబ బాధ్యతల మధ్య కొంతకాలం సౌదీ అరేబియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి యూపీఎస్సీకి సిద్ధమయ్యారు.
ఆమె 2018లో యూపీఎస్సీలో 277వ ర్యాంక్ సాధించి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. అయితే రెండో బిడ్డకు గర్భవతిగా ఉండటంతో ఆ పోస్టులో చేరలేకపోయారు. ఆ తర్వాత మరోసారి యూపీఎస్సీ రాసి 2019లో 234వ ర్యాంక్ సాధించారు. ఈసారి ఐపీఎస్‌కు ఎంపికై.. పశ్చిమ బెంగాల్ కేడర్‌కు కేటాయించబడ్డారు.
ఖరగ్‌పూర్ నుంచి సాయుధ పోలీసులకు..
కెరీర్‌లో తొలి పోస్టింగ్ హుగ్లీ రూరల్ ఏఎస్పీగా చేపట్టిన బుష్రా బానో.. ఈ ఏడాది జూన్‌లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీగా పనిచేశారు. తాజాగా ఆమెను రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్‌గా బదిలీ చేశారు.
ఇదీ చదవండి: వీధుల్లో దీన స్థితిలో కోటీశ్వరుడు.. ఎందుకంటే!


