లండన్‌లో గంగా హారతి.. చరిత్రలో తొలిసారి! | Historic First Ganga Aarti on River Thames | Sakshi
Sakshi News home page

లండన్‌లో గంగా హారతి.. చరిత్రలో తొలిసారి!

Sep 15 2026 8:23 AM | Updated on Sep 15 2026 8:23 AM

Historic First Ganga Aarti on River Thames

లండన్‌: భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి లండన్‌లోని థేమ్స్‌ నది వేదికైంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో తొలిసారిగా థేమ్స్‌ నదీ తీరంలో గంగా హారతి నిర్వహించారు. లండన్‌లోని గ్రీన్‌విచ్‌లో చారిత్రక ఓల్డ్‌ రాయల్‌ నేవల్‌ కాలేజ్‌ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. ‘గంగా హారతి ఆన్‌ ద థేమ్స్‌: ఎ సెరిమనీ ఆఫ్‌ లైట్‌’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చిన్మయ మిషన్‌ యూకే, వార్షిక ‘టోటల్లీ థేమ్స్‌’ ఉత్సవంతో కలిసి నిర్వహించింది.

చిన్మయ మిషన్‌ 75వ వార్షికోత్సవంలో భాగంగా..
1951లో స్థాపించిన చిన్మయ మిషన్‌ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ హారతిని నిర్వహించారు. వేదాంత జ్ఞానాన్ని, సామాజిక సేవను ప్రోత్సహించే ఆధ్యాత్మిక సంస్థగా చిన్మయ మిషన్‌ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. వారణాసి, హరిద్వార్‌, రిషికేశ్‌లో గంగానది తీరంలో సాయంత్రం జరిగే హారతులను తలపించేలా థేమ్స్‌ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజారులు, భక్తులు సమన్వయంతో మంత్రోచ్ఛారణలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇత్తడి దీపాలతో హారతి ఇచ్చారు.

చిన్మయ మిషన్‌ గ్లోబల్‌ హెడ్‌ స్వామి స్వరూపానంద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆధ్యాత్మిక నాయకులు, బ్రిటన్‌లోని హిందూ సంస్థల ప్రతినిధులు, దక్షిణాసియా ప్రవాస సమాజానికి చెందిన పలువురు కూడా హాజరయ్యారు. గంగా నది భౌతిక అవసరాలను తీర్చడంతోపాటు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసారానికి ప్రతీకగా నిలుస్తుందని చిన్మయ మిషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. థేమ్స్‌ నదిలో స్థానిక పర్యావరణ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా హారతిని పూర్తిగా ఒడ్డునే నిర్వహించారు. నదిలోకి నూనె దీపాలు, పూలు, నైవేద్యాలు లేదా ఇతర పూజా సామగ్రిని వదలలేదు. కార్యక్రమం జరిగిన ప్రాంగణంలో ప్లాస్టిక్‌ను కూడా నిషేధించారు. పవిత్ర నదుల పట్ల సంప్రదాయ గౌరవాన్ని ఆధునిక పర్యావరణ బాధ్యతతో కలపడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. నెల రోజుల పాటు జరిగే ‘టోటల్లీ థేమ్స్‌’ ఉత్సవంలో భాగంగా తొలిసారి నిర్వహించిన గంగా హారతికి మంచి స్పందన రావడంతో.. ఇకపై లండన్‌ సాంస్కృతిక క్యాలెండర్‌లో దీనిని ఏటా నిర్వహించే కార్యక్రమంగా కొనసాగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: పాక్‌ మరో దురాగతం: 26/11 నిందితుల ఫొటోలు మాయం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement